- రాజ్యసభ సీట్లు కార్యకర్తకా.. కార్పొరేట్‌కా?
- కష్టకాలంలో దన్నుగా నిలిచిన వారికి పట్టం కడతారా?
- విశ్వసనీయత నిరూపించుకునే సమయమిది
- ఈసారి బీజేపీ కోటా లేనట్లేనా?
- గతంలో వారికి రెండు సీట్లు ఇచ్చిన ఫలితమేనా?
- రేసులో టిడి జనార్దన్, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, దేవయ్య, ఎల్లా కృష్ణ, చింతకాయల విజయ్, కంభంపాటి, వర్ల రామయ్య
- దశాబ్దాల నుంచి పార్టీకి సేవలందిస్తున్న టిడి జనార్దన్
- గత ఎన్నికల్లో కుల, మత నేతలను పార్టీలోకి తెచ్చిన వ్యూహకర్త
- అమెరికా దేవయ్యకు ఖరారు?
- అందరి చూపూ కిలారి రాజేష్ వైపే
- యువగళం పాదయాత్రలో కీలకపాత్ర పోషించిన రాజేష్
- ఆయనకు ఇప్పుడా? వచ్చేసారా?
- కాపు కోటాలో రెన్యువల్ కోసం సానా సతీష్ ఎదురుచూపు
- గత ఎన్నికలు, బాబు అరెస్టు తర్వాత ఢిల్లీలో కీలకపాత్ర పోషించిన సానా
- అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు సీట్లిచ్చే సంప్రదాయం కొనసాగుతుందా?
- రాజ్యసభ దక్కని వారికి ముందే నామినేటెడ్ పదవులు?
- సీట్లు తక్కువ.. ఆశలు ఎక్కువ
- వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ ప్రతిభకు తొలి పరీక్ష
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎంతోమందిని రాజ్యసభకు పంపించిన టీడీపీ నాయకత్వం తొలిసారి సంక్షిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇన్నేళ్ల చరిత్రలో టీడీపీ ఎప్పుడూ ఈ స్థాయి ఒత్తిళ్లు ఎదుర్కోలేదు. కారణం కూటమి లేకపోవడమే. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, అంతగా ఒత్తిళ్లు లేవు. కానీ ఈసారి జనసేన, బీజేపీకి సైతం వాటా ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి. అందుకే ఈ స్థాయిలో ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి.
జగన్ జమానాలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేకూర్చడం కత్తిమీద సాములా మారింది. వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాలకు డజను మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. వారంతా పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు, ఏదో ఒక రూపంలో పార్టీకి పనిచేసిన వారే.ఎవరినీ తక్కువ చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది.
మరోవైపు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ.. జనసేనకు ఒక స్థానం ఇవ్వాల్సి ఉంది. బీజేపీ కోటాపై అస్పష్టత ఉన్నప్పటికీ, ఈసారికి వారికి లేనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో వారికి రెండు సీట్లు కేటాయించడం, ఈసారి పార్టీలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో బీజేపీ కోటా ఉండదంటున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు సీటు కేటాయించని కారణంగా, ఈసారి ఆ పార్టీకి ఒక సీటు ఇవ్వడం అనివార్యమవుతోంది.
ఈ నేపథ్యంలో సీట్లు ఆశిస్తున్న నేతలు చాలామంది ఉన్పప్పటికీ, వడపోతలో అరడజను మంది మిగులుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్న పార్టీ అధ్యక్షుడి రాజకీయ సలహాదారు, జాతీయ ఉపాధ్యక్షుడు టిడి జనార్దన్ సీటు ఆశిస్తున్నారు. నిజానికి ఇప్పుడు రేసులో ఉన్న వారందరికంటే, ఆయనే ఆ సీటుకు అర్హుడు. పార్టీ
ప్రతిపక్షం-అధికారంలో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన అత్యుత్తమ సమన్వయకర్త ఆయన.
అధికారంలో ఉన్నా-లేకున్నా పార్టీ ఆఫీసులో కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల ముందు వివిధ కులాలు-మతాల నాయకులు, సమాజంలో ప్రముఖులను పార్టీ వైపు మళ్లించేందుకు తెర వెనుక కృషి చేసిన నాయకుడు. నిజానికి కులం-వర్గం ముద్రలేని జనార్దన్‌కు, ఇప్పటికి రెండుసార్లు రాజ్యసభ హామీ వివిధ కారణాలతో తప్పిపోయిన విషయం తెలిసిందే. మరి ఈసారయినా టిడికి ‘రాజ్య’ యోగం దక్కుతుందో లేదో చూడాలి.
ఇక గుంటూరుకు చెందిన కమ్మ సామాజికవర్గ నేత భాష్యం రామకృష్ణ చాలా ఏళ్ల నుంచీ పార్టీకి, ఆర్ధికంగా నిలుస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు. పైగా సోషల్‌మీడియా కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు పెడుతున్నారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా ఆర్ధికంగా ఆదుకుంటున్న త మ నాయకుడికే సీటు దక్కుతుందని, ఆ మేరకు నాయకత్వం నుంచి హామీ కూడా లభించిందని, గుంటూరు జిల్లాకు చెందిన ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆర్ధికంగా నష్టపోయారని ప్రచారంలో ఉన్న రామకృష్ణకు సీటు ఖాయమయిందన్న ప్రచారం అటు గుంటూరు జిల్లా వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గత పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు సీటు ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.గుంటూరు అసెంబ్లీ- పార్లమెంటు సీటు కోసం ఆయన పక్షాన, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఒక మీడియా అధినేత కూడా తీవ్రంగా కృషి చేశారు.
బీసీ యువనేత, లోకేష్‌కు సన్నిహితుడయిన చింతకాయల విజయ్‌కు బీసీ కోటాలో సీటు దక్కే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో లేనప్పుడు బీసీ వెలమ వర్గానికి చెందిన విజయ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. మంచి వక్తగా ఆయనకు పేరుంది. నిజంగా విజయ్‌కు సీటు ఇస్తే బీసీ వెలమ వర్గానికి చెందిన రెండో ఎంపీ ఆయనే అవుతారు.
దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్య కూడా సీటు ఆశిస్తున్నారు. గతంలో రాజ్యసభ అవకాశం కోల్పోయినందున, నమ్మకంగా పనిచేస్తున్న తనకు నాయకత్వం న్యాయం చేస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
ఇక గుంటూరు మాజీ ఎంపి గల్లా జయదేవ్ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఆయన కోసం కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత ఎన్నికల ముందే రాజకీయాల నుంచి తప్పుకుని, వ్యాపారాలు చేసుకుంటున్న గల్లాకు ఇంత పెద్ద పోటీలో అవకాశం ఇస్తారా అన్నది చూడాలి.
మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్రావు కూడా సీటు ఆశిస్తున్నారు. గతంలో ఢిల్లీలో జాతీయ పార్టీలతో సమన్వయం నెరిపిన కంభంపాటి, ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవి కూడా ఆశించిన విషయం తెలిసిందే. ఈసారి లోకేష్ టీములోని రామ్మోహన్నాయుడు, సానా సతీష్ వంటి యువనేతలు ఢిల్లీ బాధ్యతలు చూస్తున్నందున, మరి కంభంపాటికి అవకాశం ఉంటుందో లేదో చూడాలి.
ఇక కాపు కోటాలో సిట్టింగ్ ఎంపి సానా సతీష్ మరోసారి రెన్యువల్ ఆశిస్తున్నారు. యువనేత లోకేష్‌కు అత్యంత సన్నిహితుడయిన సానా, ఢిల్లీ రాజకీయాల్లో లోకేష్ టీములో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాపు సమస్యలపై సమన్వయం చేస్తున్న సానాకు లోకేష్ కోటాలో సీటు ఖాయమన్న ప్రచారం చాలాకాలం నుంచీ వినిపిస్తున్నదే.
అయితే జనసేన ఒకవేళ కాపులకే సీటిస్తే, అదే కోటాలో టీడీపీ మళ్లీ కాపులకే ఇస్తుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ‘‘అంటే జనసేన కమ్మ వర్గానికి సీటిస్తే, టీడీపీలో సానాకు సీటు ఖాయమవుతుంది. అయితే లింగమనేనికి సీటు ఇవ్వడాన్ని కాపులు వ్యతిరేకిస్తున్నందున, పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. పైగా నాగబాబుకు సీటిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంద’’ని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సానాకు సీటు ఖాయమని, ఒకవేళ రాకపోతే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అయినా నియమించి, ఆయన సేవలు ఢిల్లీలో వాడుకుంటారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఇక ప్రధానంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోకేష్‌కు ఆత్మ లాంటి యువనేత కిలారి రాజేష్‌కు సీటుపైనే ఆసక్తి నెలకొంది. యువనేత లోకేష్‌కు నమ్మినబంటయిన రాజేష్ సౌమ్యంగా వ్యవహరిస్తారు. ఆయన కూడా జగన్ బాధితుడే. మొన్నటి వరకూ నేరుగా తెరపైకి రాకపోయినా, లోకేష్ తరఫున పార్టీ వ్యవహారాలు ఆయనే చక్కదిద్దుతున్నారు.
యువగళం పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, లోకేష్‌కు సమన్వయకర్తగా తెరవెన ఉంటూ వ్యవహారాలు చక్కదిద్దుతున్న రాజేష్‌కు, రాజ్యసభ ఖాయమన్న ప్రచారం పార్టీ అగ్రనేతల స్థాయిలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సీటు ఆశిస్తున్న వారిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నందున, అదే వర్గానికి చెందిన రాజేష్‌కు ఈసారి సీటు ఇస్తారా? లేక వచ్చేసారి అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని, రాజేష్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారంటేనే, పార్టీలో ఆయన పాత్ర ఏమిటన్నది స్పష్టమవుతోంది.
ఎన్ఆర్ఐ దేవయ్యకు ఖరారు?
ఇదిలాఉండగా అమెరికాకు చెందిన వరంగల్ మాదిగ సామాజికవర్గ పారిశ్రామికవేత్త దేవయ్యకు.. సీటు ఖరారయిందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు ఆయన పార్టీకి ఆర్ధికంగా దన్నుగా నిలబడ్డారని, ఆకృతజ్ఞత ఇప్పుడు తీర్చుకుంటున్నారని చెబుతున్నారు. అమెరికాలో బిలియనీర్ అయిన దేవయ్య భార్య, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారని చెబుతున్నారు.
తెరపైకి ఎల్లా కృష్ణ?
కాగా భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక కీలక వ్యక్తి ఆయన పేరు సిఫారు చేశారంటున్నారు. ఆయనకు గతంలోనే ఆ మేరకు హామీ ఇచ్చారంటున్నారు.
అయితే రేసులో ఎక్కువమంది కమ్మ వారే ఉండటం, ఉన్న స్థానాలు తక్కువకావడంతో ఎవరికి సీటు దక్కుతుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
లోకేష్‌కు తొలి పరీక్ష
పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా నియమితులయిన తర్వాత.. యువనేత లోకేష్ ‘అధికారికంగా’ ఎదుర్కొంటున్న ఎంపిక పరీక్ష ఇది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల ఎంపికలో లోకేష్ తెరవెనుక కీలకపాత్ర పోషించినప్పటికీ.. ఈ ఎంపీ ఎంపికలో మాత్రం ఆయన నేరుగా తన పాత్ర పోషించనున్నారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధిక భాగం ప్రభుత్వ నిర్వహణలో మునిగిపోయిన నేపథ్యంలో.. పార్టీ-ప్రభుత్వ వ్యవహారాలు జమిలిగా చక్కబెడుతున్న లోకేషుదే ఎంపికలో తుది నిర్ణయన్నది తెలిసిందే.
రాజ్యసభకు ముందే నామినేటెడ్ పదవులు?
ఈ పరిస్థితిలో రాజ్యసభ ఎన్నికల కంటే ముందుగానే మిగిలిపోయిన నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం లేకపోలేదని, పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఫలితంగా పోటీని తగ్గించవచ్చన్నదే ఆ వ్యూహమంటున్నారు. ఎంపీ సీట్ల ఆశిస్తున్న వారికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు వంటి పదవులు ఇవ్వడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చంటున్నారు.
రాజ్యసభ ఎంపికలో పాత పాలిసీ పాటిస్తారా?
నిజానికి ఈ ఎంపిక అంశానికి సంబంధించి సుదీర్ఘకాలం నుంచీ టీడీపీలో ఒక సంప్రదాయం కొనసాగుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చే రాజ్యసభ సీటును, పార్టీ నిర్వహణ-అవసరాల కోసం పారిశ్రామికవేత్తకు కేటాయించేవారు. దానిని ఎవరూ తప్పుపట్టేవారు కాదు. పైగా నాయకులే పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చేవారు.
అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నిఖార్సయిన నేతలు-కార్యకర్తలకే కేటాయించేవారు. అసలు ఎవరూ ఊహించని వారిని ఎంపీ, ఎమ్మెల్సీలను చేసిన చరిత్ర టీడీపీది. ఎమ్మెల్యే క్వార్టర్సులో పడుకుంటున్న ఆకారపు సుదర్శన్‌ను రాత్రి వేళ నిద్రలేపి, రాజ్యసభ సీటిచ్చిన ఘనత టీడీపీది. నర్సాపురం మున్సిపాలిటీకి చెందిన బీసీ నేత నారాయణరావును, కర్నూలు మహిళా నేత మసాల పద్మజను ఎమ్మెల్సీని చేసిన చరిత్ర టీడీపీది.
చంద్రబాబు మీకోసం యాత్రలో సర్వం తానయి వ్యవహరించిన గరికపాటి మోహన్‌రావుకు ఎంపీ సీటిచ్చినా, ఉండి యువనేత సత్యనారాయణరాజుకు ఎమ్మెల్సీ ఇచ్చినా, సర్పంచులను కూడగట్టి సర్కారుపై సమరశశంఖం పూరించిన రాజేంద్రప్రసాదుకు ఎమ్మెల్సీ సీటిచ్చిన ఘనత టీడీపీది.
ఇవన్నీ ఆ పార్టీ వ్యవహారాలు చూసిన సీనియర్ జర్నలిస్టుగా మా లాంటివాళ్లు దగ్గరుండి చూసిన చరిత్రనే. మరి ఈసారి కూడా అదే సంప్రదాయం పాటిస్తారా? లేక నాయకత్వం మారినందున ‘యువ’ కోణంలో నిర్ణయాలు తీసుకుంటారా అన్నది చూడాలి. ఏదేమయినా.. ఎవరికి సీటిచ్చినా.. ఆ నిర్ణయంలో కార్యకర్తలు విశ్వసనీయతను చూస్తారన్న విషయాన్ని విస్మరించవద్దన్నది సీనియర్ల సూచన.