Suryaa.co.in

Andhra Pradesh

అరాచక పాలన…. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌!

• సోమవారం బ్లాక్ డేగా ప్రకటించాం..
• జగన్ రెడ్డి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవర్నీ వదలడు
• నాడు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చట్టాన్ని చుట్టంలా వాడుకున్నాడు
• చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టించాడు
• స్కిల్ డెవలప్ మెంట్లో రూ.3000 కోట్ల మోసం అని.. 30 పైసలు కూడా బయట పెట్టలేకపోయారు
• నేడు పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు బెంగళూరులో కూర్చుని పచ్చి అబద్ధాలు
• వరద బాధితులకు సాయం చేయకపోగా.. పిచ్చి ప్రేలాపనలు
• చంద్రబాబు చొరవ వలనే విరాళాలు వరదలా పోటెత్తుతున్నాయి..
• యంత్రాంగం జోరుగా పనిచేస్తోంది
• అబద్ధాలను, అక్రమ మార్గాలను నమ్ముకున్న వైసీపీకి, జగన్ కు భవిష్యత్ లేదు..
• ఆ 11 సీట్లు పోయి జగన్ ఒక్కడే మిగలడం ఖాయం
• చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..
• ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నాం

మంగళగిరి: జగన్ రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మాన, ప్రాణాలనైనా తీస్తారని.. తన వికృతానందం కోసం ఎంతకైనా దిగజారుతారని.. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేతపై తప్పుడు కేసులు పెట్టించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దురుద్దేశం, దుర్మార్గమైన ఆలోచనలతోనే కనీసం అక్కడ ఉన్న ఖైదీలకు ఇచ్చే ట్రీట్ మెంట్ ను కూడా చంద్రబాబుకు ఇవ్వలేదని.. నీతిని నిర్బంధించిన ఆ చీకటి రోజుకు సంవత్సరం అయిన సోమవారాన్ని బ్లాక్ డే ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

గత ఐదేళ్లు టెర్రరిస్ట్ లా జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించారు.. జగన్ రెడ్డి పాలనలో ఎవరికి నిద్రలేదు. కార్యదక్షుడు, స్నేహశీలి, నిరాడంబరుడు, నిగర్వి, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఏపీ ఘనతకు పాటుపడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు! అలాంటి వ్యక్తిని ఏవిధమైన తప్పు లేకుండా అక్రమ కేసులో అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. 53 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టి హింసించారు. జగన్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ఎందుకుపెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ను ఏర్పాటు చేస్తే.. ఆ స్కిల్ డెవలప్ మెంట్ లో రూ. 3,000 వేల కోట్లు అక్రమం జరిగిందని నెపం వేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. 22 నెలల ముందే కేసు నమోదు చేసి, ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు. మొదట రూ.3 వేల కోట్లు అవినీతి అని.. తరువాత 300 కోట్లు అని.. మళ్ళీ 30 కోట్లు అని.. చివరకు 30 పైసలు కూడా తేల్చలేకపోయారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వ్యవహరించడం తప్పా.. ఏమీ లేదు.

ఆ కేసులో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని న్యాయస్థానాలు చెప్పినా.. కక్ష పూరితంగా చంద్రబాబును పేరు చేర్చి అరెస్ట్ చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి తన తప్పుల నుండి దొరక్కుండా ఉండేందుకు ఎవరి మాన, ప్రాణాలనైన తీస్తారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ అని అబద్ధపు ప్రచారం చేయించారు. నాడు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డీఐజీ గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఈ తంతును సాగించారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించారు. అమరావతిని నిర్మించి, అభివృద్ధిలో దేశం తలెత్తుకునేలా చేయాలని చూసిన వ్యక్తి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే వైసీపీ నేతలకు కుట్రకు తెరతీసి అరెస్ట్ చేశారు.

రాష్ట్రంలో ఉన్న వనరులు అన్నీ దోచేశారు.. ల్యాండ్, వైన్, మైన్, శ్యాండ్ ఇలా దేన్నీ వదలకుండా దోచుకున్నారు. నాసిరకం మద్యంతో రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. నాడు ఇంట్లోనుండి బయటకు వస్తే ప్రజల ప్రాణాలకు రక్షణలేదు. జగన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రలు.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. మేమూ… మా నాయకుడికి బిడ్డల్లా ఉంటాం.. ఎవరైతే పార్టీ జెండాను మోసారో వారంతా ప్రజలకు సేవకుల్లా పనిచేస్తారే కాని.. జగన్ రెడ్డి ఆయన అనుచరుల్లా ప్రజలను దోచుకోరు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ చూసినా అరాచకాలు ఆగడాలే… రైతుల మధ్య కూడా గొడవలు పెట్టిన పాలన వైసీపీదీ. రెవెన్యూను చేతిలో పెట్టుకుని దాష్టీకంగా పనిచేశారు. వైసీపీలో జరిగిన తప్పిదాలను పరిష్కరించి భూ తగాదాలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పెట్టేందుకు నిర్ణయించాం.

నాల్గోవసారి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. పింఛన్ పెంచి ఇస్తామని చెప్పాం.. అలాగే ఇచ్చాం. ఏ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అయితే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారో.. అదే స్కిల్ డెవలప్ మెంట్ తో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేలా స్కిల్ సెన్సెన్ కు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్టే అన్నక్యాంటీన్లు ఓపెన్ చేశాం… ఫ్రీ ఇసుక పాలసీ తెచ్చాం. నాడు బాత్రూం కట్టుకోవాలన్న ఇసుక దొరకని పరిస్థితి. నేడు రాష్ట్రం నుండి ఒక్క స్పూన్ ఇసుక కూడా ఇతర రాష్ట్రాలకు పోవడంలేదు. వందేళ్ళలో ఎప్పుడూ లేనివిధంగా వర్షం పడి ప్రజల అల్లాడుతుంటే నేనున్నానంటూ చంద్రబాబు ప్రజలకు అభయ హస్తం ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుదే. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆకలిదప్పికలతో ప్రజలు అల్లాడకుండా.. చంద్రబాబు కేబినెట్ మంత్రులందరినీ వరద ప్రాంతాల్లో మోహరించారు.. వార్డుకోక ఎమ్మెల్యేను ఏర్పాటు చేసి సేవలు అందించారు.

ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని మ్యాన్ డేట్ ఇచ్చారంటే.. .ప్రజలకు చంద్రబాబుపై ఏవిధమైన విశ్వాసం ఉందో అర్థం చేసుకోవాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు నూటికి నూరుశాతం అందేలా మేం పనిచేస్తాం. మా పాలనలో ఎక్కడా కక్షలకు కార్పణ్యాలకు చోటు ఉండదు. జగన్ రెడ్డి టైంలో అపోజిషన్ పార్టీనే లేకుండా చూడాలని పనిచేశారు. ఇప్పుడు మేం స్నేహ హస్తం ఇస్తున్నాం. 1వ తారీఖీ వచ్చిందంటనే నేడు ఫింఛన్ డే అంటున్నారు.. 31 వ తారీఖునే పింఛన్ ఇచ్చిన ఘనత కూడా కూటమిదే. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఏవిధమైన సంక్షేమ ఫలాలు అందాలో వాటన్నింటిని ప్రజలకు అందిస్తాం. గత ఐదేళ్లు ఎన్నో దాడులు చేసినా.. హత్యాయత్నం కేసులు పెట్టినా ఆవగిజంత ధైర్యం కోల్పోకుండా చంద్రబాబు నాయకత్వం కింద పనిచేశాం. ముఖ్యమంత్రి హోదా కోల్పోయి మూడు నెలలు కాకముందే ప్రజలను విడిచి పెట్టి బెంగళూరుకు మకాం మార్చిన వ్యక్తి జగన్ రెడ్డి. వరద బాధితులు కష్టాల్లో ఉంటే నామమాత్రపు పర్యటనలు చేసి జగన్ రెడ్డి.. వాగులు, వంకలు, స్పిల్ వేకు, గేట్లకు కూడా తేడా తెలియకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని ఏవిధంగా నాశనం చేశారో అందరికీ తెలుసు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏవిధమైన అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన అర్హత ఉందంటే అది జగన్ రెడ్డికే దక్కుతుంది. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన జగన్ కు ఇప్పటికైనా సిగ్గూశరం ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలి. రాబోయే రోజుల్లో 11 సీట్లు 1 సీటు కావచ్చు.. ఇప్పటికైనా జగన్ మనిషిగా మారాలి. ఇలాంటి విపత్తులు గతంలో వచ్చినప్పుడు కేంద్రం నుండి ఒక్క నాయకుడినైనా మీరు తీసుకు వచ్చారా? దేశమంతా నేడు ఏపీ వైపు చూస్తున్నారు.. కేంద్ర మంత్రులు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతూ.. మేము సైతం… అంటూ వందలాది కోట్లు విరాళం ఇస్తున్నారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు అబద్ధపు నిందలు వేయడం తప్ప.. మీకు ఏమి చేతగాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మీకు ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేసి మీ ఉనికి కాపాడుకోండి.

LEAVE A RESPONSE