విజయవాడ రాజకీయ చరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు– వంగవీటి మోహన రంగ! ఆయన మరణించి దాదాపు 37 ఏళ్లు దాటిపోతున్నా, నేటికీ ఆ పేరు వింటే బెజవాడ గుండెల్లో ఏదో తెలియని ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం ఉప్పొంగుతుంది. ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ తన ‘ఇట్లు మీ జాఫర్’ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన ‘వంగవీటి ఫైల్స్’ వీడియో కేవలం ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే కాదు… అది నాడు బెజవాడను కుదిపేసిన రక్త చరిత్రకు, దాని వెనుక ఉన్న మానవీయ కోణానికి అద్దం పట్టింది.
ఆశా కిరణం… రాబిన్ హుడ్!
1985 ప్రాంతంలో వంగవీటి రంగ అంటే కేవలం ఒక సాధారణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే కాదు. అట్టడుగు వర్గాలకు, పేదలకు, నాడు క్రీస్తురాజుపురం వంటి స్లమ్ ఏరియాలో నివసించే నిరుపేదల ఇళ్ల పట్టాల కోసం పోరాడిన ఒక ఆశా కిరణం. అందుకే మీడియా ఆయనను ‘రాబిన్ హుడ్’ అని అభివర్ణించింది. అటు ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం కాంగ్రెస్ తరపున భారీ మెజారిటీతో గెలిచిన ఏకైక టైగర్ రంగ. అయితే, ఈ ప్రస్థానం వెనుక ఒక పెద్ద రక్త చరిత్రే దాగి ఉంది.
మిత్రులు శత్రువులైన వేళ…
మొదట్లో వంగవీటి రాధా, సీపిఐ నేత చలసాని వెంకటరత్నంల మధ్య మొదలైన ఆధిపత్య పోరు కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరింది. ఆ తర్వాత రంగ రంగప్రవేశం చేశారు. విశేషం ఏంటంటే, ఒకప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ (UI) అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో వంగవీటి రంగ మరియు దేవినేని సోదరులు (గాంధీ, నెహ్రూ, మురళి) కలిసే నడిచారు. కానీ కాలేజీ గొడవలు, ఇగో క్లాషెస్ కారణంగా ఆ మిత్రులు కాస్తా কటిక శత్రువులుగా మారిపోయారు.
1979లో దేవినేని గాంధీ దారుణ హత్యకు గురయ్యాడు. దానికి ప్రతికారంగా మళ్లీ వంగవీటి వర్గం టార్గెట్ అయింది. ఆ తర్వాత 1988లో దేవినేని మురళి కూడా దారుణంగా హతమయ్యాడు. ఒకరి ప్రాణాలకు ఒకరు ప్రతికారం తీర్చుకుంటూ విజయవాడ వీధులు రక్తసిక్తమయ్యాయి.
ఆ కటిక చీకటి రాత్రి… గుండెలు పగిలే శోకం!
చివరకు 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున ఆ ఘోరం జరిగిపోయింది. నిరుపేదల ఇళ్ల పట్టాల సమస్యపై, పోలీసుల ప్రవర్తనకు నిరసనగా బందర్ రోడ్డుపై వంగవీటి రంగ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీక్షా శిబిరంలో ఆయన గాఢ నిద్రలో ఉండగా… స్వామి మాలలో వచ్చిన కొందరు మానవ మృగాలు ఆయన్ను దారుణంగా నరికి చంపారు.
నాడు జరిగిన ఆ మారణహోమాన్ని కళ్లారా చూసిన ఆయన భార్య రత్నకుమారి గుండెలు బాదుకుంటూ, ఒక పసికందును తల్లి ఒడిలోకి తీసుకున్నట్టు రంగ భౌతికకాయాన్ని హత్తుకుని ఏడ్చిన తీరు… కిటికీలోంచి చూసి భయంతో వణికిపోయిన పదేళ్ల కొడుకు రాధా… ఇవన్నీ చూస్తే ఇది కేవలం రాజకీయం కాదు, సర్వస్వం కోల్పోయిన ఒక కుటుంబ తీరని శోకం అనిపిస్తుంది.
నిజం ఎప్పటికీ మిస్టరీనేనా?
ఈ కేసులో 44 మంది నిందితులు, 96 మంది సాక్షులు ఉన్నప్పటికీ, 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టులో సాక్ష్యాలు నిలబడకపోవడంతో ఎవరికీ శిక్ష పడలేదు.
‘హూ కిల్డ్ రంగ?’ అనే ప్రశ్నకు నేటికీ అధికారికంగా జవాబు దొరకలేదు.
అయితే, జర్నలిస్ట్ జాఫర్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. దేవినేని నెహ్రూ బతికున్నప్పుడు ఆయనను ఇంటర్వ్యూ చేసి, కెమెరాలు ఆఫ్ అయ్యాక “సార్ అసలు రంగాను ఎవరు చంపారు?” అని అడిగినప్పుడు, నెహ్రూ శూన్యంలోకి చూస్తూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి:
“ఈ స్టోరీలో హీరోలు, విలన్లు లేరమ్మా… పరిస్థితులు మమ్మల్ని అలా నెట్టివేశాయి. అందరం నష్టపోయాం. మా ఫ్యామిలీలో ఇద్దరిని కోల్పోయాను, అవతల రంగా గారి ఫ్యామిలీలోనూ నష్టం జరిగింది. రాజకీయ నాయకులకు, మీలాంటి వాళ్లకు ఇదంతా ఒక సరదా కావచ్చు… కానీ మా మనసుల మీద ఏం జరుగుతుందో ఎవరైనా ఆలోచించారా?”
ఈ ఒక్క మాటతో జాఫర్ తాను రాయాలనుకున్న ఫిక్షన్ నవల “బతకాలంటే చచ్చిపో” అనే పుస్తక ప్రచురణ ఆలోచననే విరమించుకున్నారు.
కులాల రంగు… రాజకీయ పాచికలు!
ఈ మొత్తం ఉదంతంలో పుల్లయ్య బాబాయ్ (రంగ ప్రాణమిత్రుడు) చెప్పినట్టుగా… ఇది రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవ కానే కాదు. ఎందుకంటే రంగ గారికి ముస్లింలు, క్రైస్తవులు, బ్రాహ్మణులు హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌గా ఉండేవారు. ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య పెరిగిన వైషమ్యం మాత్రమే. కానీ దానికి కులం రంగు పులిమి రాజకీయ పబ్బం గడుపుకున్నారు.

నేడు దశాబ్దాల తర్వాత కూడా ఎన్నికల వేళ మళ్లీ ‘హూ కిల్డ్ రంగ?’ అంటూ రాజకీయ పార్టీలు ఈ సున్నితమైన అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవడం అత్యంత దురదృష్టకరం. నాడు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధ, ఆనాటి బెజవాడ ప్రజల గుండెల్లో నలిగిన భయం… రాజకీయ నాయకులకు కేవలం ఓట్ల కురుక్షేత్రంలో అస్త్రాలు మాత్రమేనా?
రాజకీయాలు ఎలాగైనా సాగవచ్చు… కానీ వంగవీటి రంగ అనే ఆ ప్రజా నాయకుడు మాత్రం నేటికీ అశేష జనవాహిని హృదయాల్లో సజీవంగానే ఉన్నారు!
