Suryaa.co.in

Telangana

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ జారీ రద్దు

– 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్
– గత కేసీఆర్ సర్కారు నిర్ణయంపై కోర్టుకెక్కిన నిరుద్యోగులు

హైదరాబాద్: డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారంటూ, పలువురు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు (ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు ఉన్నారు.

సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలో 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నిషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అపీలుకు వెళుతుందో లేదో చూడాలి.

LEAVE A RESPONSE