– రంగంలోకి దిగిన పవర్‌బోట్స్, 6 హెలికాప్టర్లు
– ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యత
– సీఎం చంద్రబాబు
విజయవాడ: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. ఈ విషయమై ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. వీటి ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరోవైపు ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.
చంద్రబాబు నిరంతర సమీక్షలు, మానిటరింగ్తో అధికార యంత్రాంగం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్యవేక్షణతో అధికారులు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మరోసారి పర్యటించిన చంద్రబాబు
ఈ క్రమంలోనే విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్‌నగర్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందాయని ఆయనకు తెలిపారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సింగ్‌నగర్ నుంచి ఇతర ప్రాంతాలకుమంత్రులు నారాయణ, కొండపల్లి, కొల్లు రవీంద్ర వెళ్లారు.
వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ జరుగుతోందని చంద్రబాబు అన్నారు. సహాయచర్యలను మరింత ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని పేర్కొన్నారు. 6 హెలికాప్టర్లు వస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బోట్ల సంఖ్య కూడా పెంచుతున్నామని పేర్కొన్నారు. వర్షం పడుతున్నా వరద బాధితులకు సాయం ఆపట్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే తమ మొదటి ప్రాధాన్యతని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఎప్పటికీ రానంత వరద వస్తోందని చెప్పారు. తానే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. వరద బాధితులకు అన్నిరకాల సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
ఉన్నతాధికారులతో మరోసారి సమీక్ష
అనంతరం చంద్రబాబు ఉన్నతాధికారులతో మరోసారి సమీక్షించారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని ఆదేశించారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలని చెప్పారు. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలన్నారు.
ఈ క్రమంలోనే కృష్ణా నదికి వస్తున్న వరద నీటిపైనా సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నానికి కొంతమేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. ఈ క్రమంలోనే లంకగ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.