Suryaa.co.in

Andhra Pradesh

హామీలన్నీ ఒకటి తర్వాత మరొకటి అమలు

– ఒకేసారి హామీలన్నీ అమలు చేయడం ఏ మానవ మాతృడికి సాధ్యం కాదు
– గత ప్రభుత్వ హయాంలో ఆ రేంజ్ లో ఆర్థిక విధ్వంసం..అరాచకాలు
– అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దారుణంగా ఛీ కొట్టారు
– టీటీడీ చైర్మన్ గా బి.ఆర్ నాయుడుని నియమించడం అత్యంత ఆనందదాయకం
– బీఆర్ నాయుడు నేతృత్వంలో జీర్ణ దశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాలి
– గ్రామాలకు మళ్లీ శ్రీనివాస కళ్యాణం వేడుకలు తీసుకురావాలి
– టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు, అమరావతి రైతుల పైనున్న కేసులను త్వరలోనే ఎత్తి వేసేందుకు చర్యలను తీసుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒకటి తర్వాత మరొకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయనున్నారని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు తెలిపారు. అన్ని హామీలు ఒకేసారి అమలు చేయడం ఏ మానవ మాత్రుడికి సాధ్యం కాదని, ఆ స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసంతో పాటు, పెద్ద ఎత్తున అరాచకాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేసిన ఆయన, అందుకే ప్రజలు అత్యంత దారుణంగా గత ప్రభుత్వాన్ని ఛీ కొట్టారని తెలిపారు. గతాన్ని మరిచిపోవాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఒకదాని తర్వాత మరొక హామీని అమలు చేస్తామని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మరిచిపోయేది లేదని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఇప్పటికే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం వల్లే ఎన్నికల్లో కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయని, మళ్లీ… మళ్లీ, ప్రజలకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు.

ఎందుకంటే ప్రజలు మరిచిపోయిన దానిని బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ్, తన తండ్రి పాత్రధారి ప్రకాష్ రాజ్ కు గుర్తు చేసినట్లుగా, పదే, పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారని పేర్కొన్నారు. సంపదను సృష్టించడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించడమే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు తెలిపారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు .

ఏడాదిలోగా హామీలన్నీ అమలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే గడిచిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఏడాదిలోగా నెరవేరుస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒక దాని తర్వాత మరొక హామీని అమలు చేస్తున్నారన్నారు . గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న అగచాట్లను ప్రజలు మరిచిపోయి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనిద్దామన్నారు.

చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం ద్వారా ఆయన సంకల్పించినట్లు వచ్చే ఏడాది దీపావళి నాటికి 20 లక్షల ఉద్యోగాలు కాకపోయినా, ఐదు లక్షలకు పై చిలుకు ఉద్యోగాలు రాష్ట్ర యువతకు వస్తాయన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

నిజమైన అభివృద్ధితో కూడిన దీపావళిని వచ్చే ఏడాది జరుపుకుందాం

నిజమైన అభివృద్ధితో కూడిన దీపావళిని మరింత ఘనంగా, వైభవోపేతంగా వచ్చే ఏడాది జరుపుకుందామని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇది నా ఒక్కరి ప్రగాఢ విశ్వాసం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఒక వ్యక్తి పోయినందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నామన్న ఆయన, కూటమి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధిలో అద్భుతమైన పరిపాలన అందిస్తుందన్నారు.

గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నిజమైన దీపావళిని 2024లో జరుపుకుందామని నా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయిందని, ప్రజలు కోరుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఎవరిని ఓడించాలో వారిని ప్రజలు ఓడించారని, ఎవరిని గెలిపించాలో వారిని గెలిపించారన్నారు. ఇప్పుడు పరిపాలనంతా సజావుగా సాగుతోందని, ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

బి ఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం… నాకు ఇచ్చినంత ఆనందంగా ఉంది

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నా మీద రాజ ద్రోహం కేసు మోపి, చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసులో A2 గా టీవీ5 ఉన్నదని గుర్తు చేశారు. బిఆర్ నాయుడు పడిన కష్టాన్ని గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం హర్షనీయమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ, రవ్వంత ఆలస్యమైనా బిఆర్ నాయుడు చేసిన పోరాటానికి తగినట్టుగా ఆయన కు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం సముచితమని తెలిపారు.

బి.ఆర్ నాయుడుకు పదవి ఇవ్వడం అంటే, ఆ పదవి నాకు ఇచ్చినంత సంతోషంగా ఉందన్నారు. అన్యాయంగా మోపబడిన కేసులో నాతో పాటు ఇబ్బందులు పడిన బిఆర్ నాయుడు ను సముచితంగా గౌరవించడం అంటే అది నాకు ఇచ్చిన గౌరవం గానే నేను భావిస్తున్నానని తెలిపారు.

టీటీడీ పాలకమండలి కూర్పు భేష్

టీటీడీ పాలకమండలి కూర్పు భేష్ గా ఉన్నదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 24 మంది సభ్యులలో 12 మందిని దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, తొలిసారిగా ఎన్నారై కి కూడా చోటు కల్పించడం అభినందనీయమన్నారు.

వెంకటేశ్వర స్వామి భక్తులు దేశమంతటా ఉన్నారని టీటీడీ పాలకమండలిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ కు చెందిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి పాలకవర్గంలో చోటు కల్పించారన్నారు.

విశ్వవ్యాప్తమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలిచే వారి కోసం తొలిసారిగా అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడికి కూడా పాలకవర్గంలో చోటు కల్పించడం అభినందనీయమన్నారు. టిటిడి పాలకమండలి ఏర్పాటులో నాలుగు నెలలు ఆలస్యమైనప్పటికీ, ప్రజలంతా హర్షించే విధంగా పాలకవర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని రఘు రామ కృష్ణంరాజు కొనియాడారు.

జీర్ణదశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాలి

టీటీడీ పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో హిందూ మత విశిష్టతను తెలియజేస్తూ, జీర్ణ దశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ధూప దీప నైవేద్యాలు లేక జీర్ణ దశకు చేరుకున్నాయని, వాటిని పునరుద్ధరించే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.

ఒక గ్రామంలో దేవాలయాల కంటే ఇప్పుడు ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు అధికమయ్యాయన్నారు. అధికారికంగా కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న వారి ప్రార్థన మందిరాలు ఎక్కువై , దేవాలయాల సంఖ్య తక్కువ కావడమే కాకుండా, ఉన్నవి కూడా జీర్ణదశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీర్ణ దశకు చేరుకున్న దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, బి ఆర్ నాయుడు నాయకత్వంలోని పాలకవర్గం వాటి పునరుద్ధరణకు ఉదార స్వభావం కలిగిన వారితో కలిసి పని చేయాలన్నారు.

దేవాలయాల పునరుద్ధరణకు టీటీడీ కూడా ఇతోధిక సహాయం అందించాలని కోరారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహించేవారని, గత ఐదేళ్లలో ఈ కార్యక్రమాన్ని అటకెక్కించారని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనూ, అంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారని గుర్తు చేశారు.

మంచి ముహూర్తానికి శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ, సామూహిక వివాహాలను జరిపించాలని సూచించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం నూతన వధూవరులు ఏడడుగులు నడిచే విధంగా మన సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా, ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అలాగే నూతన వధు, వరులకు టీటీడీ చేతుల మీదుగా తాళిబొట్టు, పసుపు కుంకుమలను ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదంగా అందజేయాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.

కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన డబ్బులతోనే టిటిడి కార్యకలాపాలను నిర్వహిస్తోందని, అదేమీ ప్రభుత్వ సొమ్ము కాదన్నారు. టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా నియమించబడ్డ వారు హిందూ, సనాతన ధర్మాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. బి ఆర్ నాయుడు నాయకత్వంలో తోటి పాలకవర్గ సభ్యులంతా హిందూమత విశిష్టతను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.

అలాగే కొండపై భక్తులు ఎదుర్కొనే కష్టాలను తొలగించి, వారు పునర్దర్శనం జరగాలని కోరుకునే విధంగా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు చేపట్టడం ద్వారా, భక్తుల ప్రశంసలను పొందాలన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న శ్రీనివాసుడి వైభవాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు దిగంతాలకు వద్దకు చేరుస్తారని ఆశిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, అమరావతి రైతులపై గత ప్రభుత్వ హయాంలో బనాయించిన అక్రమ కేసులను త్వరలోనే ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న సంక్రాంతి పండగ నాటికి టిడిపి సానుభూతిపరులు, కార్యకర్తలు, అమరావతి రైతులపై కేసులన్నీ ఎత్తివేయబడుతాయన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE