Suryaa.co.in

Features

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు

– బుడమేరు నుండి ఓ చిన్ని పాఠం

“బుడమేరు” ఇది నది కాదు చిన్న ఏరు. దీనికి బెజవాడ దుఃఖదాయిని అని మరో పేరు కూడా.
మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరు లో కలిసే ఏరు. ఏరు పుట్టిన చోటుకి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్లు కంటే తక్కువే ఉంటుంది.
మరి ఇంత చిన్న ఏరు, ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు బెజవాడని ఎలా బెంబేలు ఎత్తించింది.
ఎలా అంటే పాలకులు మరియు ప్రజలు నిర్లక్ష్యం.

ఏరు ప్రయాణిస్తున్న దారిని వీళ్ళు సంవత్సరాల తరబడి పూడికలు తియ్యకుండా, అవకాశం ఉన్న దగ్గర కబ్జాలు చేసి, తాను కలవవలిసిన కొల్లేరును కొల్లగొట్టేసి తన దారిని మూసేస్తే, సమయం చూసి మూడు లక్షల మందికి దారి లేకుండా మూసేసింది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చెరువు…ఏరు….నది…ఏదైనా సరే వాటికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే మనం ఈ భూమి మీద మర్యాదగా బ్రతకగలుగుతాం. లేదంటే, వరదలు రూపంలో మనకి నరకం చూపిస్తాయి.

వరదలు వచ్చినప్పుడు వీధి లో ఉండే పేదవాడైనా, విల్లా లో ఉండే ధనవంతుడైనా ఒకటే. ఆహార పొట్లాలు కోసం ఆక్రోశించాలి, మంచి నీళ్ళు కోసం పోటీ పడాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాలి. కరెంట్ ఉండదు, ఫోన్ లు పనిచెయ్యవు, కార్లు ఉన్నా ఉపయోగం ఉండదు, చివరికి బ్రతకలన్నా, చావాలన్నా కూడా భయపడే పరిస్థితి.

అందుకే ఇకనైనా మేలుకోండి. లేదంటే ఈ వరదలు ఈ భూమి మీద మనకి స్థానం లేకుండా చేస్తాయి. ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూస్తున్నాం.

మనిషి మారాలి. మన కోసం కాకపోయినా మన తరువాత తరాలు కోసమైనా ప్రకృతిని ప్రకృతి లాగే కాపాడుకోవాలి…. ఎందుకంటే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది.

LEAVE A RESPONSE