– సత్యనారాయణకే మళ్లీ ఆర్ధిక శాఖ బాధ్యతలు?
– అప్పుడు సెక్రటరీ..ఇప్పుడు ఓఎస్టీ పాత్రలో
– మాతృశాఖకు వెళ్లినా ఇంకా ఇక్కడే తిష్ట
– అనుభవం పేరిట తిరిగి తీసుకువచ్చిన వైనం
– తాజాగా 300 కోట్ల బిల్లుల విడుదలలో ఆయనదే పాత్ర?
– అందులో పులివెందుల వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్
– నెల్లూరులో వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు కూడా క్లియర్
– ఒకే హెడ్ కింద చూపి క్లియర్ చేశారట
– 300 కోట్ల వేర్వేరు బిల్లులను ఒకే హెడ్స్‌లో ఎలా చేర్చారు?
– టీడీపీ హయాం నాటి నీరు-చెట్టు, ఉపాథి హామీ పథకం బిల్లులకు మోక్షమేదీ?
– ఇంకా పెండింగ్‌లో 35 శాతం బిల్లులు
– లోకేష్ ప్రారంభించిన టూరిజం బిల్డింగ్ బిల్లు ఆపేసిన నాటి జగన్ సర్కారు
– బాసు బాధ్యతలు మోస్తున్న సత్యనారాయణ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
చిత్ర విచిత్రాలకు ఏపీ ఆర్ధిక శాఖ కేంద్రంగా మారింది. ఇటీవలే పులివెందుల-నెల్లూరు వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు పెద్దమనసుతో క్లియర్ చేసి, తమ విశాల హృదయం చాటుకున్న వైనం ఇంకా కూటమి వర్గాల్లో చర్చ జరుగుతుండగా.. మరో అద్భుతం కూడా వెలుగుచూడటం పుండుమీద కారం చల్లినట్టయింది. జగన్ జమానాలో ఆర్ధిక శాఖను వెలిగించిన నాటి కార్యదర్శి సత్యనారాయణ సేవలు, ఇంకా విజయవంతంగా కొనసాగుతున్న వైనం చర్చనీయాంశమయింది.
జగన్ ఐదేళ్ల పాలనలో నాటి ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ పేరు విననివారు బహు తక్కువ. వివిధ శాఖల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఎవరికి బిల్లులివ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏ శాఖలోని భవనాలు, స్థలాలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలన్న అంశంలో సత్యనారాయణ నిష్ణాతుడన్న విషయం తెలిసిందే. అసలు సచివాలయంలోని ఒక బ్లాకునే తాకట్టు పెట్టినప్పుడు గానీ.. సారు గారి ప్రతిభాపాటవాలు ఆసాంతం బయట ప్రపంచానికి తెలియలేదు. నిజానికి సతె్తన్న సారుకు ఇప్పటి ఓ మంత్రిగారే టీడీపీ సర్కారు ఉన్నప్పుడు అభిమానంతో ‘కాపు’కాశారట.
నాటి సీఎంఓలో కార్యదర్శిగా ధనంజయరెడ్డి ఎవరికి బిల్లులు ఇవ్వాలని ఆదేశిస్తే, సత్యనారాయణ వారికి బిల్లులు ఇచ్చేవారు. ఆరకంగా జగన్ అస్మదీయ కంపెనీలు, బడా కాంట్రాక్టర్లకు సత్యనారాయణ చేసిన సేవలు అమోఘం. అద్భుతం. అనిర్వచనీయం. అనన్య సామాన్యం! బిల్లుల చెల్లింపులో సీఎంఓ నుంచి ఆర్ధికశాఖ వరకూ కమిషన్లు నడిచేవని, అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. బిల్లులపై 7 నుంచి 10 శాతం కమిషన్లు తీసుకునేవారని, హైదరాబాద్‌లోనే ఆ చెల్లింపులు జరిగేవన్న ఆరోపణలు అప్పట్లో వినిపించిన విషయం తెలిసిందే.
ఆర్ధికశాఖ వ్యవహారాలను సచివాలయం నుంచి చక్కబెట్టాల్సి ఉన్నప్పటికీ.. మంగళగిరిలోని నిధిభవన్‌లని ఐదో అంతస్తు సెత్తనసారుకు ఐదేళ్లు అడ్డాగా ఉండేది. నిజానికి ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శులు పేరుకే తప్ప, పెత్తనమంతా సతె్తన్న సారుదే. గతంలో రావత్ సహా, ఆర్ధిక శాఖ బాసులకు మంగళగిరి నిధిభవన్ అడ్డా అన్నది బహిరంగ రహస్యమే.
ప్రభుత్వం మారి కూటమి గద్దెనెక్కిన తర్వాత.. ఆర్ధికశాఖను వెలిగించిన సత్యనారాయణ సారును కొత్త సర్కారు సాగనంపింది. ఆయననను అక్కడి నుంచి తప్పించింది. అంతకుముందే.. మళ్లీ జగనన్న సర్కారే అధికారంలోకి వస్తుందన్న భరోసాతో, సత్తన్న తన మాతృ శాఖ రైల్వే నుంచి మరో రెండేళ్లు పొడిగింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన అదృష్టం బాగుండక, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది.
దానితో రైల్వేకు వెళ్లి రిపోర్టు చేసిన సతె్తన్నను, కూటమి సర్కారు మళ్లీ వెనక్కి పిలిపించింది. అప్పటివరకూ ఆర్ధిక శాఖ కార్యదర్శిగా హవా సాగించిన సతె్తన్నను.. ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఓఎస్డీగా నియమించారు. తొలుత కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినందున, మొదటి నెలలో జీతాలు, పెన్షన్ల వ్యవహారాలు చూడాలంటూ ఆయనకు ఆ పని అప్పగించారు. ఇక అప్పటినుంచీ సతె్తన్న విజయవంతంగా ఆర్ధికశాఖలోనే మళ్లీ చక్రం తిప్పుతుండటం విశేషం.
కాగా ఇటీవల పులివెందులకు చెందిన వైసీపీ కాంట్రాక్టర్లు, జగన్ జమానాలో చేసిన 100 కోట్ల రూపాయల బిల్లులను ఆర్ధికశాఖ క్లియర్ చేయటం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురయింది. దానితోపాటు నెల్లూరు జిల్లాలో.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు కూడా, పంచకల్యాణి గుర్రం సైతం ఈర్ష్యపడేంత స్థాయిలో వాయివేగంతో క్లియర్ కావడం, తమ్ముళ్లకు పుండుమీద కారం చల్లినట్టయింది.
‘‘రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా? జగన్ పార్టీ అధికారంలో ఉందా? ఇందుకోసమేనా మేం కేసులు పెట్టించుకుని మరీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది?’’ అంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు అగ్గిరాముళ్లయ్యారు.
నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు గ్రామాల్లో నీరు-చెట్టు, జాతీయ ఉపాథి హామీ పథకం కింద చేసిన పనులన్నీ జగన్ సర్కారు నిలిపివేసింది. దానితో టీడీపీ గ్రామ స్థాయి నాయకులు ఆర్ధికంగా దారుణంగా నష్టపోయారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిన వారికి అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, జగన్ సర్కారు నామమాత్రంగానే బిల్లులు మంజూరు చేసింది. మళ్లీ దానిపై కోర్టు ధిక్కరణ కేసు వేసినా ఫలితం శూన్యం.
ఆ విధంగా టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లు చేసిన అన్ని బిల్లులనూ జగన్ సర్కారు నిలిపివేసింది. అయితే తర్వాత కొంతకాలానికి కమ్మ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు మినహా, మిగిలిన వారికి కమిషన్లు తీసుకుని బిల్లులు మంజూరు చేసిందనేది బహిరంగమే. ఆ ప్రకారంగా ఇప్పటికి ఇంకా 35 శాతం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయట. దీనిపై ఇటీవల కొందరు నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడును కలసి చర్చించిన నేపథ్యంలో, దీనిని సీఎం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. అప్పటి సర్కారులో మంత్రిగా పనిచేసిన లోకేష్ ఎన్నికల కోడ్‌కు ముందు, పాలకొల్లు నియోజకవర్గం సీతంపేట ఐటిడిఏలో టూరిజం గెస్ట్ హౌస్‌ను ప్రారంభించారు. దానిని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు నిర్మించారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన నేపథ్యంలో.. ఆ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ, నాటి వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయటంతో దాని బిల్లు ఆగిపోయింది.
ఇప్పటికీ దానికి సంబంధించిన 16 లక్షల రూపాయల బిల్లు కోసం, సదరు టీడీపీ నేత కాళ్లకు బలపాలు చుట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారట. చివరాఖరకు తేలిందేమిటంటే.. పనికి సంబంధించిన బిల్లు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు గానీ.. జీవో తెచ్చుకోమని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారట. ఇంకా ఇలాంటి గాథలు రాస్తే రామాయణం. చెబితే భారతమే అవుతుంది. ఈ క్రమంలో టీడీపీ అధికార ంలోకి వచ్చినప్పటికీ.. వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత వాయువేగంతో క్లియర్ కావడం, టీడీపీ వర్గాలను విస్మయపడేందుకు కారణమవుతోంది.
అయితే.. తాజాగా ఆర్ధికశాఖ క్లియర్ చేసిన 300 కోట్ల రూపాయల్లో పులివెందుల-నెల్లూరు వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులన్నీ వ్యూహాత్మకంగా క్లియర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. 300 కోట్ల బిల్లులన్నీ ఒకే హెడ్ కింద చూపించి క్లియర్ చేశారని చెబుతున్నారు. నిజానికి ఏ హెడ్స్‌కు సంబంధించి ఆ హెడ్స్ బిల్లులు పెట్టి క్లియర్ చేయడం ఆర్థికశాఖలో ఒక ఆనవాయితీ.
అయితే అన్ని పనులూ ఒకే హెడ్స్ కింద పెట్టి క్లియర్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం మీడియాలోకి వచ్చిన తర్వాత.. అన్నీ ఒకే హెడ్స్ కింద ఉన్నందున, తాము పులివెందుల బిల్లులు చూడలేదని సీఎంఓకు వివరణ ఇచ్చుకున్నారట. తానే వాటిని పాస్ చేశానని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి అంగీకరించి, ఇకపై అలా జరగకుండా చూస్తానని వివరణ ఇచ్చుకున్నారట. పోనీ కాసేపు వారి వాదనే నిజమనుకుంటే.. బిల్లులు అప్‌లోడ్ చేసేముందు, హెడ్స్ వారీగా బిల్లులు తనిఖీ చేస్తారు. తర్వాతనే వాటిని క్లియర్ చేస్తుంటారు.
మరి పులివెందుల బిల్లులంటే.. అవి వైసీపీ నేతలకు చెందినవేనన్న విషయం మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అలాంటిది ఆర్ధిక శాఖ అధికారులకు తెలియకపోవడమే వింత. పులివెందుల బిల్లులు కాబట్టి, దానిని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లాలన్న స్పృహ కూడా లేకపోవడం ఆశ్చర్యం.
విచిత్రంగా.. జగన్ జమానాలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్.. బిల్లుల చెల్లింపులో అడ్డగోలు విధానం అమలుచేస్తున్నారని, బిల్లుల చెల్లింపులో మొదట వచ్చిన వారికి మొదట చెల్లించాలన్న (ఫిఫో) విధానం పాటించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే కేశవ్ ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడే.. అదే ఫిఫోను అధికారులు విజయవంతంగా ఉల్లంఘించడమే ఆశ్చర్యం. అంతకుముందు పెండింగ్‌లో ఉన్న లక్షన్నరకోట్ల పెండింగ్ బిలులలు కాదని, వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు 100 కోట్లు ఎలా క్లియర్ చేశారన్నదే టీడీపీ వర్గాల్లో రగులుతున్న ఆగ్రహం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ బిల్లులను సత్యనారాయణ క్లియర్ చేశారని ఆర్ధికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన తిరిగి శాఖలో చేరిన తర్వాత, మళ్లీ పాత పనులే అప్పగించార ంటున్నారు. ప్రస్తుత కార్యదర్శి కార్యాలయంలో ఎక్కువసేపు ఉండటం లేదని, సీఎంఓ- ఆర్ధికమంత్రితో సమావేశాలు, ఇతర అధికార పనుల కోసం వెళుతున్నారని చెబుతున్నారు. అందుకే బిల్లుల క్లియరెన్స్ పార్‌వర్డ్ కూడా సతె్తన్న చేతికే ఇవ్వడంతోపాటు, పాత పనులే తిరిగి పురమాయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
విచిత్రంగా సత్యనారాయణ గతంలో మాదిరిగా, ఇప్పుడు కూడా అప్పుల పనిమీద రెగ్యులర్‌గా ముంబయిలోరి ఆర్‌బీఐకి వెళుతున్నారంటున్నారు. రేపు తాజాగా కొత్త మరో నాలుగువేల కోట్ల అప్పు కోసం కూడా సత్తన్న వెళుతున్నట్లు సమాచారం.