Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థ అభివృద్ధి జీరో!

– చంద్రబాబు పాలనలో కళకళ
– జగన్ సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేని అసమర్థుడు
– నిండు కుండలు రాయలసీమ నీటి ప్రాజెక్టులు
– రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి

అమరావతి: వైసీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడం వల్లే గత అయిదేళ్ళలో నీటి ప్రాజెక్టులు మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రాజెక్టులను అభివృద్ధి దిశగా నడిపారు. పడిన ప్రతి నీటి చుక్కను ఎలా సద్వినయోగం చేసుకోవాలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, కాలువలు ఎలా నింపాలనే ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలను చూస్తే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కేవలం రూ.2,012 కోట్లు ఖర్చు చేశారు. అది కూడా ప్రాజెక్టుల నిర్వహణకు కాకుండా, భూసేకరణకు మాత్రమే ఖర్చు చేసి ప్రాజెక్టులను గాలికొదిలేశారు. ప్రాజెక్టుల నిర్వహణ చేతకాక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేంద్రం చేతులకు అప్పజెప్పారు. రాయలసీమ నీటిపారుదల వ్యవస్థను గత ఐదేళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

శ్రీశైలం నుండి మొదలయ్యే నీటి వ్యవస్థ నిర్వహణను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రాయలసీమకు ద్రోహం చేశారు. రాయలసీమ నాది, కడప నాది అని చెప్పే జగన్ గాలేరు,నగరి, హంద్రీనీవా, వెలుగుగంగ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా గాలికొదిలేశారు. 2014-19 వరకు హంద్రీనీవాలో టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.4,182కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.515కోట్లు ఖర్చు పెట్టారు. 3వేల క్యూసెక్కుల నీరు పోవాల్సి ఉండగా, కనీసం 1,500క్యూసెక్కులు కూడా వెళ్లలేని దుస్థితికి తీసుకొచ్చారు. రాయలసీమ దుర్భిక్ష మిషన్ అనే పేరుతో రూ.33,800కోట్లతో భారీ ప్రాజెక్టు పేరుతో టెండర్లు పిలిచి కనీసం ప్రారంభించలేదు. కానీ హడావుడి చేశారు. కడప జిల్లాలో రూ.12వేల కోట్లతో జీఓలు ఇచ్చి, ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు అంటే జగన్ ఎంత చేతకానివారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పనులు టీడీపీ ప్రభుత్వం 75శాతం పూర్తిచేస్తే, వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు కదల్లేదని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

పోలవరం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కృష్ణాడెల్టాకు వచ్చే నీరు శ్రీశైలం నుండి రాయలసీమకు నీరు వస్తే రాయలసీమ సంతోషంగా ఉంటుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో పోలవరం డయాఫ్రం వాల్ ను దెబ్బతీశారు. నేడు మరోసారి డయాఫ్రం వాల్ ను కట్టాల్సిన పరిస్థితిని జగన్ తెచ్చాడు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో తన అనుయాయులకు టెండర్లు కట్టబెట్టిన వ్యక్తి జగన్. వైసీపీ పాలనలో సంపదను సృష్టించలేక, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంకు నీరు తీసుకురావాలని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటి కోసం చంద్రబాబు రూ.475కోట్లు మంజూరు చేసి ఖర్చు చేస్తే జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిపేసి కక్షసాధించాడు. 2024 ఎన్నికల సమయంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ లో తాత్కాలిక గేట్లు పెట్టి, మోటార్లతో నీళ్లు పెట్టి కుప్పం రైతులను జగన్ మోసం చేశాడు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, పింఛ ప్రాజెక్టులు జగన్ అసమర్ధతనం వల్ల కొట్టుకుపోయాయి. ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు జగన్ కనీసం టెండర్లు కూడా పిలిచిన పరిస్థితి లేదన్నారు.

అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సమయంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా జగన్ పరామర్శించిన దాఖలాలు లేవు, వారి కుటుంబాలను ఆదుకోలేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు బాధితులను ఆదుకున్నారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కడప జిల్లాలో అన్నమయ్య, గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువలు ప్రారంభంకాలేదు, జెర్రికోన, అడవికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్, రాయలసీమలోని గాలేరునగరి, హంద్రీనీవా పనులను జగన్ గాలికొదిలేశాడు. వీటిని పూర్తిచేయడం కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.

ఊహించని రీతిలో వరదలు వస్తే, వరద నుండి ప్రజలను 10రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా కాపాడుకున్న ఘనత చంద్రబాబుది. వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నారు. వరద నీటితో ప్రాజెక్టులను నింపి, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు. గండికోట ప్రాజెక్టు, చిత్రావతి, పైడిపాలె రిజర్వాయర్లను వరద నీటితో చంద్రబాబు నింపారు. గండికోట రిజర్వార్ 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 26 టీఎంసీలతో మొట్టమొదటిసారి నింపిన ఘనత చంద్రబాబుది, కూటమి ప్రభుత్వానిదని శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు 17టీఎంసీలకు 10 టీఎంసీలతో నిండుగా ఉంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రాజెక్టులకు నీరు పుష్కలంగా అందుతోంది. ఈ ఏడాది రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతోంది. చెరువుల్లోనూ నీటిని నింపి ఖరీఫ్, రబీకి పుష్కలంగా నీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది. రాయలసీమలో వర్షపు నీటితో పండుగ వాతావరణం కనబడుతోంది. జగన్ పాలనలో వర్షపు నీరు వస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా చేస్తే, కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను సమర్థవంతంగా నింపి ప్రజలకు నీటిని అందుబాటులోకి తెస్తున్నారు. పులివెందులలో పైడిపాలెం, చిత్రవతి ప్రాజెక్టులు నేడు నిండుకుండల్లా ఉన్నాయి. వైసీపీ పాలనలో చుక్క నీటిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. రాయలసీమ రైతుల్లో ధైర్యాన్ని 100రోజుల్లోనే నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నీటిపారుదల వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత చంద్రబాబుది అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాను అన్నారు.

LEAVE A RESPONSE