- నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు వినూత్న చొరవ
- నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం.
- సైబర్ నేరాల నియంత్రణకు అత్యాధునిక AI సాంకేతికత వినియోగం
- ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్‌కు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
- నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు
విజయవాడ: సాంకేతిక ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త తరహా మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, “నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్న” అనే దూరదృష్టితో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు చేతుల మీదుగా లాంచనంగా ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు మాట్లాడుతూ…… సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజుకో కొత్త రకం మోసం పుట్టుకొస్తోంది. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు నేరమే జరగకుండా ముందే ప్రజలను అప్రమత్తం చేయడమే సురక్షితమైన మార్గం.
సమాజంలో సైబర్ భద్రత, మహిళల భద్రత, పిల్లల సంరక్షణ మరియు రోడ్డు భద్రతపై ఒక బలమైన బాధ్యతాయుతమైన సంస్కృతిని (Safety Culture) నిర్మించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఒక శిక్షణ కార్యక్రమం కాదు, భవిష్యత్తులో సైబర్ నేరాలను తగ్గించేందుకు పోలీసింగ్‌లో సాంకేతికతను ప్రజల రక్షణకు మలిచిన ఒక విప్లవాత్మక అడుగు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు షిరిన్ బేగం, కే.జి.సి.సరిత , కె.కృష్ణ ప్రసన్న, లక్ష్మీనారాయణ , ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.