– తెగువను నేర్పిన పోలీస్ తల్లిదండ్రులు, కుటుంబాలకు సెల్యూట్
– టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం
– 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం
– బందోబస్తు సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం
– రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం
– సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు
– ‘పోలీస్ అమరవీరులను సంస్మరించుకునే రోజు’ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి: పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లనే సమాజం స్వేచ్ఛగా బతుకుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తెగువను నేర్పుతూ కని, పెంచిన పోలీసుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆమె సెల్యూట్ చేశారు.
సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఈ సమాజం రుణపడి ఉందన్నారు.
సంఘ విద్రోహ శక్తులను ఎదిరించి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి వారెందరో పోలీస్ వ్యవస్థకే ఆదర్శమన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి ఈ సందర్భంగా హోం మంత్రి అనిత నివాళులర్పించారు.నవతరానికి ఉత్సాహాన్ని స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహించుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యమన్నారు