పీడిత, తాడిత ప్రజల గొంతుకై, పోరాటంతోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే సిద్ధాంతాన్ని నమ్మి. తన జీవిత కాలం అదే సిద్ధాంతంతో జీవించారు సాయిబాబా.
1998లో వరంగల్ లో ” ప్రజాస్వామిక తెలంగాణ- ప్రజల ఆకాంక్ష” పేరుతో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టన్స్ ఫోరమ్ -AIPRF ఆధ్వర్యంలో వరంగల్ లో రెండు రోజుల పాటు సదస్సు, రెండవ రోజు సాయంత్రం ములుగు రోడ్డు నుంచి హన్మకొండలోని JNS గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభ (జవహర్ లాల్ నెహ్రు స్టేడియం, హన్మకొండ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది) భారీ బహిరంగ సభ.
1996లో గద్దర్ అన్న పై కాల్పులు జరిగిన తర్వాత. ఆయన ట్రీట్ మెంట్ తీసుకుని, మళ్లీ బహిరంగ సభకు హాజరైన మొదటి బహిరంగ సభ అదే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటూ అశేష జనం. వేలాది మంది తో బహిరంగ సభ.
గద్దర్ అన్న ఢిల్లీ నుంచి వరంగల్ కు రైలులో వస్తూ, తన పై తాను రాసుకున్న పాటే “నన్నుగన్న తల్లులారా…. తెలంగాణ పల్లెలారా…..
మీ పాటనై వస్తున్నానమ్మో మా అమ్మా లారా …. మీ పాదాలకు వందనాలమ్మో మా అమ్మలారా….ఎడమ చేతిలో దిగిన తూటా ఎత్తమంది ఎర్ర జెండా…. వెన్నుపూసలో ఉన్న తూటా.. అన్నా పదా పాడుదామంది….” ఈ విషయాన్ని గద్దర్ అన్నే ఆ బహిరంగ సభలో వేలాది మంది సమక్షంలో చెప్పారు.
ఆ మొత్తం రెండు రోజుల సదస్సు, బహిరంగ సభ ఏర్పాటును కోఆర్డినేట్ చేసిన కొంత మంది ముఖ్యుల్లో సాయిబాబా గారు ఒకరు. AIPRF ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, సాయిబాబా గారు ఆ బాధ్యతను భుజాలపై వేసుకున్నారు.
నేను జర్నలిస్టుగా ఆ రెండు రోజుల సదస్సు, బహిరంగ సభను కవర్ చేయడానికి వెళ్ళాను. అలా సాయిబాబా గారితో నాకు పరిచయం. అప్పటి నుంచి మా అనుబంధం కొనసాగుతూనే వచ్చింది. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఇక్కడ ప్రస్తుతం పంచుకోలేను.