Suryaa.co.in

Political News

విద్యా శాఖా మంత్రి – పంచకట్టు పెద్దమనిషి!

-ఏకాగ్రతతో సమస్యను విని – పరిష్కరించారు!
– ఏఐఎస్ఎఫ్‌ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ

ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన పాలకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలను, ఉద్యమాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిగణలోకి తీసుకోవాలి… సమస్యలను వినాలి… విజ్ఞతతో ఆలోచించాలి, పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్‌ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. లాఠీలతో అణచివేస్తామంటే, ప్రజలు కర్రుకాల్చి, వాతలు పెట్టి, పదవీ భ్రష్టులను చేస్తారు. సుపరిపాలన చేస్తే ప్రజలు పది కాలాలు గుర్తించుకుంటారు. అలాగే, న్యాయబద్ధమైన, హేతుబద్ధమైన పోరాటాలకు విజయం తథ్యం. ఈ ఉదంతం ఒక ప్రబల నిదర్శనం.

ఈ ముచ్చట 1973-75 నాటిది. నేను ఇంటర్మీడియేట్ బైపీసీ విద్యార్థిగా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న రోజులు. ఇంటర్మీడియేట్ పాఠ్యాంశాలకు సంబంధించి అసంబద్ధమైన విధానం అమలులో ఉండేది. బైపీసీ విద్యార్థులు జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు అదనంగా గణితం, ఎంపీసీ విద్యార్థులు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు జీవశాస్త్రాన్ని అదనంగా చదవాలన్న నిబంధన అమలులో ఉండేది.

ఈ సమస్యపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సును విజయవాడలో 1973లో నిర్వహించింది. ఆ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కార్యాచరణను రూపొందించింది. మూడు విశ్వవిద్యాలయాలకు ప్రాతినిథ్యంవహిస్తూ ముగ్గురు కన్వీనర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేను ఆ సదస్సుకు వెళ్ళలేకపోయాను. కానీ, నన్ను ఒక కన్వీనర్ గా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంతానికి ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కా. అజీజ్ పాషా ఉండేవారు.

సదస్సు సమ్మెకు పిలుపిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విజయవంతంగా జరిగింది. విద్యార్థుల ప్రదర్శనలు జరిగాయి. ఒకవైపు ఆందోళనను కొనసాగిస్తూనే ఒక ప్రతినిధివర్గం హైదరాబాదులో విద్యా మంత్రిని కలిసి, వినతిపత్రం సమర్పించాలన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు నేను హైదరాబాదుకు వెళ్ళాను.

ఆనాటి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి మండలి వెంకటకృష్ణారావుగారు. వారిని కలవడానికి రాష్ట్ర సచివాలయానికి ప్రతినిధి వర్గంగా వెళ్ళాం. బైపీసీ, ఎంపీసీ రెండు సంవత్సరాల పాఠ్యపుస్తకాలను మా వెంట తీసుకెళ్లాం. ఆ కట్టలను మంత్రి కార్యాలయంలోకి తీసుకెళ్ళడానికి భద్రతా సిబ్బంది ముందు ఒప్పుకోలేదు. విషయం చెప్పాక అనుమతించారు.

మేము మోసుకెళ్ళిన పుస్తకాల కట్టలను చూసిన విద్యా శాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావుగారు ఏంటా! కట్టలని అడిగారు. కట్టలు విప్పి, పుస్తకాలను చూపెట్టి, సమస్యను వివరించాం. బైపీసీ విద్యార్థులకు అవసరంలేని గణితం, ఎంపీసీ విద్యార్థులకు అవసరంలేని జీవశాస్త్రాన్ని పాఠ్యాంశాలుగా విధిగా చదవాలన్న విధానం అసంబద్ధమైనదని వారి దృష్టికి తీసుకెళ్లాం. ఆ విధానం పర్యవసానంగా విద్యార్థులపై అదనపు భారం పడుతున్నదని, దాన్ని రద్దు చేయమని విజ్ఞప్తి చేశాం. చర్చను పొడిగించకుండానే ఏఐఎస్ఎఫ్ డిమాండ్ తో ఏకీభవించి, ఆ విధానాన్ని రద్దు చేస్తామని మండలి వెంకటకృష్ణారావుగారు నిర్ధ్వందంగా హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడింది. ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆందోళనకు ఘనవిజయం లభించింది.

ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన పాలకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలను, ఉద్యమాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిగణలోకి తీసుకోవాలి, సమస్యలను వినాలి, విజ్ఞతతో ఆలోచించాలి, పరిష్కరించాలి. లాఠీలతో అణచివేస్తామంటే, ప్రజలు కర్రుకాల్చి, వాతలు పెట్టి, పదవీ భ్రష్టులను చేస్తారు. సుపరిపాలన చేస్తే ప్రజలు పది కాలాలు గుర్తించుకుంటారు. అలాగే, న్యాయబద్ధమైన, హేతుబద్ధమైన పోరాటాలకు విజయం తథ్యం. ఈ ఉదంతం ఒక ప్రబల నిదర్శనం.

LEAVE A RESPONSE