సూర్యుడు త్రిమూర్తుల స్వరూపం
హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం.
శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
త్రిమూర్తుల శక్తి :సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి.
కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకమైనట్టు! సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.
– ఆనంద్ అర్వపల్లి