Suryaa.co.in

Andhra Pradesh

నన్ను చిత్రహింసలకు గురి చేసినప్పుడు జగన్ మతం మానవత్వం ఎక్కడ పోయింది?

– డిక్లరేషన్ ఇస్తే రెంటికి చెడ్డ రేవడి అవుతానేమోనని జగన్మోహన్ రెడ్డి కి భయం
– అప్రహతిహతంగా తనకే క్రైస్తవుల ఓట్లు పడుతున్నాయని ఆయన భావిస్తున్నారేమో?
– పీవీ సునీల్ కుమార్ ను తక్షణమే అరెస్టు చేయాలి
ఆయన దాష్టీకంపై వాంగ్మూలమిచ్చిన సాక్షులు
-నన్ను భయపెట్టాలని చూడొద్దు… నాకు లేనిదే భయం
– నేనేమీ క్రైస్తవ మత వ్యతిరేకిని కాదు
– బిఆర్ అంబేద్కర్ అసలు సిసలైన ఫాలోవర్ ను
– ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆచరించాలని మాత్రమే చెబుతున్నా
– మా దేవాలయానికి అడ్డంగా ఉన్న కర్రను తొలగిస్తే, నాపై దాడిని ప్రోత్సహిస్తూ, నీలాప నిందలు వేస్తారా?
– క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుకు ఫిర్యాదు చేసే హక్కు లేదు
-ఏలూరుపాడు లో ఒక బాధితుడి కన్ను పోగొట్టిన వ్యక్తులే అతడి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారా?
– ఈ కేసులో ఫిర్యాదుదారుడైన కోన జోసెఫ్ క్రిస్టియన్
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార, సాంప్రదాయాల ప్రకారం శ్రీవారిపై తనకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెనుకంజ వేయడానికి తాను ఎక్కడ రెంటికి చెడ్డ రేవడి అవుతానేమో నన్న భయమే కారణమై ఉంటుందని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు అన్నారు.

శ్రీవారి పై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి పూజిస్తే, అప్రహతీతంగా తనకు పడతాయని భావిస్తున్న క్రైస్తవుల ఓట్లు దూరమవుతాయనే ఆందోళన చెందుతున్నారేమోనన్నారు. క్రైస్తవ మత ఆచార ప్రకారం క్రీస్తు ఒక్కడే దేవుడని విశ్వసించడంతో పాటు, ఇతర దేవుళ్ళను పూజించమని తనకు తెలిసిన క్రైస్తవ మిత్రులు తెలిపారన్నారు.

శుక్రవారం నాడు సాయంత్రం ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈనెల 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకొని స్వామివారిని దర్శించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై తనతో పాటు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, పార్టీ ఇతర నాయకులు కూడా స్పందించారన్నారు.

క్రైస్తవ మతాన్ని ఆచరించే జగన్మోహన్ రెడ్డి, శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వాలని, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దైవదర్శనానికి వెళ్లాలని కోరడం జరిగిందన్నారు. దానికి గతంలో టీటీడీ చైర్మన్లు గా పనిచేసిన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి లు మాట్లాడుతూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 5 సార్లు డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారిని దర్శించుకున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలను సమర్పించారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

గతంలో ఎలా వెళ్లారని అర్థం లేని వాదనను వారు తెరపైకి తేవడం విస్మయాన్ని కలిగించిందన్నారు. , టీటీడీ చైర్మన్ గా మీలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి లాంటి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి వారిని దర్శించుకున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. కంచె చేను మేసిందన్న చందంగా టీటీడీ చైర్మన్ గా హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులు, తమ పార్టీ నాయకుడని దేవాలయ ఆచార, సాంప్రదాయాలను మంటగలిపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

గతంలో రాష్ట్రపతి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసిన అబ్దుల్ కలాం కూడా, స్వామి వారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే యూపీఏ అధినేత్రి గా ఉన్న సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. రాష్ట్రపతి హోదాలో స్వామివారి దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం, స్వయంగా దేవాలయ అధికారులను పిలిచి, ఆలయ సాంప్రదాయాలను గురించి అడిగి తెలుసుకుని డిక్లరేషన్ సమర్పించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ సమర్పించాల్సిందిగా అడిగితే ఛీ, ఛీ అంటూ అధికారులను చీదరించుకొని, చెప్పులు వేసుకునే మాడవీధుల్లో తిరిగారన్నారు.

దేవుడు పిలిచాడేమోననుకున్నా

ఈనెల 28వ తేదీన కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటానని జగన్ మోహన్ రెడ్డి పేర్కొంటే, దేవుడు పిలిచాడేమోనని అనుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శ్రీవారిని దర్శించుకుని చేసిన తప్పును క్షమించమని, తెలిసి తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చితాన్ని కోరుకుంటారని ఆశించినట్లుగా తెలిపారు.

కానీ అంతలోనే తూచ్ అంటూ జగన్మోహన్ రెడ్డికి కాలు బెణికిందని, ఆయన కాలినడకన తిరుమల కొండకు చేరుకోవడం లేదని ప్రకటించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కోర్టులకు హాజరయ్యే సమయంలో కూడా ఇలాగే కాలు బెణికి మణిపాల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందేనన్నారు.

జగన్మోహన్ రెడ్డి కార్లో నేరుగా కొండపైకి వచ్చినప్పటికీ, డిక్లరేషన్ సమర్పించి శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. డిక్లరేషన్ గురించి అడిగితేనే జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఒకవేళ శ్రీవారిని దర్శించుకోవడానికి డిక్లరేషన్ సమర్పిస్తే ఆయనకు ఇంట్లో ఏమైనా సమస్యలు ఎదురవుతాయేమోనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఏనాడు తన శ్రీమతి తో కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి భార్య క్రైస్తవ మతాన్ని కచ్చితంగా పాటిస్తుందేమోనని, అందుకే ఆమె శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు రాలేదేమోనన్నారు.

జగన్మోహన్ రెడ్డి సతీమణి క్రైస్తవ మతాన్ని కచ్చితంగా ఆచరించడంలో ఎటువంటి తప్పు లేదని, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆయన, ఆలయ సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని, లేనిపక్షంలో అక్కడకు వెళ్లి రాద్ధాంతం చేయడం ఎందుకని రఘురామకృష్ణం రాజు సూటిగా ప్రశ్నించారు.

నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష

జగన్మోహన్ రెడ్డి గతంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ చట్టం 30ని అమలు చేశారని, ఇప్పుడు తిరుపతి పోలీసులు అలిపిరి వరకు అదే చట్టాన్ని అమలు చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డితో పాటు తిరుమలకు అల్లరి మూకలు చేరి చిల్లరగా వ్యవహరిస్తే ఎవరిది బాధ్యత అని, అందుకే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారన్నారు.

నా మతం… మానవత్వమన్న జగన్మోహన్ రెడ్డిని తీరు విడ్డూరం

నాకు మతం లేదని, నా మతం మానవత్వమన్న జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఇంతలోనే అంత మానవత్వాన్ని ఎలా పునికి పుచ్చుకున్నారో అర్థం కావడం లేదన్నారు.

నన్ను లాకప్ లో దారుణంగా హింసించడమే కాకుండా, మూడుసార్లు నాపై హత్యా ప్రయత్నం చేసినప్పుడు ఆయన మతమైన మానవత్వం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా సిగ్గనిపిస్తోందన్నారు. నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు వీడియో చూసి ఆనందించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మతమైన మానవత్వం చచ్చిపోయిందా అంటూ నిలదీశారు.

సినిమాలో ఆత్రేయ గారు ఇలాంటి డైలాగులు రాస్తే బాగుంటాయని, జివిడి కృష్ణమోహన్ రాసిస్తే, జగన్మోహన్ రెడ్డి చదివితే చెత్తగా ఉంటాయని మండిపడ్డారు. ఈ తరహా సినీ డైలాగులను జగన్మోహన్ రెడ్డి చెబితే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు.

ఒక సాధారణ ఎమ్మెల్యేతో 6 మందికే దైవ దర్శనానికి వెసులుబాటు

గతంలో జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ప్రయాణిస్తూ కూడా ముఖ్యమంత్రి హోదాలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లను నరికించిన మహానుభావుడని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తిరుమల కొండకు వేలాది మందిని వెంటేసుకొని రావడం కుదరదమ్మా. ఒక సాధారణ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆరు మందికి మాత్రమే దైవ దర్శనానికి అనుమతినిస్తారని పేర్కొన్నారు.

వైకాపాకు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలుపుకున్న ఒక్కొక్కరికి 6 మంది చొప్పున దైవ దర్శనానికి అవకాశాన్ని ఇస్తారన్నారు. తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వడం ఖచ్చితమని, మాజీ ముఖ్యమంత్రిని అంటే కుదరదని తేల్చి చెప్పారు.

ఒక మాజీ ముఖ్యమంత్రిని దేవుడిని కూడా చూడనివకపోవడం బాధనిపిస్తోందన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఒక ఎంపీ ని తన నియోజకవర్గానికి నాలుగున్నర ఏళ్ల పాటు రాకుండా అడ్డుకోవడమే కాక, ప్రధానమంత్రి కార్యక్రమానికి హాజరయ్యేందుకు రైలులో వస్తుంటే, రైలు బోగీని దగ్ధం చేసి హత్యకు కుట్ర చేశావు కదరా బాబని అన్నారు.

ఇప్పుడు తిరుమల కొండపైకి వేలాది మందిని తీసుకువెళ్లి హడావిడి చేస్తానంటే కుదరదన్నారు. పద్ధతి ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పి, సుబ్బారెడ్డి తిరుమల కొండపై డిక్లరేషన్ సాంప్రదాయాన్ని ఎత్తివేశారంటే కుదరదని స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి కి ఎత్తి వేసే అధికారం ఉన్నప్పుడు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులైన శ్యామల రావు, వెంకయ్య చౌదరి కు మళ్లీ డిక్లరేషన్ సాంప్రదాయాన్ని పునరుద్ధరించే హక్కు కూడా ఉంటుందన్నారు.

టీటీడీ అధికారులు అమలు చేస్తున్న సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేసి, ఒక సాధారణ ఎమ్మెల్యేగా నిబంధనలను పాటించి శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయితే ఏమిటని, శ్రీవారి వద్ద అందరూ సాధారణ భక్తులేనని పేర్కొన్నారు.

320 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యి ఎవరైనా సరఫరా చేస్తారా?

320 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యిని ఎవరైనా సరఫరా చేస్తారా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఇది మినిమం కామన్ సెన్స్ పాయింట్ అని పేర్కొన్నారు. నెయ్యిని రిజెక్ట్ చేస్తే ఎవరైనా సి ఎఫ్ టి ఆర్ ఐ కి పంపుతారన్న జగన్మోహన్ రెడ్డి, ఎన్డిడిబి కి ఎందుకు పంపారో తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు.

సి ఎఫ్ టి ఆర్ ఐ కి పంపితే జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తారని కాబోలు, ఎన్ డి డి బి కి పంపి ఉంటారన్నారు. ఎన్ డి డి బి కి పంపితే తప్పేమిటని ప్రశ్నించారు. ఆవు సరిగా మేత తినకపోతే కూడా , పాలల్లో ఫ్యాట్ కంటెంట్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి కొత్త థియరీ కనుక్కున్నాడని ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారి కొండపై అన్యమతస్తులు ఉండరాదని, కొండపై హిందూ మతం పై విశ్వాసం కలిగి సాంప్రదాయాలను గౌరవించే వారు మాత్రమే ఉండాలన్నారు.

లడ్డు ప్రాశస్త్యం, విశిష్టతను పునరుద్ధరించి, ప్రక్షాళన కు చర్యలు తీసుకొని, సంప్రోక్షణ ద్వారా తిరిగి భక్తుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉంటే, కేవలం తన రాజకీయం స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం దారుణమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి నుంచి పిలుపు వచ్చిందేమోనని తాను తొలుత భావించానని కానీ ఆయనకు ఆ దేవదేవుడి నుంచి ఇంకా పిలుపు రాలేదన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరికైనా ఆయన నుంచి పిలుపు రావాల్సిందేనని పేర్కొన్నారు. మరో 10 రోజుల తర్వాత అయిన జగన్మోహన్ రెడ్డి బెణికిన కాలు నొప్పి తగ్గిన తర్వాత ఒక సాధారణ భక్తుడిలా వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని , అలాగే తన ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకొని నిండు మనసుతో స్వామి వారిని క్షమించమని వేడుకోవాలని సూచించారు. దైవదర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ పై సంతకం చేయాలన్నారు.

సమాజాన్ని ఉద్ధరించడం తర్వాత… ముందు సరిగ్గా ఉద్యోగం చేయి

సమాజాన్ని ఉద్ధరించడానికి అంబేద్కర్ ఇండియా మిషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ ముందు సరిగ్గా ఉద్యోగం చేయడం నేర్చుకోవాలన్నారు. పీవీ సునీల్ కుమార్ దాష్టీకం గురించి ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించడం జరిగిందని గుర్తు చేశారు.

అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతిని సునీల్ కుమార్ ఎలా ప్రభావితం చేశారో పేర్కొనడం జరిగిందన్నారు. మూడుసార్లు తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, స్టీఫెన్ రవీంద్ర తో కలిసి ఒకసారి తన హత్యకు కుట్ర చేశారన్నారు. రైలు బోగీని దగ్ధం చేసి హత్యాయత్నానికి కుట్ర చేసినప్పటికీ, శ్రీ వెంకటేశ్వరుడి దయ వల్ల తప్పించుకున్నానని తెలిపారు.

నాపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుట్రలు, జరిగిన దాష్టీకంపై నాలుగేళ్లుగా పోరాడుతున్నానని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో అన్యాయం జరిగిన నాకు, న్యాయం చేసే దిశగా అడుగులు వేయడంతో స్వాంతన చేకూరినట్లు తెలిపారు. విజయ్ పాల్ ఎక్కడ దాక్కున్న దొరుకుతారన్న రఘురామకృష్ణం రాజు, పీవీ సునీల్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

లాకప్ లో తనని చిత్రహింసలకు గురి చేసిన వారి వద్దకు వచ్చి అలా కాదు ఇలా కొట్టాలి అంటూ తన పై వాడి మెప్పుకోసం తీవ్రంగా హింసించినట్లుగా సాక్షుల వాంగ్మూలాన్ని ఈనాడు దినపత్రిక తన వార్తా కథనంలో ప్రచురించడం జరిగిందని పేర్కొన్నారు. కోనసీమలో ఎవడో ఒక అడ్రస్ లేనివాడు.. విజయ్ పాల్, పీవీ సునీల్ కుమార్ జాతి సంరక్షకులని, రఘురామకృష్ణం రాజును హింసించిన రియల్ హీరోలని పేర్కొనడం వారి మానసిక దౌర్భాల్యాన్ని తెలియజేస్తుందన్నారు.

రఘురామకృష్ణంరాజును హింసించిన వారిని దేశభక్తులుగా పేర్కొంటామని అడ్రస్ చెప్పకుండా ఒకడు రాశాడని, దమ్ముంటే అడ్రస్ చెప్పాలన్నారు.

రెండు రోజుల్లో పీవీ సునీల్ కుమార్ ను అరెస్టు చేయాలి

లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో పోలీసు అధికారి పివి సునీల్ కుమార్ ను రెండు రోజుల వ్యవధిలో అరెస్టు చేయాలని, అప్పుడు ఆయన భక్తులు ఏమి మాట్లాడుతారో తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రఘురామ కృష్ణంరాజును కొడితే విజయ్ పాల్, పీవీ సునీల్ కుమార్ హీరోలు అయిపోతారా అంటూ ప్రశ్నించిన ఆయన , నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకొమ్మ ని మాత్రమే కోరుతున్నానని గుర్తు చేశారు.

2021 లో ఒక వ్యక్తి కన్ను పోగొట్టిన వారే అతనిపై తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆ వ్యక్తి 44 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపారని పేర్కొన్నారు. అయితే కన్ను పోగొట్టుకున్న వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసిన కోన జోసెఫ్ కాలేజీ సర్టిఫికెట్లలో క్రిస్టియన్ గా పేర్కొనడం జరిగిందన్నారు.

అతడి తల్లిదండ్రుల సంస్కారాలు కూడా క్రిస్టియన్ స్మశాన వాటిక లోనే ఆ మతాచారం ప్రకారం జరిగాయని పేర్కొన్న ఆయన, ఇప్పటికీ సమాధులు కూడా అక్కడే ఉన్నాయన్నారు. ఏలూరుపాడు సీఐఎస్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకడిగా జోసెఫ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారని తెలిపారు.

12 సంవత్సరాల క్రితం కోన జోసెఫ్ తిరిగి ఎస్సీ సర్టిఫికెట్ ను సంపాదించి, ఇలా రకరకాలుగా కేసులు పెట్టి సామాన్యులను వేధిస్తున్నారన్నారు. కేసులు పెట్టడానికి క్రిస్టియన్ మతస్తుడైన కోనా జోసెఫ్ అర్హుడు కాకపోయినప్పటికీ, పోలీసులు కేసులు ఎలా నమోదు చేస్తున్నారన్నది అంతుచిక్కడం లేదన్నారు. పోలీసులు, జోసెఫ్ మిలాఖతై ఈ విధంగా సామాన్యులపై కేసులు నమోదు చేస్తున్నారని, జోసెఫ్ కు తోడు అతడి అన్న కొడుకు కోన రంజిత్ కూడా ఇదేవిధంగా కేసుల నమోదు కు ఫిర్యాదుచేస్తున్నారని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసిన వెంటనే వారికి కొంత మొత్తం డబ్బులు ఇస్తుండడంతో ఇది వారికి ఒక వ్యాపకంగా మారిపోయిందన్నారు.

క్రైస్తవ మత వ్యతిరేకిని కాను… నిజమైన అంబేద్కర్ ఫాలోవర్ ని

తానేమి క్రైస్తవ మత వ్యతిరేకిని కానని, క్రైస్తవ మతం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరే నిజమైన అంబేద్కర్ ఫాలోవర్నని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు ఆయనపై ఉన్న గౌరవంతో అత్యధికంగా దండలు వేసిన వ్యక్తిని కూడా నేనే అయి ఉంటానన్నారు. బిఆర్ అంబేద్కర్ క్రిస్టియన్ కాదని, ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాలని గుర్తు చేశారు.

చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించమంటే నాపై దాడులు చేయమని పిలుపునిస్తారా?, ఇది ఎంతవరకు సమర్థనీయమని విజ్ఞులైన ప్రజలతో పాటు, అసలైన దళితులు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. న్యాయంగా దళితులకు దక్కాల్సిన రిజర్వేషన్లను మతం మారిన వారు తన్నుకు పోతుంటే, దళితుల తరపున మాట్లాడుతున్న తనని వారు సమర్ధించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వలెక్కల ప్రకారం రెండు శాతం ఉన్న క్రైస్తవులకు 29,500 చర్చిలా? నిజంగా ఉన్నది 22 శాతం

నిజంగా కేవలం రెండు శాతం మంది ఉంటే క్రైస్తవులకు రాష్ట్రంలో మరి 29500 చర్చిలు అవసరమా అని ప్రశ్నిస్తే కొట్టేస్తారా అంటూ రఘురామకృష్ణం రాజు నిలదీశారు. రాష్ట్రంలో 33 వేల హిందూ దేవాలయాలు ఉంటే, రాష్ట్రంలో 29,500 చర్చిలు ఉన్నట్టుగా గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని తాను ఇప్పుడు మాత్రమే మాట్లాడడం లేదని గతంలోనూ మాట్లాడానని గుర్తు చేశారు.

ఇదే విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి ఆధారాలతో సహా తీసుకువెళ్లి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. క్రిస్టియన్లు హిందూ మతాన్ని గౌరవించాలని, హిందువులు క్రైస్తవ మతాన్ని గౌరవించాలన్నారు. మా దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టి, కర్ర పాతగా దాన్ని భద్రంగా తొలగించి పక్కన పెడితే ఇంతలా నీలాప నిందలు వేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానికి నన్ను కొట్టాలి. తన్నాలని ప్రోత్సహించడం న్యాయమా? నాకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి పదవి ఎవరి వల్ల పోయిందన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు బయటపెట్టి అతని పతనానికి నాంది పలికింది నేనేనని పేర్కొన్నారు. కొంతమంది తమ పేర్లలోని ఫ్రంటు, బ్యాక్ కట్ చేసుకొని నన్ను భయపెట్టాలనుకుంటే, నాకు లేనిదే భయమని తెలిపారు. అందరినీ గౌరవించే నేను… ఎవరికి భయపడనని స్పష్టం చేశారు.

అన్యాయంగా ఎవరిపై కేసులు పెట్టొద్దన్న ఆయన, క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదుకు ఫిర్యాదు చేసే అర్హత లేదన్నారు. నిజమైన హిందువులను ఎవరైనా వేధిస్తే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. నాకు అంబేద్కర్ అంటే ఎంతో గౌరవం ఉంది. నేను ఏ తప్పు చేయను. ఎవరికీ భయపడను.

అంబేద్కర్ ను ప్రేమించాను. గౌరవించాను. తప్పుడు వార్తలను నమ్మేవారినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పటికీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను సహించను. అందరికీ అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసే అధికారం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

LEAVE A RESPONSE