– రోజుల తరబడి అత్యాచారం చేసిన సహ విద్యార్ధులు
– అయినా ఆగని వేధింపులు
– దానితో ఆత్మహత్యాయత్నం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
– నిందితుల అరెస్ట్
-విశాఖలో మరో కీచకపర్వం
విశాఖపట్నం: విశాఖలో మరో దారుణం చోటుచేసుకుంది. లా చదువుతున్న ఓ విద్యార్థినిపై పలువురు సహ విద్యార్ధులు కొన్ని రోజుల నుంచి తరచూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఇది. బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి అయిన వంశీతో ఆమె స్నేహం చేసింది. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన వంశీ, గత ఆగస్ట్ 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత అదే నెల 13న డాబా గార్డెన్స్ లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి, మరోసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.
రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ కూడా వారి కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు.
దీంతో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఇది గమనించిన బాధితురాలి తండ్రి ఆమెను అడ్డుకుని ఆరా తీయడంతో కన్నీటిపర్యంతమైన ఆ విద్యార్ధిని, తనపై వారు చేస్తున్న అత్యాచారాన్ని తండ్రికి వివరించింది. తండ్రి వెంటనే విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. తాజా ఘటన విశాఖలో చర్చనీయాంశమయింది.