– పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్
ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్.
జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీ(యూ), ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం జేఎమ్ఎమ్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది.
ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్‌లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. బీజేపీ 42 నుండి 48 స్థానాలు, ఏజేఎస్‌యూ 2 నుండి 5 స్థానాలు, కాంగ్రెస్ 8 నుండి 14, జేఎమ్ఎమ్16 నుండి 23 స్థానాలు, ఇతరులు 6 నుండి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం.. బీజేపీ 42.1 శాతం, ఏజేఎస్‌యూ 4.6 శాతం, కాంగ్రెస్ 16.2 శాతం, జేఎమ్ఎమ్ 20.8 శాతం, ఇతరులు 16.3 శాతం ఓట్లు పొందనున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో డివిజన్ల వారిగా పార్టీల బలాబలాలను అంచనా వేస్తే… కోల్హాన్ డివిజన్లో 2019 ఎన్నికల్లో జేఎమ్ఎమ్ ఆధిక్యత సాధించగా, ప్రస్తుతం బీజేపీ మెరుగ్గా కనిపిస్తున్నా ‘ఇండియా’ కూటమి ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. బొగ్గు మైనింగ్ అధికంగా ఉండే నార్త్ చోటా నాగపూర్ లో ఎస్సీ జనాభా అధికం.
ఇక్కడ వామపక్షాలకు కొంత బలమున్నా, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సానుకూలంగా ఉంది. కుర్మి సామాజికవర్గం ఇక్కడ అధికంగా ఉండడంతో ఏజేఎస్‌యూ కూడా బలంగానే ఉంది. సీపీఐఎమ్ఎల్ ఇక్కడ కీలకం కావడంతో, ఈ ప్రాంతంలో రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంది. సౌత్ చోటా నాగపూర్ రీజియన్‌లో రాజధాని రాంచీ కీలకం. ముండా, ఓరన్‌లో ఎస్టీలు, లోహర్గడ్లో ముస్లింలు, సిండేగాలో క్రిస్టియన్ల ప్రభావం ఉంది.
రాంచీ, గుమ్లా జిల్లాలో బీజేపీకి సానుకూలంగా ఉండగా, ఈ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో పోటాపోటీగా ఉంది. ఓబీసీలు అధికంగా ఉండే పాలాం ప్రాంతంలో గతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు పొందింది. ఈ సారి కూడా అదే పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయి. సంతాల పర్గాన ప్రాంతంలో గతంలో బీజేపీకి అనుకూల ఫలితాలు రాలేదు. ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఎస్టీ సామాజికవర్గంలో సంతాల వర్గం కీలకం. సీఎం హేమంత్ సోరెన్, బీజేపీ సీనియర్ నేత బాబులాల్ మరాండీ సంతాల వర్గానికే చెందిన వారు. ప్రస్తుతం ఈ సామాజికవర్గంలో బీజేపీతో పోలిస్తే జేఎమ్ఎమ్కు కొంత అనుకూలంగా ఉంది. ముండా సామాజికవర్గం బీజేపీ వైపు ఉండగా, ఓరన్ సామాజికవర్గం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయి ఉంది.
హో సామాజికవర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్సీ సామాజికవర్గంలో పాశ్వాన్, బోక్తా వర్గాలు బీజేపీకి అనుకూలంగా ఉండగా, చమర్ వర్గం ‘ఇండియా’ కూటమి వైపు ఉంది. ఓబీసీలో కుర్మి సామాజికవర్గం కీలకం. గతంలో వీరు జేఎమ్ఎమ్కు అనుకూలంగా ఉండగా, ప్రస్తుతం ఏజేఎస్‌యూ వైపు ఉన్నారు. మరో సామాజికవర్గం బనియా బీజేపీ వైపు ఉన్నారు.
యాదవ్‌లు ఎన్డీఏ, ‘ఇండియా’ కూటమి మధ్య చీలి ఉన్నారు. 14 శాతంపైగా ఉన్న ముస్లింలు, 4 శాతంపైగా ఉన్న క్రిస్టియన్లు ‘ఇండియా’ కూటమికి అనుకూలంగా ఉన్నారు. అగ్రవర్ణాల్లో బ్రాహ్మిన్స్, రాజ్‌పుత్‌లు, కాయస్తులు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు.
‘ఇండియా’ కూటమి ప్రచారాంశాలు :
ఎన్నికల ముందే జేఎమ్ఎమ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం తరఫున పలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ‘మాయి యోజన’ పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇప్పటికే వారి ఖాతాల్లో చేరాయి. మరోసారి అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రూ.2500కు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు ఆదివాసీలను ఆకట్టుకునేందుకు వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ జేఎమ్ఎమ్ ప్రభుత్వం ‘సర్నా’ కోడ్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. విద్యుత్‌కు సంబంధించిన పాత బకాయిలను రద్దు చేయడంతో పాటు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టారు. ఈ పథకాలు ‘ఇండియా’ కూటమికి అనుకూలంగా మారాయి.
ఎన్డీఏ కూటమి ప్రచారాంశాలు :
బీజేపీ బంగ్లాదేశీయుల అక్రమ వలసలను ప్రధాన ప్రచారాంశంగా ఎత్తుకుంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూ, ఆదివాసీల ఓట్లను ఆకట్టుకునేందుకు ‘బాటేంగే తో కాటేంగే’ నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కొన్ని చోట్ల ఈ ప్రచారం బీజేపీకి అనుకూలంగా కూడా మారింది. యూనిఫామ్ సివిల్ కోడ్ తో పాటు ఆదివాసీల సంస్కృతి, గుర్తింపు కాపాడుతామని ఎన్డీఏ ప్రచారం చేసింది.
రాష్ట్రంలో మహిళలకు ‘గోగో దీదీ యోజన’ పథకం కింద రూ.2100 అందజేస్తామని, దీపావళి, రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 2.1 మిలియన్ల కుటుంబాలకు నీటి కనెక్షన్లు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కూటమిలో సీట్ల పంపంకంతో పాటు అభ్యర్థుల ప్రకటన, పోల్ మేనేజ్మెంట్లో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ‘ఇండియా’ కంటే ఎన్డీఏకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ జాతీయ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధానంగా అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ జార్ఖండ్‌లో అన్నీ తానై వ్యవహరించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ 8120 శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. సంస్థ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ రీసెర్చర్లు జి.మురళీ కృష్ణ, ప్రదీప్, ఐ.వీ.మురళీ కృష్ణ శర్మ ఎగ్జిట్ పోల్ రిపోర్టును రూపొందించారు.