Suryaa.co.in

Andhra Pradesh

హోం మంత్రి సరే.. మీరు చేసిందేంటి పవన్‌ ?

– పవన్‌కళ్యాణ్‌కు, ప్రభుత్వ వైఫల్యంలో భాగస్వామ్యం లేదా
– తన పరిధిలో జరిగిన దుర్ఘటనలపై ఆయనేం చేశారో చెప్పాలి
– వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు ఏమైంది?
– ఈ వైఫల్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌ కూడా బాధ్యులే
– పోలీసులు, హోం మంత్రి గురక పెట్టి నిద్రపోతున్నారా?
– మరో డైవర్షన్‌ పాలిటిక్స్‌లో పవన్‌కళ్యాణ్‌
– రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు
– మహిళలకు కొరడిన రక్షణ. రోజూ అత్యాచారాలు
– హోం మంత్రి విఫలమయ్యారని అందరికీ తెలిసిన విషయమే
– వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌ టోటల్‌గా ఫెయిల్‌ అయిందని, శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, విధి నిర్వహణలో హోం మంత్రి ఘోరంగా విఫలమయ్యారని. మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, వారిపై అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌ అయ్యారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అరెస్టులను, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. రెండింటినీ కలుపుతూ పవన్‌కళ్యాణ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నారని ఆక్షేపించారు. ఆ దిశలోనే ఆయన, హోం మంత్రిపై వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రభుత్వంలో కీలకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు, ప్రభుత్వ వైఫల్యంలో భాగస్వామ్యం లేదా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. హోం మంత్రి విఫలమయ్యారని రాష్ట్రమంతా అనుకుంటున్న నేపథ్యంలో.. మరి మహిళలకు అన్యాయం జరుగుతుంటే తానేం చేస్తున్నారని.. పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు.

‘మీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో యువతికి మత్తుమందిచ్చి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించారా?. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులు మిమ్మల్ని కలిసి న్యాయం చేయమని వేడుకుందామని అనుకుంటే, కనీసం కలిసే అవకాశం ఎందుకివ్వలేదు?. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను లైంగికంగా వేధిస్తే, ఆమె ఆత్మహత్యా యత్నం చేస్తే, మీరు కనీసం పరామర్శించారా?’ అని డిప్యూటీ సీఎంను వరుదు కళ్యాణి నిలదీశారు.

రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన పవన్‌కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక, వారిలో ఎంత మందిని వెతికి తీసుకొచ్చారని.. అలాగే వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు ఏమైందని ఆమె ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు భద్రతతో పాటు, నిద్ర కూడా కరవైందన్న వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు.. పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలీసులు, హోం మంత్రి గురక పెట్టి నిద్రపోతున్నారా? అని దుయ్యబట్టారు.

మహిళల భద్రతంటే ఈ ప్రభుత్వానికి చులకనభావం ఉందని ఆమె తేల్చి చెప్పారు. 5 నెలల కూటమి పాలనలో సీఎం సొంత జిల్లాలో మూడు అత్యాచారాలు, నారా లోకేశ్‌ సొంత నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలో 3 అత్యాచారాలు జరగడంతో పాటు, రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతిరోజూ అఘాయిత్యాలు, మహిళలు బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని గుర్తు చేశారు.

గతంలో మహిళలకు అండగా ఉన్న దిశ లాంటి వ్యవస్థ ఉండుంటే ఇలాంటి అకృత్యాలు జరిగేవి కాదన్న ఎమ్మెల్సీ, ఇప్పటికైనా దిశ యాప్‌ పునరుద్ధరించడంతో పాటు, కేంద్రం దిశ చట్టాన్ని ఆమోదించేలా చూడాలని కోరారు.

LEAVE A RESPONSE