Suryaa.co.in

Telangana

20న ఎస్ ఎల్ బి సి సందర్శనకు భట్టి విక్రమార్క

-డిప్యూటీ సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి.
-పాదయాత్రలో ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయిస్తానని హామీ
-ఇచ్చిన మాట ప్రకారంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు
-రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక
-దశాబ్ద బిఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన
ఎస్ ఎల్ బి సి, నక్కలగండి ప్రాజెక్టు
-నేటి పర్యటనలో అధికారులకు దిశా నిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం

నల్లగొండ: “పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం 10 కిలోమీటర్ల మేర తొవ్వాల్సిన ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 80 శాతం పూర్తి అయిన ఈ ప్రాజెక్టుకు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో కేవలం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరు, 512 గ్రామాలకు త్రాగునీరు అందేది. బిఆర్ఎస్ పాలకులకు రైతులకు సాగు నీరు అందించాలన్న చిత్త శుద్ది లేదు. కానీ వచ్చేది కచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వంలో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పూర్తి చేయించి రైతులకు సాగు నీరు అందిస్తానని” పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 83వ రోజున (2023 జూన్ 07న)
ఎస్ ఎల్ బి సి సొరంగం పనుల సందర్శన సందర్భంగా నాటి సీఎల్పీ నేత, ప్రస్తత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నదాతలకు మాట ఇచ్చారు.

ఇచ్చిన మాటను అమలు చేయడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో సాగు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు.

పది సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన నిధులు, సొరంగం తవ్వడానికి కావాల్సిన యంత్ర పరికరాలు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి కార్యచరణ ప్రణాళిక తయారు చేయించారు. కేవలం రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

నిధుల కోసం వెనుకాడొద్దని బడ్జెట్ ఎంతైన కేటాయించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అధికారులకు చెప్పడమే కాకుండా బడ్జెట్లో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో గత 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన ప్రాజెక్టు పనుల్లో కదలిక మొదలైంది. సొరంగం పనులను తొవ్వడానికి పాడైన టన్నేల్ బోరింగ్ మిషన్ బేరింగ్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

త్వరలోనే మిషన్ బేరింగ్ రానున్నది. ఔవుట్ లెట్ పనులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తికావడానికి కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు. ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేయడానికి సహచర మంత్రులతో కలిసి శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్ ఎల్ బి సి టన్నేల్ వద్దకు వస్తున్నారు.

LEAVE A RESPONSE