-
హోంమంత్రి అనితపై పవన్ వ్యాఖ్యల కలకలం
-
అనిత హోంమంత్రిగా పనికిరాదన్న సంకేతాలు
-
తాను హోంమంత్రిగా వస్తానన్న పవన్ వ్యాఖ్యలు
-
దళితులను అవమానించారంటూ కొత్త పంచాయతీ
-
అగ్రకుల మంత్రులనూ ఇలాగే నిలదీస్తారా అంటూ ప్రశ్నల వర్షం
-
జీఏడీ, లా అండ్ ఆర్డర్ ఎవరి అధీనంలో ఉంటాయో తెలీదా అంటూ నిలదీత
-
మంత్రి పనితీరుపై డిప్యూటీ సీఎం సర్టిఫై ఎందుకన్న ప్రశ్నలు
-
తాను ఏ పదవి కావాలన్నా తీసుకుంటానన్న సంకేతాలు
-
పవన్ ఆవేదనలో అన్నీ వాస్తవాలే
-
శాంతిభద్రతలపై అందరిలోనూ అదే ఆవేదన
-
మరి పోలీసులకు పోస్టింగులు ఇచ్చిందెవరంటూ ప్రశ్నలు
-
దానిని క్యాబినెట్‌లో ప్రస్తావించాల్సిందంటున్న కూటమి నేతలు
-
వైసీపీకి అస్త్రాలు అందించారన్న వ్యాఖ్యలు
-
హోం మంత్రికి హోంలోనే అసంతృప్తి అంటూ అంబటి ట్వీట్
-
పవన్ వ్యాఖ్యలపై తమ్ముళ్ల అసహనం
-
సోషల్‌మీడియా సైనికుల పోస్టింగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
శాంతిభద్రతలు ఏమాత్రం బాగోలేవు. బయట మమ్మల్ని తిడుతున్నారు. లైంగికదాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేరగాళ్లకు కులమత విబేధాలుండవు.ఇటీవల జరుగుతున్న సంఘటనలకు హోంమంత్రి బాధ్యత వహించాలి. మంత్రి స్థానంలో ఉన్న వారు బాధ్యతగా మెలగాలి. చలనం లేకుండా ఉండే క్రిమినల్స్ రెచ్చిపోతారు. పరిస్థితులు ఇలాగే ఉంటే హోంమంత్రిగా నేనే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదు. నేను డీజీపీ, ఇంటలిజన్స్, ఎస్పీ, కలెక్టర్లకు చెబుతున్నా. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. అప్పుడు యుపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌దాస్‌నవుతా’’నంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన హెచ్చరిక రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పవన్ వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో నెటిజన్లు, ఇటు టీడీపీ సోషల్‌మీడియా సైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే టీటీడీ శ్రేణులు మాత్రం పవన్ వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధిస్తున్నారు. టీడీపీ సోషల్‌మీడియా సైనికు లు మాత్రం పవన్ వ్యాఖ్యల్లో నిజం ఉన్నప్పటికీ.. వాటిని క్యాబినెట్‌లోనో, సీఎంను వ్యక్తిగతంగా కలిసి చెబితే బాగుండేదంటున్నారు. ఈ విధంగా బహిరంగ వ్యాఖ్యల ద్వారా వైసీపీకి అస్త్రం అందించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా పవన్ కల్యాణ్‌కు ఇంకా పాలనపై అవగాహన వచ్చినట్లు లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘లా అండ్ ఆర్డర్, జీఏడీ హోంమంత్రి అధీనంలో ఉండవు. అవి సీఎంల అధీనంలో ఉంటాయి. రేపు పవన్ హోంమంత్రయినా ఆ రెండు శాఖలు సీఎం వద్దే ఉంటాయి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప తాను కానిస్టేబుల్‌ను కూడా ట్రాన్స్‌న్స్‌ఫర్ చేయలేకపోయవాడినంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు.
‘పవన్ కల్యాణ్ హోంమంత్రి అంటే, సినిమాల్లో హోంమంత్రి అనుకుంటున్నారు. పోలీసులు అటు ప్రభుత్వం చెప్పింది వినాలి. ఇటు కోర్టు చీవాట్లు పెట్టకుండా వ్యవహరించాలి. సీఎం యోగిలా వ్యవహరిస్తానంటే దానర్ధం నిందితులు, రౌడీషీటర్లను ఎన్‌కౌంటర్ చేయడమా? వాళ్ల ఇల్లు బుల్డోజర్లతో కూల్చడమా? అలా కూల్చినందుకే కదా సుప్రీంకోర్టు యోగి సర్కారును చీవాట్లు పెట్టింది. సినిమా వేరు. ప్రభు త్వాలు వేరన్న సంగతి పవన్ ఇంకా ఎప్పుడు తెలుసుకుంటార’’ని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలోని సహచర మంత్రి, సరిగా పనిచేయడం లేదంటూ పవన్ చేసిన విమర్శలు.. అటు టీడీపీ శ్రేణులకూ రుచించడం లేదు. పవన్ కల్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అన్న విషయం విస్మరించకూడదంటున్నారు. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి హోదా లేదని గుర్తు చేస్తున్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో ఒక మంత్రేనన్న విషయాన్ని గమనించాలని, మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించాలి తప్ప, మంత్రి సమీక్షిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
రేపు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఖజానాకు ఆదాయం తీసుకురావలసిన మంత్రులు సరిగా పనిచేయడం లేదు కాబట్టి, ఆ శాఖ నేనే తీసుకుంటానంటే అప్పుడు పరిస్థితి ఏమిటంటున్నారు.
మహిళ, అందునా ఒక దళిత మహిళ పనిచేయడం లేదు. నిన్ను తీసేసి నేను ఆ శాఖ మంత్రినవుతానంటూ పవన్ చేసిన ముందుచూపులేనివ్యాఖ్తలు, మహిళలు-దళిత వర్గాల్లో వ్యతిరేకత పెంచేవేనని, అవి వైసీపీకి అస్త్రాలు అందించడమేనని టీడీపీ సీనియర్లు చెతబుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘ హోం మంత్రికి హోం(కూటమి)లోనే అసంతృప్తి’ అంటూ చేసిన ట్వీట్‌ను గుర్తు చేస్తున్నారు. ఇక రేపటి నుంచి వైసీపీ దళిత, మహిళా నేతలు పవన్ వ్యాఖ్యలు పట్టుకుని, నానా రచ్చ చేయడం ఖాయమంటున్నారు.
‘రాజకీయాల్లో అనుభవం ముఖ్యం. అనుభవంలోకి వస్తేగానీ ఏమీ అర్ధం కావు. పవన్ ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు తాను కూటమిలో ఏ పదవి కావాలంటే ఆ పదవి తీసుకుంటానన్న సంకేతాలు పంపించాయి. ఇక తాను కూడా సీఎంగారి మాదిరిగా మంత్రులపై పెత్తనం చేస్తానన్న మరో ప్రమాదకర సేం తాలు పంపించాయి. ప్రధానంగా దళితమహిళ హోంమంత్రిగా పనికిరాదన్న వివాదాస్పద అభిప్రాయాన్ని జనంలోకి పంపించాయి. పవన్‌లో ఫైర్ ఉన్న మాట నిజమే. ఆయనలో ఏ స్వార్ధం లేని మాట కూడా నిజమే. కానీ రాజకీయాల్లో ఒక చిన్న మాట కొంపలంటుకునే లా చేస్తాయి. ఆ అనుభవం లేకనే ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. స్వయంగా డిప్యూటీ సీఎం.. డీజీపీ, ఎస్పీ, ఇంటలిజన్స్, కలెక్టర్లను హెచ్చరిస్తే రేపు విపక్ష మైన వైసీపీ కూడా అవే విమర్శలు చేస్తే వారికి ఎలా జవాబు చెబుతాం’’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పోలీసుల పనితీరును విమర్శిస్తున్న పవన్.. అసలు వారికి పోస్టింగులు ఎవరు ఇచ్చారో తెలుసుకోవడం మంచిదంటూ, మరికొందరు సోషల్‌మీడియాలో చురకలు అంటిస్తున్నారు. టీడీపీ,జనసేన నేతలపై అక్రమకేసులు పెట్టిన పోలీసులు, చంద్రబాబు-పవన్-లోకేష్ సహా మాజీ మంత్రులు, సీనియర్ నాయకులను వేధించిన డీఎస్పీ, ఐపిఎస్ అధికారులకు మళ్లీ మంచి పోస్టింగులు ఎలా ఇచ్చారని ఇదే పవన్ కల్యాణ్ ఏనాడైనా ప్రశ్నించారా అని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయినా ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ పోస్టింగులన్నీ జల్లెడ పట్టి వడపోసి చేసినవే కదా? ఎమ్మెల్యేల సిఫార్సులు పక్కనబెట్టి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేసి పోస్టింగులు ఇచ్చారు కదా? అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నేరగాళ్లు రెచ్చిపోతున్నారంటే అది ఎవరి వైఫల్యం? మీరే పోస్టింగులు ఇచ్చి మీరే విమర్శిస్తే ఎలా? మీ మంత్రి దుర్గేష్ చుట్టూ ఏ పార్టీ ఉంటారో ముందు తె లుసుకోండి. ద్వారంపూడి ఇంట్లో మనిషికి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు సిఫార్సు చేశారో తెలుసుకోండి’ అని గోదావరి జిల్లాలకు చెందిన, టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వల్ల బాబుపై పవన్ తిరుగుబాటు అంటూ..సోషల్‌మీడియా, వైసీపీ సోషల్‌మీడియా అప్పుడే కొత్త కథలు అల్లడం ప్రారంభించిందని, టీడీపీ నేతలు చెబుతున్నారు. పవన్ కూటమిలోనే ఉంటారన్న విషయం తెలిసినప్పటికీ, ఆయన చేసే వ్యాఖ్యలు అలాంటి లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్‌వి అసంతృప్తి వ్యాఖ్యలేనని, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా వాటిని అలాగే అర్ధం చేసుకుంటారని విశ్లేషిస్తున్నారు. ఇకనైనా పవన్ బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయాలని టీడీపీ సీనియర్లు సూచిస్తున్నారు.