Suryaa.co.in

Editorial

బాబు.. ఒక భరోసా!

– సెక్యూరిటీ సూచనలు బాబు బేఖాతర్
– అర్ధరాత్రి మళ్లీ బోటులో సింగ్‌నగర్‌కు
– బస్సులో నిద్ర
— ఐదేళ్లలో ఒక్కసారీ బయటకు రాని జగన్
– హెలికాప్టర్, పరదా పర్యటనలే
– బాబు స్టైలే వేరప్పా
( మార్తి సుబ్రహ్మణ్యం)

విజయవాడను వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. చుట్టూ నీళ్లు. ఇంట్లోకి వచ్చిన వర్షపునీరు. ఇంకాసేపట్లో తాము బతుకుతామో లేదో తెలియని భయానక పరిస్థితి. సెల్‌ఫోన్‌లో మాట్లాడదామంటే చార్జింగ్‌కు క రెంటు లేదు. ఇంట్లో పసిపిల్లలు పాల కోసం ఏడుపు. పిలిస్తే పలికే దిక్కు లేదు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నెంబరు తెలిసిన వాళ్లు ఆమెకు ఫోన్ చేస్తుంటే, సహాయ బృందాలు వస్తాయన్న భరోసా వినిపిస్తోంది. అది తెలియని వారు సహాయ బృందాలు వచ్చేవరకూ చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

ఈ పరిస్థితిని తన అనుభవంతో ముందే గ్రహించిన సీఎం చంద్రబాబునాయుడు అంతపెద్ద విపత్తులోనూ ప్రాణాలు లెక్కచేయకుండా.. నడుముకు బెల్టు, సేఫ్టీ జాకెట్ వేసుకుని కుర్రాడి మాదిరిగా పడవ ఎక్కిన ఓ ఏడుపదుల నాయకుడి సాహసం. నిండా మునిగిన సింగ్‌నగర్‌లో ఒకసారి మొత్తం బోట్‌లో తిరిగి, బాధితులకు నేనున్నానని భరోసా ఇచ్చారు. దానితో బాబు వచ్చారు.. ఇక నిశ్చింతగా ఉండవచ్చన్న భరోసా బాధితుల కళ్లలో స్పష్టంగా కనిపించిన వైనం.

ఒకసారి బోట్‌లో కలెక్టర్, జిల్లా అధికారులతో కలసి సింగ్‌నగర్‌లో పర్యటి ంచిన బాబు తర్వాత ఖాళీగా కూర్చోలేదు. పనయిపోయింది కదా.. మీడియా వచ్చింది కదా.. ఫొటోలు తీసుకున్నారు కదా అని ఇంటికి వెళ్లిపోలేదు. మళ్లీ కలెక్టరేట్‌కు వెళ్లి సహాయ కార్యక్రమాలపై అధికారులను పరుగులెత్తించారు.

ముందు తక్షణం బాధితులకు ఆహారం, మంచినీటి సరఫరాపై ఆగమేఘాలపై ఆదేశాలిచ్చారు. దుర్గగుడితోపాటు.. తన పార్టీ ఎంపి, ఎమ్మెల్యేలకు బాధితులకు ఆహారం తయారుచేసి అందించే బాధ్యత అప్పగించారు. తక్షణం సహాయ కార్యక్రమాల్లో దిగాలని ఆదేశించారు. మంత్రులందరినీ బెజవాడ వచ్చి, ఒక్కో డివిజన్‌కు ఒక్కోరిని బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. పనిమంతుల తీరు అలాగే ఉంటుంది మరి!

సహజంగా చంద్రబాబు ఒక పట్టాన సంతృప్తిపడే రకం కాదు. పైగా ఇలాంటి విపత్తుల్లో జనం ఎలాంటి బాధలు అనుభవిస్తారో.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోసం ఎదురుచూస్తారో ఆయనకు అనుభవమే. గతంలో విశాఖను ముంచేసిన హుద్‌హుద్ తుపాన్‌కు విశాఖవాసులు ప్రాణాలరచేతిలో పెట్టుకుని భీతిల్లితే.. నేనున్నానంటూ అక్కడే బస్సులో పడుకుని సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించిన కార్యదక్షుడు. విశాఖవాసులు మళ్లీ కోలుకునే వరకూ అక్కడే ఉన్న పనిరాక్షసుడు బాబు.

ఇప్పుడూ అంతే. నీటమునిగిన విజయవాడ వాసులకు భరోసా ఇచ్చేందుకు రంగంలోకి దిగిన బాబు.. రెండోసారి అర్ధరాత్రి కూడా సింగ్‌నగర్‌లో బోటుపై పర్యటించారు. కలెక్టరేట్ వద్ద ఆయన విశ్రమించేందుకు బస్సు వచ్చింది. అప్పుడు విశాఖ. ఇప్పుడు బెజవాడ. నగరాల పేర్లే మార్పు. మిగిలినదంతా సేమ్ టు సేమ్. సహాయ కార్యక్రమాలు ఎంతవరకూ వచ్చాయని స్వయంగా తెలుసుకోవడమే ఆయన పర్యటన లక్ష్యం.

నిజానికి చంద్రబాబు దక్షిణభారత దేశంలోనే అత్యంత భద్రత ఉన్న వీవీఐపి. ఆయన ఇలా అర్థరాత్రి బయటకు వచ్చేందుకు భదత్రా అంశాలు అంగీకరించవు. అయినా సరే జనం ముందు అవన్నీ ఆయనకు దిగదుడుపే. జనం కష్టాల్లో ఉంటే బాబుకు కాలు ఓ పట్టాన ఆగదు. అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి, నేనున్నానని ధైర్యం చెప్పాలన్నదే ఆయన తపన. దాన్ని పూర్తి చేసేవరకూ విశ్రమించరు. అది అధికారంలో ఉన్నా.. లేకపోయినా!

ఇప్పుడూ అదే చేశారు. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులోనూ ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న సీఎం.. భద్రతా హెచ్చరికలు లెక్కచేయకుండా, ప్రాణాలు పణంగా పెట్టి నిలువెత్తునీటిలో పర్యటించడం చరిత్రలో ఎప్పుడైనా విన్నామా? కన్నామా? ఇదంతా చంద్రబాబుకే చెల్లింది. అందుకే చంద్రబాబు ఒక ధైర్యం.. చంద్రబాబు ఒక భరోసా.. మొత్తంగా అందరికీ ఆత్మవిశ్వాసం.

జగన్ జమానాలో ఇలాంటి విపత్తులు వచ్చినా, ఆయన తాడేపల్లి నుంచి బయటకు రాని వైనం. పంటనీట మునిగితే ఒక వేదిక ఏర్పాటుచేసి, అక్కడి నుంచే పరిశీలించిన వైచిత్రి. ఎక్కడకు వెళ్లినా పరదాలు. అడుగువేస్తే పచ్చని చెట్లు కూలిపోవలసిందే. ఐదేళ్లలో ఒక్కసారి కూడా బాబు మాదిరిగా ఇలా ధైర్యం చేసి బోటు మీద ప్రయాణం చేసిన దాఖలాలు భూతద్దం వేసి వెతికినా కనిపించదు. అందుకే బాబంటే ఒక భరోసా.

LEAVE A RESPONSE