Suryaa.co.in

Political News

ఏ సిట్టు అయితేనేం …కాలక్షేపానికి !?

శ్రీ స్వామివారి లడ్డూ ప్రసాదం లో ఆవు నెయ్యి పేరిట ఏదో ఆయిలు కలిపేసి సొమ్ము చేసుకున్న ఘటన బయటపడి ; ఇప్పుడు దర్యాఫ్తు కోసమని ఒక పోలీసు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది .
అయితే , “పోలీసు దర్యాప్తు ” అంటే ఎలా ఉంటుందో….అనుభవ పూర్వకంగా తెలిసిన వైసీపీ నేతలు , అది వద్దు ….అది వద్దు ….అంటూ సుప్రీం కోర్టుకు పరిగెత్తారు . న్యాయ స్థానాల పట్ల వైసీపీయులకు అపారమైన ‘ భరోసా ‘ ఉంది. తమకు అక్కడ న్యాయం లభిస్తుందనేది వారి నమ్మకం . అందుకే ” మీ ఆధ్వర్యం ” లో దర్యాప్తు చేయించండి అంటూ నాలుగేళ్లపాటు శ్రీ వేంకటేశ్వరుడి ఆలనా …పాలనా చూసుకున్న వై.వీ. సుబ్బారెడ్డి , ఆయనకు పరోక్ష మద్దతుగా సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టు కు విన్నవించారు .

సుప్రీం కోర్టు ఇప్పుడు …పాత సిట్టు తీసేసి , కొత్త సిట్టు వేసింది .
అయితే , ఇదేమైనా…ప్రభావితం చేయడానికి వీలు కాని “స్వతంత్ర ” దర్యాప్తు సంస్థ నా ? అని అంటే …కాదు అనే చెప్పాలి .
రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఈ కొత్త సిట్టు లో ఉంటారు కదా ! వారు డీజీపీ మాట వింటానికి రూల్స్ ఏమీ అడ్డం రావుకదా ! డీజీపీ గారు ….ముఖ్యమంత్రి గారి మాట కాదని , ఏమీ చేయరు కదా !
అంటే ….ముఖ్యమంత్రి చంద్రబాబు గనుక , తనకు నచ్చిన దర్యాప్తు ఫలితాన్ని కొత్త సిట్ నివేదిక లో జొప్పించాలి అని భావిస్తే ; రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల తో ఆ పని చేయించడానికి అడ్డంకి ఏమి ఉంటుంది?
కనుక , ఆ మేరకు ….అది “స్వతంత్ర ” దర్యాప్తు కాదు కదా !

ఇక కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పని చేసే “పంజరం లోని చిలుక ” సీబీఐ…. ఎంత ” స్వతంత్రం ” గా పని చేస్తుందో తెలుగు వారికి తెలియంది కాదు . కేంద్రం వారి కి ఇష్టులైన నేరగాళ్ల పట్ల ఎలా పని చేస్తుందో …. అయిష్టులైన నేరగాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు కదా ! అందువల్ల , వారి దర్యాప్తు కూడా నిష్పాక్షికంగా జరుగుతుంది అని చెప్పడం కుదరదు . కేంద్రం లో పెద్దల మనసెరిగి “దర్యాప్తు ” చేయడం లో మన సీబీఐ ను కొట్టిన దర్యాప్తు సంస్థ లేదు . ఇక, మిగిలిన 5 వ సభ్యుడు ఆహార,భద్రతా ప్రమాణాల సంస్థ నుంచి ఒకరు.

ఈ “దర్యాప్తు ” బృందం “స్వతంత్ర ” మైనదిగా భావించడానికి వీలే లేదు .
వివాదం సుప్రీం కోర్టు కు చేరింది కనుక; ఇందులో న్యాయం చేసినట్టు కూడా పౌర సమాజానికి కనపడాలి కనుక , వీలైనంత సహనాన్ని సుప్రీం కోర్టు ప్రదర్శించింది .
దర్యాప్తు సంఘాన్ని నియమించడానికి బదులు , ఏ రిటైర్డ్ న్యాయ మూర్తి నో సుప్రీం కోర్టు నియమించి ఉంటే;కలియుగం ముగిసే వరకు కథ ను సాగదీయవచ్చును అని అంచనా వేసిన వారికి , శుక్రవారం నాటి సుప్రీం తీర్పు తో కొంత ఆశాభంగం కలిగి ఉండవచ్చు .
“డబ్బూ పోయింది …. శనీ పట్టింది ….” అన్నట్టుగా ప్లీడర్లు పిండేసి ఉంటారు.
నిజానికి , తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం లో కల్తీ ఎప్పుడు ….ఎలా …ఎవరి వల్ల ….ఎందుకు మొదలైందనే ప్రశ్నలకు ఒక వారం రోజుల్లో సమాధానాలు కనుక్కోవచ్చు . అన్ని ప్రశ్నలకూ డాక్యుమెంట్ల లోనే సమాధానాలు ఉంటాయి. ఆ దాక్యుమెంట్లన్నీ డిజిటలైజ్ అయ్యి టీ టీ డీ పరిపాలనా భవనం లో ఉన్నాయి.
కొంచెం ఓపిక గా కొత్త సిట్టు సభ్యులు చూడడమే కావలసింది .

అయితే ;
*ఈ కొత్త సిట్టు కు ఎవరు నాయకత్వం వహిస్తారు ?
*సీబీఐ అధికారి నా ? రాష్ట్ర పోలీసు అధికారి నా ?
*వారి హోదా ఏమిటి ?
*రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులలో డీజీపీ స్థాయి అధికారిని రాష్ట్రప్రభుత్వం ఈ సిట్ సభ్యుడి గా నియమిస్తే ; సీబీఐ …. ఏ స్థాయి అధికారిని నియమించాలి ?
*ఈ సిట్ ను ఏర్పాటు చేస్తూ ఎవరు ఉత్తర్వులు జారీ చేయాలి ?
*కేంద్రమా , రాష్ట్రమా , సీబీఐ నా , సుప్రీమ్ కోర్టా?
*నివేదిక ను సీబీఐ డైరెక్టర్ ఎవరికి సమర్పించాలి ?
*రాష్ట్రానికా?, కేంద్రానికా , సుప్రీం కోర్టు కా ?

ఈ మొత్తం ప్రహసనం ముగియడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు . తెలిసినా … ఏమి జరుగుతుందో తెలియదు . తెలిసే లోపు ఎన్నికలు వచ్చి మీద పడతాయో తెలియదు . ఆ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు . తెలుగు వారి జాతకాలు ఎలా ఉంటాయో తెలియదు . ఏమీ తెలియనిదాని కోసం , ఏ సిట్ట్ అయితేనేం….కాలక్షేపానికి !?

– భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE