– దమ్ముంటే అక్రమంగా నిర్మించుకున్న ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి
– హైడ్రా అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా
– కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు విద్య వైద్య రంగాల్ని పట్టించుకోలేదు స్కూళ్లు నిర్మించలేదు, బడుగు బలహీన వర్గాలకు ఇండ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయలేదు.
పేదలు నివాసముంటున్న బస్తీలపై కన్నేసి ఆ ఇండ్లను కూల్చే పనికి శ్రీకారం చుట్టింది ఇలా దేశంలో ఎక్కడా జరగలేదు ఏ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేతలతో దుందుడుకు విధానాలకు పాల్పడటం సరికాదు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలమీద ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నాం.
పేదవాడి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదు. గతంలోనూ పేదల ఇండ్లు ఎట్టిపరిస్థితుల్లో కూల్చవద్దంటూ, బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా లేఖ కూడా రాశాం. ప్రజల ఆందోళనలు, మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. పేదల ఇండ్లపై మార్కింగ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వెలువడటంతో వెనుకడుగు వేసింది. సమగ్రమైన ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇండ్లను కూల్చడాన్ని బిజెపి వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
హైదరాబాద్ లోని 70 శాతం డ్రైనేజీ నీరంతా మూసీలో చేరుతోంది. గల్లీగల్లీలో డ్రైనేజీ సమస్య నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా.. లక్షా 50 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో అనాలోచితంగా చర్యలకు పాల్పడుతోంది. అందులో 50 వేల కోట్లతో పేదలకు ఇండ్లు నిర్మించాలి.
కాంగ్రెస్ సర్కారు ఇండ్లు కూల్చడంపై, పేదలను కొట్టడంపై చూపించే శ్రద్దను డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడంపై చూపించాలి. ఆ తర్వాత మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి. పైపులైన్ల నిర్మాణం చేపట్టాలి. వరదల నుంచి ముప్పు నుంచి బయటపడేలా పరిష్కారం చూపాలి. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి, ఆ తర్వాత బ్యూటిఫికేషన్ చేయాలి.
పేదలు ఇటుక ఇటుక పేర్చి, తమ రక్తాన్ని శ్రమగా మార్చి, తమ కష్టార్జితంతో ఇల్లు నిర్మించుకుంటే, వారి కళ్ల ముందే కూల్చివేయడం అన్యాయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలు నుంచి దృష్టిమరల్చే ప్రయత్నం చేస్తోంది.
హైడ్రా అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా. ఆయన ఆలోచనల నుంచి వచ్చిన ఒక సంస్థ హైడ్రా. అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు ఫాంహౌస్ లు, ఎస్టేట్ ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారు. ముందు వారిపై హైడ్రా ప్రతాపం చూపాలి. దమ్ముంటే అక్రమంగా నిర్మించుకున్న ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్లించడమే వారి నైజం. గతంలో ప్రజల దృష్టి మరల్చేలా మోటార్లకు మీటర్లు బిగిస్తారంటూ మాజీ సీఎం ఢిల్లీలో ధర్నా చేశారు. తెలంగాణలో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టారా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 400 హామీలను అమలు చేయకుండా చేతులెల్తేసి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ మీడియాలో చర్చల్లో నిలిచేలా ప్రయత్నిస్తున్నది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయకుండా అవినీతి ఆరోపణలతో న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటోంది.
తెలంగాణలోనూ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని అడ్డం పెట్టుకుని, కాంగ్రెస్ నాయకులు RG TAX, RR-TAX పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కంపెనీల నుంచి RR-TAX చేస్తున్నారు. పేద ప్రజలమీద ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నాం. పేదవాడి ఇండ్లను యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదు.
నీచ సంస్కృతిని కేసీఆర్ మొదలుపెట్టారు
కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను విమర్శించేందుకు ఇతరుల కుటుంబాల వ్యవహారాలను రాజకీయాలకు ముడిపెట్టడం, మహిళల వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం.
అటువంటి నీచ సంస్కృతిని కేసీఆర్ మొదలుపెట్టారు.. కేటీఆర్ ముందుకుతీసుకెళ్లారు.. నేడు రేవంత్ రెడ్డి , ఆ పార్టీ నాయకులు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాయకులు వ్యక్తిగత దూషణలు, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాలు, వ్యక్తులపై అభ్యంతకరమైన, దిగజారుడు భాషను తెలంగాణ సమాజం సహించదు.
కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఫోన్ ట్యాపింగ్ తో సినీ ప్రముఖులు, వ్యాపారస్తుల వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు గతంలో పోలీసు అధికారులే చెప్పారు.