Suryaa.co.in

Andhra Pradesh

‘కూటమి’ లో కుమ్ములాటల్లేవు

– చిన్న భేదాభిప్రాయాలు మాత్రమే…
– కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోతాయ్‌
-మంత్రి పొంగూరు నారాయణ

కాకినాడ: కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గా బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. .. మొదటిసారి జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడ మీడియాతో ఏమన్నారంటే.. ఏ పార్టీలో అయినా చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

సీఎం ఆదేశాల ప్రకారం మూడు పార్టీల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలపై ఇన్‌ఛార్జి మంత్రిగా ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జిలు తమ నియోజకవర్గం అభివృద్ధిపైనే ఎక్కువగా చర్చించారు.

జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారు. 10 లక్షల కోట్లు అప్పుచేసి జగన్ వెళ్ళిపోయారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడేసుకున్నారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారు. అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం. అమరావతిపై 2014 లోనే అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం.

ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం కూడా పార్లమెంట్ లో సమాధానం ఇచ్చింది. ప్రతినెలా మూడుసార్లు ఇన్‌ఛార్జి మంత్రిగా కాకినాడ జిల్లాకు వస్తాను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. ఎన్నికలు పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు త్వరలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించాను. కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు.

LEAVE A RESPONSE