Suryaa.co.in

Editorial

మంచి ప్రభుత్వం.. మంచి పోలీసులు.. మంచి నిందితులు!

  • పోలీసుల విచారణ భలే భలే

  • బిర్యానీపెట్టి బ్రతిమిలాడే కొత్త ఇంటరాగేషన్

  • జగన్ ఎవరో ఆయన వీరాభిమాని అనిల్‌కు తెలియదట

  • నా హోదా ఆఫీసర్ నన్నెలా విచారిస్తారన్న విజయపాల్

  • మర్చిపోయాం.. గుర్తులేదు.. తెలియదు.. అవన్నీ మీకెందుకంటున్న నందిగం సురేష్, జోగి రమేష్, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, వెంకటరెడ్డి, పానుగంటి చైతన్య అండ్ అదర్స్

  • ఫోన్లు ఇవ్వాలని నిందితులను బతిమిలాడుతున్న పోలీసు సార్లు

  • ఇచ్చేదిలేదు పొమ్మంటున్న నిందితులు

  • ఏపీలో మర్యాదరామన్నలుగా మారుతున్న పోలీసులు

  • మిగిలిన వారి విషయాల్లో మాత్రం లాఠీల ప్రయోగం మామూలే

  • ఫోన్లు సాధీనం చేసుకుని మరీ బడితపూజ

  • వైసీపీ నేతలకు మాత్రం రాచమర్యాదలు

  • ఉడికిపోతున్న కూటమి కార్యకర్తలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

పుల్లారావనే నాయకుడు డజన్లమంది అనుచరులతో తన ఇంటి ని ధ్వంసం చేశాడని సుబ్బారావనే మరోపార్టీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కానిస్టేబుళ్లను పుల్లారావు ఇంటికి పంపి, అతగాడిని ఉన్న ఫళంగా పోలీసుస్టేషన్‌కు తీసుకువెళతారు. అతగాడు ఇంట్లో లేకపోతే ఇంట్లో వాళ్లను స్టేషన్‌కు తీసుకువెళతారు. ఫిర్యాదిదారు ‘పోలీసులకు బాగా కావలసిన’ వాడైతే, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందనుకోండి.

పుల్లారావును స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు ముందుగా అతగాడి చేతిలోని ఫోనును స్వాధీనం చేసుకుంటారు. తర్వాత పుల్లారావు స్థాయిని బట్టి చెక్కబల్లమీదనో, సెల్ పక్కనే కూర్చోబెడతారు. నీతోపాటు ఇంకా ఎంతమంది దాడి చేశారని ముందు మర్యాదరామన్నలా అడుగుతారు. సదరు పుల్లారావు చెప్పాడా సరేసరి. లేకపోతే మెడ వెనక నాలుగుతగిలించి వివరాలు తీసుకుంటారు. రాత్రికి స్టేషన్‌లోనే ఉంచి, బయట హోటళ్ల నుంచి ఫ్రీగా వచ్చే అన్నం పొట్లం అతగాడి చేతికిస్తారు. పొద్దున్నే వచ్చే ఫ్రీటీ ఇచ్చి, తమ స్టైల్లో ఇంటరాగేట్ చేసి, పుల్లారావుతో సంతకం చేయించి, కోర్టుకు అప్పగిస్తారు. మళ్లీ కోర్టు పర్మిషన్‌తో తీసుకువచ్చి, దాడిలో పాల్గొన్న వారు పేర్లు చెప్పించి, వారిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన తర్వాత అందరినీ అరెస్టు చేస్తారు.
– ఇది ఆదిలాబాద్ నుంచి అంబాజీపేట పోలీసుస్టేషన్ వరకూ.. సిక్కోలు నుంచి సికింద్రాబాద్ పోలీసుస్టేషన్లవరకూ కనిపించే సాధారణ దృశ్యాలు.

కానీ ఏపీ పోలీసుస్టేషన్లలో మాత్రం దీనికి భిన్నమైన ట్రీట్‌మెంట్ కనిపిస్తోంది. అసలు నిందితులే పోలీసులను ఇంటరాగేట్ చేస్తున్నారా? పోలీసులు నిందితులను ఇంటరాగేట్ చేస్తున్నారో తెలియని చిత్ర విచిత్ర విచారణ.. పోలీసులను మర్యాదరామన్నల జాబితాలో చే రుస్తోంది. ఎంత మర్యాద రామన్నలంటే.. బిర్యానీపెట్టి సింగిల్ టీ ఇచ్చేంత!

‘‘బాబ్బాబూ.. మీకు పుణ్యం ఉంటుంది. ఆ వివరాలేవో చెప్పి పుణ్యం కట్టుకోండి. చచ్చి మీ కడుపున పుడతాం. అవతల ఆపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మాపై దయతలచి కాస్త మీ ఫోన్లు కూడా ఇస్తే, మా ఎంక్వయిరీ ఏదో మేం చేసుకుంటాం’’ అని టన్నులకద్దీ కన్నీరు కారుస్తూ చేస్తున్న ఏపీ పోలీసుల విచారణ పద్ధతి, ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకూ ఆదర్శం కానుంది. పాపం పోలీసులు అంత కరుణరస్మాత దృశ్యాలు, కర్ణకఠోర ఆర్తనాదాలు ఆవిష్కరిస్తున్నా, ఆ నిందితులు ఏమాత్రం కరిగిపోవడం లేదు. ‘పైగా అయితే ఏంటి’ అని దబాయిస్తున్న వైచిత్రి. మా ఫోన్లు ఇవ్వం. దిక్కున్నచోటకు చెప్పుకోండి అని బేఫర్వాగా చెబుతున్న విషాదం.

అయితే మరి ‘అందరికీ ఇలాంటి ట్రీట్‌మెంట్’ ఇస్తారనుకుంటే, కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఈ ప్రత్యేక విచారణ కేవలం ఐదేళ్ల వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసులు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నాయకులకు.. జగనన్న సర్కారులో అడ్డగోలు అవినీతికి పాల్పడి, తెగబలిసి సంపాదించిన అవినీతి అధికారులకు మాత్రమే మినహాయింపు. మిగిలిన వారిపై లాఠీదెబ్బలు, థర్డ్‌డిగ్రీలు, మోకాళ్ల ప్రదక్షణలన్నీ సేమ్ టు సేమ్!

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ ఆఫీసులపై తెగబడి, ఆటవికంగా దాడిచేసిన వైసీపీ మూకలు-వారికి నాయకత్వం వహించిన నాయకులను అరెస్టు చేసి జైల్లో పెడతారని, కూటమి కార్యకర్తలు బోలెడంత ఆశ పడ్డారు. విపక్షంలో ఉండగా పార్టీ అధినేత చంద్రబాబు-యువనేత లోకేష్-జనసేనాధిపతి పవన్ పాదయాత్రలు, బహిరంగసభలకు చుక్కలు చూపించి, అవరోధాలు కల్పించిన పోలీసులు-వైసీపీ నేతలకు అదేస్థాయిలో జవాబు చెబుతారని ఉత్కంఠతో ఎదురుచూశారు. యువనేత లోకేష్‌కు చుక్కలు చూపించిన నాటి కావలి వైసీపీ ఎమ్మెల్యేను, బట్టలూడ తీసి పరిగెత్తిస్తానని లోకేష్ చేసిన హెచ్చరికలు కావలి తమ్ముళ్ల చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది.

తమ ఇళ్లపై దాడికి తెగబడిన వైసీపీ ముష్కరమూకలను, భూమండలంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి మక్కెలు విరగొట్టి జైల్లో పెడతారని ఆశించారు. ఐదేళ్ల జగన్ జమానాలో పొట్టపగిలేంత తిని, రెండుచేతులా సంపాదించిన అవినీతి అధికారుల ఆస్తులను, ఏసీబీ-సీఐడీ అధికారులు కక్కించి జైల్లో పెట్టిస్తారని ఆశపడ్డారు. ఐదేళ్లు నియోజకవర్గాల్లో తమపై దాష్టీకం చేసి, మానసికంగా-శారీరకంగా-ఆర్ధికంగా దెబ్బతీసి.. చివరకు ఊళ్ల నుంచి పారిపోయేలా చేసిన వైసీపీ నేతల అరాచకాలకు, తమ సర్కారు బదులు తీర్చుకుంటుందని పిచ్చి కార్యకర్తలు పచ్చటి భ్రమల్లో ఉన్నారు. అయితే కార్యకర్తల మనోభావాలకు తగ్గట్లు క్షేత్రస్థాయిలో పనితీరు కనిపిస్తోందా? ఈ ‘మంచి ప్రభుత్వం’ వారి పట్ల ఎలా వ్యవహరిస్తోంది? అనేది ఓసారి పోలీసుస్టేషన్లలోకి వెళ్లి చూద్దాం.

ఆయన పేరు విజయ్‌పాల్. జగన్ జమానాలో సీఐడీలో అడిషనల్ ఎస్పీ. నాడు జగన్‌పై పిడికిలి ఎత్తిన తొలి జెండా అయిన రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి, గుంటూరు సీఐడీ ఆఫీసులో కుళ్లబొడిచి, చావును దగ్గరకెళ్లి చూపించిన వారిలో ఒక ఆఫీసరు. రాజుగారి అరికాళ్లకు కోటింగు ఇస్తుంటే పెద్దసారుకు ఆ దృశ్యాలు వీడియోలూ చూపించి, పెద్దయ్య కళ్లల్లో మెరుపులు చూపినందుకు బహుమతిగా, పాల్‌సారు పదవీకాలాన్ని పొడిగించారు కూడా.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయనపై చర్యలుంటాయని తమ్ముళ్లు భ్రమించారు. ఆ కేసు మూడునెలలయినా పురోగతి లేకపోగా, నత్తలు కూడా నవ్వుకునే దిక్కుమాలిన స్ధితి. అది ఎంతకూ తేలకపోయేసరికి.. బాధితుడైన రఘురామరాజే పోలీసుస్టేషనకు వెళ్లి.. పీఎస్సార్ ఆంజనేయులు, పివి సునీల్, విజయపాల్ అండ్ అదర్స్‌పై ఫిర్యాదు చేశారు. మరి కొండ మహ్మదు దగ్గరకు రాకపోతే.. మహమ్మదే కొండ దగ్గరకు వెళ్లాలి కదా? సర్కారు చేష్టలుడగంతో రాజుగారే దిక్కులేక, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరే అదే కేసులో సునీల్‌కు సర్కారు సంజాయిషీ నోటీసు ఇచ్చిందనుకోండి. దానిపై మంచి ప్రభుత్వం ఎన్నేళ్ల తర్వాత చర్యలు తీసుకుంంటున్నది వేరే విషయం.

ఇక సీఐడీ ఆఫీసులో ఉండి కథ నడిపించిన పాపాల భైరవుడు విజయపాల్ మాత్రం సాటి పోలీసులకు దొరక్కుండా జంపయిపోయి, చాలాకాలం కనిపించకుండా పోయారు. చివరాఖరకు ఢిల్లీలో తేలి, సుప్రీంకోర్టు రక్షణ కవచంతో బెజవాడ చేరారు. పాల్ గారిని అరెస్టు చేయవద్దని చెబుతూనే, సారు విచారణకు సహకరించాలని, సహకరించకపోతే తదుపరి చర్యలు తీసుకోవచ్చన్నది సుప్రీం తీర్పు సారాంశం.

ఇక సారుకు చాయ్ సమోసా ఇచ్చి, పోలీసులు అడిగిన ఏ ఒక్కదానికీ పాలన్న సమాధానం ఇవ్వడం లేదు. అదేమంటే నా క్యాడర్ ఆఫీసరును నాపై విచారణ అధికారిగా నియమించి నన్ను ఇన్‌సల్ట్ చేస్తారా? నాన్సెన్స్. ఐ హర్ట్ అన్నారట. దానితో నాలుక్కరుచుకున్న సర్కారు, ప్రకాశం ఎస్పీ దొరగారిని విచారాణాధికారిగా నియమించింది.
అసలు రిటైరన అధికారి తానింకా ఆఫీసరునే అన్న భ్రమల్లో క్యాడర్ గురించి ప్రశ్నించడమేమిటి? ప్రభుత్వం అదేదో తప్పు చేసినట్లు ఎస్పీని విచారాణాధికారిగా నియమించడమేమిటి? రిటైరైన అధికారికి ఎలాంటి అధికారాలు ఉండవని, ఆయన కూడా సామాన్య నిందితుడే అని.. నాలుగు పీకి చెప్పాల్సిన పోలీసుబాసులు, పాల్ ముందు సాగిలబడటమేమిటో ఎవరికీ అర్ధం కాదు.

పైగా వృత్తిపరంగా నిందితుల నుంచి సెల్‌ఫోన్లు లాగేసుకునే అలవాటున్న పాల్‌గారు, తన ఫోన్ మాత్రం పోలీసులకు ఇవ్వననడం.. దానికి పోలీసులు కూడా సరే మీ ఇష్టం. మీ అభిప్రాయమే మా అభిప్రాయమని, ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో దాసరి నారాయణరావు చెప్పినట్లు.. గమ్మున కూర్చోవడమేమిటో అర్ధం కాని ప్రశ్న. విచారణలో పాల్‌ను ఏమడిగినా.. తెలియదు. గుర్తులేదు. అర్ధంకాలేదు లాంటి సమాధానాలే ఇస్తున్నారట.

ఫోన్ అడిగితే ఫోన్ మీకెందుకు ఇవ్వాలి? కోర్టు అలా చెప్పలేదు కదా? అయినా నాది కొత్త ఫోను. పాత ఫోను పోయింది. ఈ ఫోను ఇచ్చేది లేదు పొమ్మని కసురుకుంటే, పాపం ఖాకీలు నిలువుగుడ్లేసుకుని.. ఆయన చెప్పింది ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్ల మాదిరి, పొందికగా రాసుకుంటున్న వైచిత్రి. సో.. విజయపాల్ నుంచి నిజం కక్కించడం మన పోలీసులకు చేతకాదని తేలింది… కాబట్టి ఆయనే సారథ్యం వహించి రాజుగారికి చుక్కలు చూపించిన టీములోని మెరికల్లాంటి ముసుగువీరుల సభ్యులను తెచ్చి, పాల్‌తో అదే స్టైల్‌లో సమాధానాలు చెప్పించడమే రైటన్నది మాజీ ఐపిఎస్‌ల ఉవాచ. నిజమే. కానీ దానికీ ధైర్యం కావాలి కదా? ‘ఆయనే ఉంటే తెల్లచీర ఎందుక’న్నట్లు.. అసలు అదే ఉంటే ఇవన్నీ ఇక్కడదాకా ఎందుకొస్తాయన్నది తమ్ముళ్ల వ్యంగ్యాస్త్రం. ఎంతైనా ఇది ‘మంచి ప్రభుత్వం’ కదా?!

ఇక టీడీపీ ఆఫీసుపై తెగబడి దాడి చేసిన ఘటనలో ముద్దాయిలయిన దేవినేని అవినాష్, మాజీ ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ యువకిశోరం పానుగంటి చైతన్య..చంద్రబాబు ఇంటిపై దొమ్మీకి దిగిన మాజీ మంత్రి జోగి రమేష్, మైనింగ్ శాఖలో రెండు చేతులా సంపాదించి, జగనన్న అండ్‌కోకు అడ్డగోలుగా సంపాదించి పెట్టిన వెంకటరెడ్డి కూడా.. పోలీసుల విచారణలో విజయపాల్ అన్నయ్యల మాదిరిగా సమాధానిస్తున్నారట. అంతా కూడబలుక్కుని మాట్లాడినట్లు, తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయాం.. మా ఫోన్లు ఇవ్వం.. ఇవన్నీ కొత్త ఫోన్లు.. పాత ఫోన్లు పోనాయి అని బదులిస్తున్నారట. జగనన్న ఆదేశిస్తే అరగంటలో చంద్రబాబు, పవన్‌ను లేపాస్తానన్న జగనన్న వీరాభిమాని, బోరగడ్డ అనిల్‌కయితే అసలు జగన్ ఎవరో తెలియదని చెప్పడం పెద్ద కామెడీ.

ఇక్కడ పోలీసుబుర్రలు కొం నవరతన్ ఆయిల్ దట్టంగా రాసుకుంటే… ‘నిందితులు విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తీసుకోవచ్చు’ అన్న కోర్టు ఆదేశాలను, అమలుచేయవచ్చన్న తెలివొస్తుందన్నది తలపండిన న్యాయవాదుల ఉవాచ. ఆమేరకు విచారణలో తీసిన వీడియోలు కోర్టువారికి ఆధారాలుగా సమర్పిస్తే.. కాగల కార్యం కోర్టువారే తీరుస్తారన్నది వారి సూచన.

ఓకే. అంతా బాగానే ఉంది. మరి వైసీపీ నిందితుల పట్ల కరుణామయుడైన యేసయ్య కూడా ఈర్ష్యపడేంత ఉదారత చూపిస్తున్న పోలీసులు.. సామాన్యుల పట్ల కూడా అంతే కరుణరసాత్మకంగా ఉంటారా అన్నదే బుద్ధిజీవుల ప్రశ్న. నిందితులను పోలీసుస్టేషనుకు ఈడ్చుకొచ్చి, వారి దగ్గరుండే సెల్‌ఫోన్లు గుంజేసుకుని, మోకాలు-మోచేతి కోటింగులిచ్చే పోలీసులు.. మరి ఆ పద్ధతిని వైసీపీ మారాజులకు ఎందుకు అమలుచేయరన్నది అమాయకుల ప్రశ్న. ఒక నందిగం సురేష్.. ఇంకో అవినాష్.. మరో విజయపాల్.. వేరే బోరగడ్డ అనిల్ చెప్పినట్లుగా ఏమో మాకు తెలియదు.. గుర్తులేదు.. మా ఫోన్లు ఇవ్వమని తల అడ్డంగా ఊపితే ఖాకీసార్లు గమ్మునుంటారా? తాటతీయరూ?!

పిల్లి గుడ్డిదయితే ఎలుక ఏదో చూపించిందన్న ముతక సామెత గుర్తుకువచ్చి.. ఈ కథకూ ఆ సామెతకు పోలిక ఉందా అని అడిగితే.. సారీ.. నో కామెంట్! అలాకాకుండా.. కాదూ, కూడదూ జవాబు చెప్పాల్సిందేనని సతాయిస్తే.. ‘అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామ’నే పొలిటీషియన్ల గంభీరమైన సమాధానం చెప్పాల్సివస్తుంది.

LEAVE A RESPONSE