Suryaa.co.in

National

రతన్ టాటాకు సినీ ప్ర‌ముఖుల నివాళులు

వ్యాపార దిగ్గ‌జం రతన్ టాటా మృతి పట్ల సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలిపారు.

భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు: చిరంజీవి
“భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాల‌కు ఆయ‌న‌ సేవలను మించిన‌వారు లేరు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ర‌త‌న్ టాటా ఒకరు. నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి, అసాధారణమైన‌ వ్యక్తి. టాటా బ్రాండ్‌ల‌ను ప్రపంచ పవర్‌హౌస్‌గా నిర్మించడమే కాకుండా మన దేశ నిర్మాణంలోనూ అద్భుతంగా దోహదపడ్డారు. నిజంగా మెగా ఐకాన్. మ‌నం ఒక గొప్ప మ‌న‌సున్న మంచి వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామికవేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు, సమగ్రత, దృక్పథం ఎల్లప్పుడూ తరాలకు స్ఫూర్తినిస్తాయి. మార్గనిర్దేశం చేస్తాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక!” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ర‌త‌న్ టాటా ఓ లెజెండ్: రాజ‌మౌళి
“ర‌త‌న్ టాటా ఓ లెజెండ్. ఆయ‌న‌ ఎప్పటికీ మ‌న హృద‌యాల్లో జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తుల‌ను ఉపయోగించకుండా ఒక రోజును ఊహించుకోవడం కష్టం. రతన్ టాటా వారసత్వం నిత్య జీవితంలో ఇమిడిపోయింది. ఎన్నో త‌రాల‌కు స్ఫూర్తి. పంచభూతాలతో పాటు ఎవరైనా కాలపరీక్షకు నిలబడతారంటే అది ఆయనే.

భారతదేశం కోసం మీరు చేసిన ప్రతిదానికీ ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసినందుకు ధన్యవాదాలు సర్. మీరు తరతరాలుగా నిలిచిపోయే గుర్తును మిగిల్చారు. నీకు వందనం… ఎల్లప్పుడూ నీ ఆరాధకుడు… జై హింద్” అంటూ జ‌క్క‌న్న త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ర‌త‌న్ టాటాది గోల్డెన్‌ హార్ట్: తార‌క్‌
“ర‌త‌న్ టాటాది బంగారంలాంటి హృద‌యం. ఆయ‌న‌ నిస్వార్థ దాతృత్వం, దూరదృష్టి గల నాయకత్వం లెక్కలేనన్ని జీవితాలను మార్చేశాయి. భారతదేశం ఆయ‌న‌కి ఎప్ప‌టికీ రుణపడి ఉంటుంది. ర‌త‌న్ టాటా ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నా” అని ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు.

లక్షలాది మందికి ఆశాజ్యోతి: ఖుష్బూ
“ఒక పరోపకారి. స్వచ్ఛమైన బంగారు హృదయం ఉన్న వ్యక్తి. లక్షలాది మందికి ఆశాజ్యోతి. నిరుపేదలకు వెలుగునిచ్చేందుకు ఎంతో కృషి చేసిన గొప్ప‌ వ్యక్తి. అలాంటి గొప్ప వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రు. మీరు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిస్ యూ సార్. ఓం శాంతి” అని న‌టి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE