Suryaa.co.in

Editorial

తెలంగాణ ఆగమాగం

– హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బీభత్సం
– రోడ్లపై కూలిపోయిన భారీ వృక్షాలు
– ఖమ్మంలో రోడ్లపై పడవలు
-ప్రభుత్వ వైఫల్యంపై ధర్నాలు
– నీటమునిగిన హైదరాబాద్
– హాస్టళ్లలో పిల్లల ఆగమాగం
– అనేకచోట్ల కరెంట్ కట్
– పలు రైళ్లు రద్దు
– రోడ్డుపైనే డిప్యూటీ సీఎం భట్టి
( సుబ్బు)

భారీ వర్షాలకు తెలంగాణ జనం బతుకు ఆగమవుతోంది. గత రెండురోజుల నుంచి ఎడతె రపి లేకుండా కురుస్తున్న భారీ వ ర్షాలకు జనం బతుకు ఆగమవుతోంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాల్లోని హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు. వారిని ఇళ్లకు పంపిస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు బీభత్సంగా మారింది. నల్లగొండ జిల్లా భీతావహంగా కనిపిస్తోంది. రాకపోకలు దాదాపు బందయ్యాయి. రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయి కనిపిస్తున్నాయి. అనేకచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. ఖమ్మం జిల్లాలో అయితే ట్రాన్స్‌ఫార్మర్లు కూడా మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లకు అడ్డంగా కూలిపోయిన చెట్లతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వరద నీరు ఇళ్లలోకి రావడంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. తొలిసారిగా ఖమ్మంలో రోడ్లపైకి పడవలు వచ్చిన పరిస్థితి. డిప్యూటీ సీఎం భట్టి శనివారం రాత్రి నుంచి అహర్నిశలు రోడ్డుపైనే పనిచేస్తున్నారు.

రాజధాని నగరమైన హైదరాబాద్ యధావిధిగా నీటితో మునిగిపోయింది. ఫలితంగా గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. శివారు ప్రాంతాలు ఇంకా నీటిలోనే మునిగిపోతూ కనిపిస్తున్నాయి.

ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 33 గ్రామాలకు వెళ్లే ర‌హ‌దారులు దెబ్బతిన‌గా.. క‌రీంన‌గ‌ర్‌లో 20 గ్రామాల రోడ్లు ధ్వంసమయ్యాయి. 20 గ్రామాల‌కు సంబంధాలు కట్‌ అయ్యాయి. మ‌హ‌బూబాద్లో 30గ్రామాలు, ఉమ్మడి మెద‌క్‌లో 8 గ్రామాల‌కు, నిజామాబాద్‌లో 7 గ్రామాలకు, న‌ల్గొండలో 4 గ్రామాల‌కు వెళ్లే ర‌హ‌దారులు కొట్టుక‌పోయాయి. 117 గ్రామాల‌కు రాక‌పోక‌లు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి.

భారీ వర్షానికి ఇల్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడ్‌ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.

ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరదగా వరద పోటెత్తుత్తున్నది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో వాగు పరివాహకంలోని 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్‌ గృహకల్ప, వెంకటేశ్వర్‌నగర్‌, మోతీనగర్‌, బొక్కలగడ్డ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. కాలనీలో నీటమునగడంతో బాధితులు ఇండ్లపైకి చేరుకున్నారు. వరద చుట్టుముట్టడంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇండ్లపై నుంచే రక్షించాలంటూ వరద బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఖమ్మం కాలువ ఒడ్డు వద్ద త్రీ టౌన్ ప్రాంత ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ములుగు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా ఎడతెరిపిలేపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్‌ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వర్షాల కారణంగా తాడ్వాయి మండలం మేడారం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున వీచిన భారీ గాలులతో 33 కేవీ ఫీడర్‌కు వెళ్లే 11 కేవీ విద్యుత్తు లైన్లో 16 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జల దిగ్బంధమైంది.పాఠశాల ఆవరణ మొత్తం నుడుం లోతు వరకు నీళ్లు నిలిచాయి. సుమారు 200 మంది విద్యార్థులు, ఉపాధ్యా యులు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొనడంతో అధికారులతో ఆదేశాలతో తాత్కాలింగా విద్యార్థు లను అక్కడ నుంచి తరలించి శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో సర్దుబాటు చేశారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి కొందరిని ఇంటికి పంపించారు.

తెలంగాణ – ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ – ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు ప్రవహిస్తుంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. హైవేపై మోకాళ్ల లోతు వరద ఉండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నగరంలోని అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆగకుండా వవాన పడుతున్నది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, అల్వాల్‌, తిరుమలగిరి, చిలుకలగూడ, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట, బొల్లారం, జవహర్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, కొంపల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, మెహిదీపట్నం, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, ఈసీఎల్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, మలక్‌పేట్‌, లో భారీగా వర్షం పడుతున్నది. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీపట్నం, మంచాల, యాచారంలో వాన కురుస్తున్నది.

భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. చంపాపేట, రెడ్డి కాలనీతోపాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది.

మూసారంబాగ్‌ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. హుస్సేన్‌ సాగర్‌లోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.కూకట్‌పల్లి, అల్లాపూర్‌ ప్రాంతాల్లో 20 ఇండ్లు నీటి మునిగాయి. వానకు తోడు బలంగా వీచిన గాలులతో గ్రేటర్‌ వ్యాప్తంగా 115 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య రైల్వేట్రాక్‌ కింద మట్టి కోతకు గురైంది. పట్టాల కింద నుంచి భారీగా వరద ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో ఆ మార్గంలో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 40 రైళ్లు వరకు రద్దయ్యాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున రైళ్లను అధికారులు దారి మళ్లించారు.

LEAVE A RESPONSE