Suryaa.co.in

Andhra Pradesh

లిక్కర్ ధరల సవరణపై గజిట్ జారీ

– ఏ బాటిల్ ధర ఎంత ?

అమరావతి: కొత్త మద్యం పాలసీ అమలుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు చేసింది. రిటైల్ దుకాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరల సవరణ పైన గజిట్ జారీ చేసింది. ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది.

ప్రివిలేజ్ ఫీజు వసూలు
కూటమి ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం ఈ నెల 16 నుంచి అమలు కానుంది. ఇప్పటికే కొత్త షాపులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసారు. భారీ స్థాయిలో టెండర్లు దాఖలయ్యాయి. లాటరీ పద్దతితో దుకాణాలు ఖరారు చేసి..ఈ నెల 16వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ధరల పై క్లారిటీ
ఏదైనా ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధర రూ 150.50 గా ఉంటే..ఆ దానిని రూ 160 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుంది. అయితే, క్వార్టర్ మద్యం ధర రూ 99 గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో, రూ 100 ధరగా ఉంటే అందులో రూపాయిని మినహాయించి రూ 99కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మద్యం దుకాణాల టెండర్లకు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 89,643 వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అందుబాటులో అన్ని బ్రాండ్లు
దరఖాస్తుల ద్వారా ప్రభుత్వం రూ 2 వేల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసారు. అయితే, రూ.1800 కోట్లపైనే ఖజానాకు ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే దాఖలైన టెండర్లను ఈ నెల 12,13 తేదీలలో పరిశీలన చేయనున్నారు. 14వ తేదీన జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీసి టెండర్ ఖరారు చేయనున్నారు.

ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని బ్రాండ్ల మద్యం తిరిగి అన్ని దుకాణాల్లోనూ అందుబాటులోకి రానుంది.

LEAVE A RESPONSE