Suryaa.co.in

Editorial

ఇదేమి రాజ్యం?

( మార్తి సుబ్రహ్మణ్యం)
మహానగర నట్ట నడివీధిలో ఒక శాసనసభ్యుడి ఇంటిపై.. మరో శాసనసభ్యుడు అనుచరులతో కలసి బహిరంగంగా దండయాత్ర చేసి, ఆయన ఇంటిపై దాడికి దిగిన దృశ్యాలు చూసిన వారికి.. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? బంగ్లాదేశ్‌లో ఉన్నామా? అసలు పోలీసులు పనిచేస్తున్నారా? అన్న సందేహం మెడమీద తల ఉన్న ఎవరికైనా స్ఫురిస్తుంది.

తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై.. అదే పార్టీ బీఫారంపై గెలిచి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరి పీఏసీ చైర్మన్‌గా ఎంపికయిన అరికెపూడి గాంధీ, ఆయన అనుచరమూక చేసిన దాడి.. మన ం ప్రజాస్వామిక లక్షణాలకు దూరమవుతున్న హెచ్చరిక సంకేతమే.

రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ.. మహాత్మాగాంధీ గారి అహింసా సిద్ధాంతాన్ని అమలుచేస్తూ..పదేళ్ల నుంచీ శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అభివన ‘మహాత్మా’గాంధీ, ఇటీవలే బీఆర్‌ఎస్ ‘కారు’ దిగి కాంగ్రెస్ చేతిలో చెయ్యేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు విపక్షానికి ఇచ్చే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్‌గిరీ దక్కింది. సహజంగా ఈ పీఏసీ పదవి విపక్షాలకే ఇస్తుంటారు. అంటే ఆయన ఎలాగూ విపక్షం నుంచే వచ్చారు కాబట్టి, విపక్షానికే ఆ హోదా ఇచ్చామని చెప్పుకునే అతి తెలివి అది!

పార్లమెంటులో సంఖ్య తక్కువ ఉన్న కాలం నుంచీ, తగినంత సంఖ్యాబలం వచ్చేవరకూ అది కాంగ్రెసుకే దక్కింది. అది రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్‌బాబాకు తెలియనిది కాదు. కానీ రాహులబ్బాయి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ ఇవ్వడం ఏమిటన్నది మర్యాదస్తుల సందేహం.

సరే.. ఇవి దర్మాధర్మాలు, సత్సంప్రదాయాల గురించి మాట్లాడుకునే మంచి రోజులు కావు కాబట్టి.. సంఖ్యాబలమే న్యాయానికి కొలమానం కాబట్టి, పాతరేసిన ఆ పాత ముచ్చట్లు అనవసరం. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆ పదిమంది ఎమ్మెల్యేలు కూడా.. కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. ‘నియోజకర్గ అభివృద్ధి’ కోసం నిస్సిగ్గుగా కండువాలు కప్పేసుకున్నారు. మరేటి సేత్తాం?

దాన్ని విపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీలు గత్తర చేయడం సహజం. పార్టీ ఫిరాయించిన వారికి సిగ్గు ఎగ్గు ఉంటే పదవులకు రాజీనామాలు చేసి, మళ్లీ పోటీచేయాలని బీఆర్‌ఎస్ గొంతులు గాయి చేయడమే వింత. తన రాజ్యంలో ఏకంగా కాంగ్రెస్-టీడీపీ శాసనసభాపక్షాలనే మింగేసి.. పార్టీ మారిన వారికి మంత్రి పదవులిచ్చి.. కాంగ్రెస్‌కు దక్కాల్సిన అదే పీఏసీ చైర్మన్ పదవిని, తన మిత్రపక్ష మజ్లిస్‌కు ఇచ్చిన తెలంగాణ జాతిపిత పార్టీ.. ఇప్పుడు ప్రజాస్వామ్యం.. పార్టీ ఫిరాయింపులు.. రాజ్యాంగం గురించి నీతిసూక్తముక్తావళి వినిపించడం రోత. తాను చేస్తే సంసారం. ఎదుటివాడు చేసేది వ్యభిచారం అంటే ఎలా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజేసుకుని, దానికి తగినంత సంఖ్యాబలం లేనందుకే మజ్లిస్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చామనే పత్తిత్తు కబుర్లు ఇప్పుడు చెప్పినా ఫాయిదా లేదు.

ఇక తన పార్టీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని, సగర్వంగా చెప్పుకునే పువ్వుపార్టీ.. టీడీపీ నుంచి జంపయిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయకుండానే కమలతీర్థం ఇచ్చింది. ఇప్పుడు అలాంటి ‘విలువల మడిబట్టల పార్టీ’ కూడా, ఫిరాయింపుల గురించి టన్నుల కొద్దీ కన్నీరు కార్చడం వింతలో వింత.

‘తెలంగాణ జాతిపిత’ కేసీఆర్ ఏలుబడిలో, ఈ ఫిరాయింపులకు ఒక గంభీరమైన-భావూద్వేగ నిర్వచనం ఉండేది. దానిపేరు ‘నియోజకవర్గ అభివృద్ధి’! ‘తెలంగాణ రాష్ట్రం నక్కలపాలు కాకూడదన్న కోరిక’. ఈ రెండు పదాలే అప్పట్లో టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు ప్రాతిపదికయ్యాయి.

కేసీఆర్ కూడా ‘‘నియోజకవర్గ అభివృద్ధి కోసం.. పోరాడి సాధించుకున్న తెలంగాణ నక్కలపాలు కాకుండా ఉండాలన్న కోరికతో పార్టీ మారితే తప్పేంటి? మీరు కూడా మారాలి’’అని మీడియాకు క్లాసులిచ్చిన రోజులున్నాయి. ఫిరాయింపులపై ఆయన భాష్యమే, ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్నప్పుడు ఇంకా ఆ గాయగత్తరెందుకు? నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష!

అప్పట్లో పార్టీ మారి వచ్చే వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి కండువా కప్పి ఉంటే, కేసీఆర్ ప్రతిష్ఠ ఆకాశానికి పోటీపడేది. మిగిలిన వారూ అదే సంప్రదాయం అనుసరించేవారు. మరి ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా? తాను పాటించని నైతిక విలువలను, ఎదుటివారి నుంచి ఆశించడం అన్యాయం మాత్రమే కాదు. అత్యాశ కూడా!

సరే.. పార్టీ మారిన అరికపూడి గాంధీ.. తాను పార్టీ మారలేదని, సీఎం రేవంత్‌రెడ్డి పనిలేక ఖాళీగా ఉంటే.. గుడిలో అమ్మవారికి వేసే శాలువను, ఆయన చేతికిచ్చి కప్పించుకున్నానే తప్ప అది కాంగ్రెస్ కండువా కానేకాదని సెలవిచ్చారు. సరిగ్గా.. ఇక్కడే రేవంత్‌రెడ్డికి.. ‘ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి. కర్రుకాల్చి వాతపెట్టండి. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడానికి మీకు సిగ్గులేదా’ అన్న తన పాత డైలాగులు బ్యాంక్ గ్రౌండ్‌లో రింగురింగులుగా తిరిగి గుర్తుకు వచ్చే తీరాలి. అది వేరే ముచ్చట.

సంతోషం. మరి అదే నిజమైతే రేపు ఉదయమే మీ ఇంటికొచ్చి గులాబీ కండువా కప్పి, భవన్‌కు తీసుకువెళాతనని పాడి కౌశిక్‌రెడ్డి అనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొంటెతనం ప్రదర్శించారు. అందులో తప్పేమిటి? తానెలాగూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని గాంధీగారే సత్యం చెప్పారు. విపక్ష పార్టీ కోటాలోనే తనకు పీఏసీ చైర్మన్ ఇచ్చినందున.. తన పాతివ్రత్యం నిరూపించుకునేందుకు, సదరు సత్యం ‘గాంధీ’ గారు పాడి కౌశిక్ వేసే గులాబీ కండువా కప్పేసుకుని, అటుంచి అటే బీఆర్‌ఎస్ భవన్‌కు వెళితే తప్పేమిటన్నది బుద్ధిజీవుల ప్రశ్న. మరి నిజమే కదా?!

అందుకు భిన్నంగా తనకు తన పార్టీ కండువానే కప్పుతానన్న కౌశిక్‌రెడ్డి ఇంటిపై, అనుచరులతో కలసి గాంధీ దాడికి దిగడం దుర్మార్గం. అద్దాలు ధ్వంసం చేయడం దారుణం. ఆ సందర్భంలో అహింసామూర్తి గాంధీ గారి పేరు పెట్టుకున్న అరికపూడి గాంధీ.. కౌశిక్ అనే ఎమ్మెల్యేపై వాడిన బూతుల బజారు భాష రోత. ఎమ్మెల్యే హోదాకే తగని మచ్చ. పోనీ తర్వాత రియాక్టయిన కౌశిక్‌రెడ్డేమైనా సంసారభాష మాట్లాడారా అంటే అదీ లేదు. దొందూ దొందే!

ఇంతజరుగుతున్నా పోలీసులు చోద్యం చూడటమే ఆశ్చర్యం. అసలు తాను మహాత్మా‘గాంధీ’ ఇంటికి వెళ్లి ఆయన మెడలో గులాబీ కండువా కప్పుతానని చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, అదే కౌశిక్‌రెడ్డికి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే గాంధీని కూడా, ముందస్తుగా ఎందుకు హౌస్ అరెస్టు చేయలేదు? అసలు వీటిని ముందుగా పసిగట్టాల్సిన నిఘా దళాలు ఎందుకు నిద్ర పోయాయి? ఈ ఆలోచనకు ఐపిఎస్ అవసరం లేదు. సుదీర్ఘకాలం సర్వీసులో ఉండే సాధారణ ఏఎస్‌ఐకూ తెలుసు. కానీ ఆ తెలివి ఐపిఎస్‌లకు లేకపోవడమే వింత. అందుకే సదరు గాంధీ, దర్జాగా అనుచరులతో కలసి కౌశిక్ ఇంటికి దాడికి వెళ్లగలిగారు.

సరే.. మహాత్మా‘గాంధీ’గారు, కౌశిక్‌రెడ్డిని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టిన తర్వాత.. ఆయన అనుచరులు కౌశిక్ ఇంట్లో సృష్టించాల్సిన ంత విధ్వంసం సృష్టించిన తర్వాత.. పాత సినిమాల మాదిరిగా చివరలో వచ్చిన పోలీసులు, గాంధీని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బట్ నో యూజ్.

అప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠకు, ప్రజాస్వామానికి జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. ‘‘కాంగ్రెస్ జమానాలో పాలన ఇంతే ఉంటుంది.. అసలు ప్రభుత్వం ఉందా?..సీఎంకు లా అండ్ ఆర్డర్‌పై పట్టు లేదు.. పోలీసు వ్యవస్థ విఫలమయింది’’ అనే కొత్త ఘనకీర్తికి, మహాత్మా‘గాంధీ’ దాడి ఘటన కారణమయింది.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాంధీ చేసింది దాదాగిరేనన్నది నిస్సందేహం. ఇందులో పోలీసు, రేవంత్ ప్రభుత్వం జమిలిగా విఫలమైందన్నది నిఖార్సయిన నిజం. ఆ ఘటనలో విఫలమైన అక్కడి పోలీసులపై నిస్సందేహంగా చర్య తీసుకోవలసిందే. ఈ ఘటనను ముందుగా ఊహించని నిఘా వైఫల్యమూ విమర్శలకు అర్హమైనవే.

అయితే దానిని శాంతిభద్రతల కోణంలో చూడాలే తప్ప, దానికి మళ్లీ ఆంధ్రా సెంటి‘మంట’ రగిల్చడం అవివేకం. అరాజకీయం! బాధితుడు కౌశిక్‌రెడ్డి తనపై జరిగిన దాడిని, యావత్ తెలంగాణ సమాజంపై జరిగిన దాడిగా ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేయడం విడ్డూరం. ఒక సక్సెస్‌ఫుల్ సినిమా స్టోరీ ఒక్కసారికే హిట్టవుతుంది. మళ్లీ అలాంటి ఫార్ములాలు రెండోసారి పనిచేయవు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ కార్డును ప్రయోగిస్తే ఎలా? కౌశిక్‌రెడ్డి కూడా అదే చేస్తున్నట్లుంది కనిపిస్తోంది.

బహుశా.. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటుతున్నా, ఇంకా తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉందన్న ఆశతో కౌశిక్‌రెడ్డి, సెంటిమంటను రగిలించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఇప్పుడు కృష్ణాజిల్లా నుంచి వచ్చిన ఆంధ్రోడయిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని మళ్లీ కృష్ణాజిల్లాకు పంపిస్తామని, ఇది బతకడానికి వచ్చిన నీ అయ్య జాగీరా అన్న కౌశిక్‌రెడ్డి ప్రశ్నలు.. ఆయన వ్యక్తిగతమైనవా? పార్టీ అధికార గళమా? అన్నది తేల్చాల్సిన బాధ్యత.. అమెరికాలో ఉన్నా కూడా చిత్తశుద్ధితో ట్వీట్లు చేస్తున్న కేటీఆర్‌దే.

ఒకవేళ కౌశిక్‌రెడ్డి తన పార్టీ అధినేత కేసీఆర్ అనుమతి తీసుకునే ఆ ప్రకటన చేసి ఉంటే.. పార్టీగా బీఆర్‌ఎస్ తెలంగాణ సమాజం సంధించే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలిందే. ఎందుకంటే.. ఇప్పుడు ఏ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రోడని ఎమ్మెల్యే గాంధీని తిట్టిపోశారే.. ఆ మహాత్మా గాంధీకి పిలిచి రెండుసార్లు టికెట్లు ఎట్ల ఇచ్చారు? ఆయన పైరవీ చేసిన కులానికి స్థలం ఎలా కేటాయించారు? అదే కృష్ణాజిల్లాకు చెందిన మెగా కంపెనీకి తెలంగాణలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎలా ధారాదత్తం చేశారన్నది ఒక ప్రశ్న.

అదే కృష్ణా జిల్లాకు చెందిన మెగా కృష్ణారెడ్డి కంపెనీ నుంచి వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎట్ల తీసుకున్నారన్నది మరో ప్రశ్న. మెగా కంపెనీకి తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్టబెట్టినందుకే కదా.. ఆ కంపెనీ అన్ని వేల కోట్ల రూకలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చదివించుకుంది? లేకపోతే బీఆర్‌ఎస్ ఏమైనా శంకరమఠమని అన్ని వేల కోట్లు సమర్పించుకుందా ఏంటి? ఇది క్విడ్ ప్రో కో కాదా? అన్నది అప్పట్లో వినిపించిన ఆరోపణ. అన్నట్లు అప్పట్లో షర్మిలక్క కూడా ఇదే ఆరోపణలతో కదా కేంద్రహోంశాఖకు మెగాపై ఫిర్యాదు చేసింది?

సారు జమానాలో నవయుగ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ వంటి ఆంధ్రా కంపెనీలకు, ఇంకా కడప పెద్దరెడ్ల కంపెనీలకు తెలంగాణలో వేల కోట్ల కాంట్రాక్టులు ఎట్ల కట్టబెట్టారు? కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రోళ్లకు కార్పొరేటర్ టికెట్లు ఎందుకిచ్చారు? అసలు తెలంగాణవాది ఆంధ్రాలో పార్టీకి అధ్యక్షుడిని ఎట్ల నియమించారు? ఆంధ్రా సర్కారు నుంచి తన సొంత మీడియాకు యాడ్స్ ఎట్ల తీసుకున్నారు? ఆంధ్రా సీఎం జగన్ సాక్షి మీడియాకు తెలంగాణలో యాడ్లు ఎట్ల ఇచ్చారు? మహారాష్ట్ర వ్యక్తిని సీఎంఓలో ఎలా నియమించారు? ఢిల్లీలో పరాయి రాష్ట్రం వాడిని ఎలా నియమించారు? ఇలాంటి ప్రశ్నలకు కౌశిక్‌రెడ్డి జవాబు ఇస్తారా? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇస్తారా? ప్రెసిడెంట్ కేసీఆర్ ఇస్తారా? చూడాలి.

అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటి, ముచ్చటగా మూడు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ వాదం.. జై తెలంగాణ నినాదాలు వర్కటవుతాయనుకోవడం అత్యాశ. ఎందుకంటే ఇప్పుడు పాలనంతా తెలంగాణవారిదే. అందులో మిగిలిన ప్రాంతాలకు భాగస్వామ్యం లేదు. సరే పాలకులు ఎవరైనా, మెగా కంపెనీ కాంట్రాక్టర్ల కత్తికి ఎదురుండదనుకోండి. అదొక ఆర్ట్ ఆఫ్ లివింగ్. అది వేరే విషయం. పైగా రెడ్ల రాజ్యం కూడానూ. మరి ఇంకెక్కడి తెలంగాణ వాదం?

అయినా తెలంగాణ జాతిపిత అధికారంలో ఉన్నప్పుడే.. పార్టీలోని ‘తెలంగాణ’ పేరును గొంతునులిమిన కేసీఆర్ సారు పార్టీకి, అసలు తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత ఉందా అన్నది కాంగ్రెస్ సంధిస్తున్న లాజికల్ క్వశ్చన్. మొన్నామధ్య నెలల తరబడి తీహార్ జైల్లో ఉన్న కవితక్క… కోర్టుకు హాజరైన సందర్భంలో, జై తెలంగాణ అంటూ పిడికిలి బిగించడాన్ని, కాంగ్రెస్ సోషల్‌మీడియా దళాలు తెగ ర్యాగింగ్ చేయడాన్ని మర్చిపోకూడదు.

‘‘తెలంగాణ వచ్చి పదేళ్లయిందమ్మా. ఇంకా మీ స్వార్థం కోసం తెలంగాణ కార్డును ఎందుకు వాడుతున్నారు? అసలు మీ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లుంది. మాకెవరికీ ఉద్యోగాలు రాలే. ఉద్యోగాలన్నీ మీ ఖాందాన్‌కే. ఇప్పుడు మేమంతా సుకూన్‌గా ఉన్నాం. అయినా మీరేదో సొతంత్రంలో పాల్గొన్నట్లు జై తెలంగాణ అని పిడికిలి బిగిసే,్త మన తెలంగాణ సమాజమేమీ మళ్లీ మోసపోదు. మీరు జైలుకెళ్లింది సారా కేసులో అని గుర్తిస్తే మంచిది. అక్కడ జై తెలంగాణ అని పిడికిలి బిగించి మన రాష్ట్రం ఇజ్జత్ తీయవద్ద’ంటూ సోషల్‌మీడియాలో సెటైర్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే.

అన్నట్లు.. కౌశిక్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై చేసిన కామెంట్లకు.. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, మాధవరం కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సుధీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే వీరంతా కౌశిక్‌రెడ్డి చెప్పిన ఆ ఆంధ్రోళ్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలే కాబట్టి!

LEAVE A RESPONSE