Suryaa.co.in

Editorial

క్వారీలో దర్జాగా మంత్రి గారి కబ్జా

– మాజీ మంత్రి క్వారీ సరిహద్దు స్వాధీనం
– ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే తవ్వకాలు ప్రారంభం
– ఇప్పటిదాకా 4 వేల మీటర్ల తవ్వకాలు
– 15 కోట్ల రూపాయలపైనే ఆదాయం
– జగన్ జమానాలో ఆ ఎమ్మెల్యే ఆర్ధికంగా నష్టపోయారన్న ప్రచారం
– ఆ సానుభూతితోనే కూటమిలో మంత్రి పదవి
– కానీ అప్పట్లో ఆయన మూసుకున్నవి రెండు.. ప్రభుత్వం మూసింది ఒకే ఒకటి
– మిగిలిన వాటిని నాటి వైసీపీలో ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీకి ఇచ్చి వ్యాపారం చేసుకున్న మేధస్సు
– పవన్, బాబు కుటుంబాన్ని బూతులు తిట్టిన ఇద్దరు మంత్రులకు క్వారీ ఇచ్చిన వైనం
– దీనిపై అప్పట్లో జగన్ దగ్గర బాలినేని, కృష్ణాజిల్లా మంత్రి పంచాయతీ
– తాను 20 కోట్లకు ఆ క్వారీని కొనుగోలు చేసినట్లు జగన్‌ను నమ్మించిన ఆ మంత్రి
– ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మళ్లీ తానే వ్యాపారాలు చేసుకుంటున్న నాటి ‘ఎమ్మెల్యే మంత్రి’
– మరి వైసీపీ మాజీ మంత్రులు వాటిని ఈ మంత్రిగారికే మళ్లీ ఎందుకు వదిలేసినట్లు?
– ఇంకా మంత్రిగారి స్వాధీనంలోనే ప్రకాశం జిల్లా మాజీ మంత్రి క్వారీ
– ఉమ్మడి ప్రకాశంలో క్వారీల కలకలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘కక్ష సాధింపు మా సిద్ధాంతం కాదు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షలు పడేలా చూస్తాం. జగన్ మాదిరిగా వ్యాపారులపై వేధింపులు ఉండవు. ఎవరైనా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చ’’ని, సీఎం చంద్రబాబునాయుడు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.

అన్నట్లుగానే ఈ ఐదునెలల కాలంలో ఆయన దానినే అమలుచేస్తున్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు కనిపించడం లేదు. కానీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఫలితాలు వెలువడిన రెండోరోజు నుంచే ప్రత్యర్ధులపై వేట మొదలయింది. వారి వ్యాపారాలు కబళించే యత్నాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ క్వారీల్లో గత ఐదు నెలల నుంచి అదే జరుగుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడున్న రాళ్లు బంగారం కంటే ఎక్కువ. రాయిని గ్రానైట్‌గా మలచి దేశ విదేశాలకు ఎగుమతి చేసే, కోటీశ్వరుల వ్యాపార కేంద్రం ఇది. ఇక్కడ అన్ని పార్టీల నాయకులకూ క్వారీలున్నాయి. ఒక పార్టీ అధికారంలో ఉంటే, మరో పార్టీకి చెందిన వ్యాపారుల క్వారీలు స్వాధీనం చేసుకోవడం, గత ఇరవై ఏళ్ల నుంచి మొదలైన కొత్త సంస్కృతి. మళ్లీ అధికారం పోతే.. అధికారంలోకి వచ్చిన పార్టీ వ్యాపారులు, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే పద్ధతి అమలవుతోంది. ఇదో మైనింగ్ టామ్ అండ్ జెర్రీ గేమ్!

అయితే రాజకీయాల్లో ఉన్న కొందరు తెలివైన వ్యాపారులు.. వేరే పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీలోని తమ మిత్రులకే తమ క్వారీలు ఇచ్చి, తమ క్వారీలు కాపాడుకునే కొత్త ఎత్తుగడ కొనసాగుతోంది. అంటే పేరు,లీజు, లైసెన్సులన్నీ అధికార పార్టీలోని తమ మిత్రుల పేరుకు బదిలీ చేసి, తమ వ్యాపారం కాపాడుకుంటారన్నమాట.

కానీ ఆ వ్యాపారులు ఉన్న పార్టీ నాయకత్వం దృష్టిలో మాత్రం.. సదరు వ్యాపారి అధికార పార్టీ వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయారన్న సానుభూతి పొందుతారు. అధికార పార్టీ వేధింపులకు భయపడి, క్వారీలు మూసుకున్నారన్న జాలి. అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా నిలబడ్డారన్న ప్రశంసలు అందుకుంటారు. ఇది ఇప్పటి తెలివైన వ్యాపారుల ‘మైనింగ్ గేమ్’.

ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.. జరుగుతోంది. జగన్ జమానాలో ఓ టీడీపీ ఎమ్మెల్యేకు బల్లికురవలో ఉన్న క్వారీలను.. వైసీపీ ప్రభుత్వం బలవంతంగా మూసివేయించిందని, మైనింగ్ అధికారులతో దాడులు చేయించిందని, భారీ పెనాల్టీలు వస్తే.. సదరు ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి తన వ్యాపారం కాపాడుకున్నారన్న ప్రచారం జరిగింది.

దానితో ఆయన ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు నష్టపోయారన్న సానుభూతి సొంత పార్టీలో సంపాదించుకున్నారు. జిల్లాలోని రెండు ప్రధాన దినపత్రికలు కూడా ఆ టీడీపీ ఎమ్మెల్యేకు శ్రమదానం చేశారట. ఓయువ నేత ఆఫీసులో పనిచేసే ఉద్యోగి కూడా ఆ ఎమ్మెల్యేకు రక్షక కవచంలా ఉన్నారన్న ప్రచారం లే కపోలేదు.

జగన్ సర్కారు ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడినప్పటికీ, ఆర్ధికంగా నష్టపోయిన సదరు ఎమ్మెల్యే..జగన్‌కు ధైర్యంగా ఎదురు నిలబడ్డారన్న పేరు కూడా, సొంత పార్టీలో దక్కింది.. దక్కేలా చేశారు! తర్వాత ఆయనకు ఆ సానుభూతే మంత్రి పదవి వచ్చేలా చేసింది. కానీ ఇదంతా‘ మైనింగ్ రాయి’కి ఒకవైపు మాత్రమే.

రెండోవైపు ‘మైనింగ్ రాయి కథ’ మరొకటన్నది ఆ జిల్లా పార్టీ వాదన. అదేమిటంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, సదరు టీడీపీ ఎమ్మెల్యేపై కక్ష కట్టిన వైసీపీ సర్కారు, ఆయన మైనింగ్ వ్యాపారాలపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఆయనకు చీమకుర్తి, బల్లికురవతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆరేడు క్వారీలలో, ఒక దానిని జగన్ ప్రభుత్వం మూయించింది. మరొక రెండు క్వారీలను ఆయనే స్వయంగా మూసుకున్నారు. మరి మిగిలిన క్వారీలు ఏమయ్యాయంటే.. నాటి జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, వైసీపీ ఎంపీకి స్వయంగా ఆ ఎమ్మెల్యేనే ఇచ్చేయడం ఆశ్చర్యం.

అందులో ఒకరు పార్టీ మారి, ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంపీగా కొనసాగుతుండగా.. మరొకరు వైసీపీ జమానాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులను, సభలో సైతం దుర్భాషలాడిన మాజీ మంత్రి. బాబును అసెంబ్లీలో, బయటా తిట్టాలంటే జగన్ ఆయననే సంధించేవారు. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఆ మాజీమంత్రిపై, తాజాగా ఓ కేసు కూడా నమొదయింది. ఆయనను ఇంతవరకూ అరెస్టు చేయలేదన్నది టీడీపీ క్యాడర్ ప్రధాన అసంతృప్తి. అది వేరే విషయం.

ఇంకొకరు జనసేన దళపతి పవన్‌కల్యాణ్‌ను ‘‘. మేము మేమూ కాపు నాకొడుకులం. లక్ష అనుకొంటాం. అసలు నువ్వు కాపువేనా? కమ్మోళ్లను సీఎం చేసేందుకు కాపులను టీడీపీకి తాకట్టు పెడుతున్నావ’’ంటూ పవన్‌పై చెలరేగిన ఓ మాజీమంత్రి. విచిత్రంగా ఈ ముగ్గురూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వారే.

తన బల్లికురవ క్వారీలను టీడీపీ ఎమ్మెల్యే అప్పుడు ఆ ముగ్గురికే అప్పగించి, వ్యాపారం కాపాడుకున్నారు. దానితో నాడు మైనింగ్ వ్యాపారమంతా వైసీపీ నేతల పేరుతోనే జరిగిపోయాయన్నమాట. అంటే అందులో టీడీపీ ఎమ్మెల్యే పేరు తెరపైకి కనిపించదు. అయితే దీనిపై అప్పట్లో జగన్ తాడేపల్లిలో పంచాయతీ పెట్టారట. ఆ ఎమ్మెల్యే క్వారీలను మూయించాలని ఆదేశిస్తే.. దానిని తాను 20 కోట్లకు కొనుగోలు చేశానని, ఇప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యేకి దానితో ఎలాంటి సంబంధం లేదని.. నాటి కృష్ణా జిల్లా వైసీపీ మంత్రి జగన్‌కు వివరణ ఇచ్చారట.

ఆ పంచాయతీలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నట్లు సమాచారం. అప్పటికే ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో, జగన్ దాని సంగతి తర్వాత చూద్దామన్నారట. ఆ విధంగా తన క్వారీలను తన మిత్రులకే ఇవ్వడం ద్వారా, వ్యాపారం ఆగకుండా చూసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు.

ఇదిలాఉండగా.. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన జడ్పీ మాజీ చైర్మన్, గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసి-త ర్వాత వైసీపీలో చేరి- ఎన్నికల తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన ఓ మాజీమంత్రికి, బల్లికురవలో పక్కపక్కనే వరసగా క్వారీలున్నాయి. ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి క్వారీ సరిహద్దుపై కన్నేసిన టీడీపీ ఎమ్మెల్యే.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండోరోజు నుంచి దానిపై ఆక్రమణ ప్రారంభించారట. ఆ తర్వాత సదరు ఎమ్మెల్యేకు మంత్రయ్యే అవకాశం వచ్చింది.

ఆ ప్రకారంగా ఆ మాజీ మంత్రికి చెందిన రెండున్నర హెక్టార్లలో, ఇప్పటిదాకా సుమారు 4 వేల మీటర్ల రాయిని తవ్వినట్లు ప్రచారం జరుగుతోంది. దీనివిలువ 15 కోట్ల రూపాయలు ఉండవచ్చన్నది ఒక అంచనా. బాధితుడైన ఆ మాజీ మంత్రి త్వరలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అది వేరే కథ.

అంతా బాగానే ఉన్నా.. జగన్ జమానాలో తన క్వారీలను వైసీపీ మంత్రులు, ఎంపీకి ఇచ్చేసి క్వారీలు కాపాడుకున్న టీడీపీ ఎమ్మెల్యే కమ్ నేటి మంత్రికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ పాత క్వారీలు ఎలా తిరిగి దక్కాయన్నదే ఆశ్చర్యం. అంటే.. గురిజేపల్లిలోని బ్లాక్‌పెరల్ క్వారీ తీసుకున్న గుడివాడ వైసీపీ ప్రముఖుడు…మల్లాయిపాలెం కొండ-నేలపై ఉన్న క్వారీ తీసుకున్న బందరు వైసీపీ ‘సురక్ష’ ప్రముఖుడు .. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మళ్లీ అదే టీడీపీ ఎమ్మెల్యేకి, వెనక్కి ఎలా ఇచ్చారన్నది మరో ఆశ్చర్యం.

ఇంకో ఆశ్చర్యమేమిటంటే.. జగన్ ఐదేళ్ల జమానాలో వీటిపై ఒక్క దాడి జరగకుండా, నిక్షేపంగా వ్యాపారం సాగడం. ఇక కడపరెడ్డిగారి పేరుతో ఉన్న బినామీ కంపెనీపై కూడా ఈగ కూడా వాలలేదన్నది, టీడీపీ వర్గాలలో వినిపిస్తున్న చర్చ. అప్పట్లో మల్లాయిపాలెం క్వారీని బాలినేనితో పాటు, నాటి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి-ప్రస్తుతం టీడీపీలో చేరిన ఓ సీనియర్ నేత అడ్డుకున్నారట. అయితే అప్పట్లో జగన్‌కు వ్యాపారాలతోపాటు, ఢిల్లీ వ్యవహారాల్లో సహకరించే.. నాటి-నేటి ఉమ్మడి కృష్ణాజిల్లా కూటమి ఎంపీ అడ్డు చక్రం వేసి, కడప రెడ్డిగారి పేరుతో ఉన్న క్వారీని, నిక్షేపంలా నడిచేలా సహకరించారన్నది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.అసలు వైసీపీకి చెందిన వ్యాపారులు ఇప్పటికీ నిర్భయంగా అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారట.

LEAVE A RESPONSE