– ధరలు తగ్గించిన మూడు పెద్ద కంపెనీలు
– మాన్షన్హౌస్, రాయల్చాలెంజ్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు
– జగన్ జమానాలో కొండెక్కిన వాటి ధరలు
– ఇప్పుడు గణనీయంగా ధర తగ్గించిన ఆ కంపెనీలు
– మందుబాబులకు ఖుషీ
అమరావతి: మందుబాబులకు ఖుషీఖబర్. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే మాన్షన్హౌస్, రాయల్చాలెంజ్, యాంటిక్విటీ విస్కీ ధరలు గణనీయంగా త గ్గనున్నాయి. ఆ మేరకు ఆ మూడు కంపెనీలు తమ కంపెనీ ధరలు తగ్గించేందుకు ముందుకొచ్చాయి. ఆరకంగా జగన్ జమానాలో ఆకాశంలో ఉన్న మందు ధరలను కూటమి సర్కారు నేలకు తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు.
వీటి ధరలు తగ్గాయి..
* మాన్షన్ హౌస్(Mansion House) క్వార్టర్ ధర 2019లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.110 ఉండగా వైఎస్సార్సీపీ హయంలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది.
* రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి, ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
* యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.
అన్ని బ్రాండ్లపై కొత్త ధరలు ..
కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చించనుంది.
అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
కమిటీ నిర్ణయించక ముందే కొన్ని మద్యం కంపెనీలు రేట్లు తగ్గించుకుంటున్నాయి.
మరో 2 ప్రముఖ మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో తగ్గించనున్నాయి.
మద్యం ధరల సవరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో అన్ని కంపెనీలతో ధరల సవరణపై ఆ కమిటీ చర్చించనుంది.
బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు వేరే రాష్ట్రాల్లో అమ్ముతున్న ధరలను పరిశీలించనుంది.