Suryaa.co.in

Editorial

గ్రానైట్.. గ్రావెల్ దందాకు ఆయనే సారధి!

  • బల్లికురువ, సంతమాగులూరు మండలాల నుంచి గ్రానైట్ తరలింపు

  • నెలరోజుల నుంచి మొదలైన దందా

  • ధర్మవరం పెద్దచెరువు నుంచి గ్రావెల్ తరలింపు

  • టిప్పర్లు పెట్టి మరీ తోలేస్తున్నారు

  • అధికారం అండతో చెలరేగుతున్న అక్రమార్కులు

  • ఒక్కో గ్రానైట్ పలకల లారీకి 32 వేలు వసూలు

  • అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల నుంచి రోజుకు 110 గ్రానైట్ పలకల లారీలు తరలింపు

  • చెక్‌పోస్టు నిర్వహణ అధీకృత సంస్థకు 16 వేలు, మిగిలిన 16 వేలు నేతల జేబుల్లోకి

  • ఒక్కో లారీకి 25 వేలు ఆదాయం

  • అద్దంకి, పర్చూరు నేతల కనుసన్నల్లో గ్రానైట్- గ్రావెల్ దందా

  • గ్రానైట్ జీరో దందాతో నెలకు 23 కోట్లు ఖజానాకు కన్నం

  • కూటమి ప్రతిష్ఠకు టీడీపీ అగ్రనేతల తూట్లు

  • వైసీపీని మించి తమ్ముళ్ల దందా?

  • లారీలకు రేట్లు పెంచేసిన టీడీపీ బడా నేతలు

  • జగన్ జమానాలో లారీకి 25 వేలు

  • ఇప్పుడు లారీకి 32 వేలు వసూలు

  • రెవిన్యూ, మైనింగ్, పోలీసులకూ వాటా

  • కళ్లుమూసుకున్న విజిలెన్స్, ఇంటలిజన్స్

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ ఎమ్మెల్యేలు, నాయకులు అక్రమ వ్యాపారాలు చేయవద్దు. ఇసుక అమ్మకాల్లో జోక్యం చేసుకోవద్దు. నాకు ప్రజాప్రయోజనాలే ముఖ్యం. గీతదాటే వారిని సహించలేది లేదు. నేను ఇప్పుడు 1995 ముఖ్యమంత్రిని. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని క్షమించేదిలేదు. మీరు ఏం చేస్తున్నారో ప్రజలు, మీడియా గమనిస్తుంటారు. ఇప్పుడు సోషల్‌మీడియా విస్తరించింది కాబట్టి మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. మళ్లీ సభలోకి వచ్చేందుకు పనిచేయండి. లేకపోతే నేనే మిమ్మల్ని వదిలేస్తా’’
– ఇది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు, పలు సందర్భాల్లో తమ్ముళ్లకు చేసిన హెచ్చరిక. పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలని వృద్ధాప్యంలోనూ అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్న చంద్ర బాబు కష్టాన్ని.. కొందరు టీడీపీ ప్రముఖులు అధికారం అడ్డుపెట్టుకుని, నీరుగారుస్తున్న వైనం పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.

ప్రధానంగా ఇసుక, గ్రానైట్ దందాలపై అగ్రనేతలు అడ్డదారులు తొక్కుతున్న వైనంపై .. మీడియా-సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నా, ఎవరినీ ఖాతరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దానితో వైసీపీకి-టీడీపీకి తేడా లేదనుకునే పరిస్థితికి.. జనాలను తీసుకువస్తున్న ప్రమాదకర పరిణామం, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా కడప-అనంతపురం నేతలు ఆదినారాయణరెడ్డి-జెసి ప్రభాకర్‌రెడ్డి మధ్య.. బూడిద తరలింపు మధ్య, తలెత్తిన వాటాల వివాదం సీఎంఓకు చేరింది. ఇక కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించే బియ్యం లారీల వాటాలపై, కాకినాడ-రూరల్ నియోజకవర్గాల అగ్రనేతల మధ్య తలెత్తిన పేచీ రచ్చగా మారి.. చివరకు పోర్టులోని బియాన్ని సీజ్ చేసి, పవన్ కల్యాణ్ రంగంలో దిగేంతవరకూ వెళ్లడం కూటమి ప్రతిష్ఠను దెబ్బతీసినట్లయింది.

ఈ అంశంలో పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ నేతలను హెచ్చరించారు. అయినా ప్రయోజనం శూన్యం. ఈవిధంగా అక్రమ సంపాదనకు అడ్డదారుల్లో తెగబడుతున్న కూటమి నేతలు.. ప్రజలు ఏమనుకుంటారన్నది గాలికి వదిలేస్తున్నారు. దానికి పార్టీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోందన్నది పార్టీ శ్రేణుల ఆవేదన. ఇలాంటి బరితెగింపు చర్యలను ప్రజలు సహించరని తెలిసినా కూడా.. అగ్రనేతలు తమ స్వార్థం కోసం, పార్టీని ఫణంగా పెడుతున్నారన్న ఆగ్రహం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో పర్చూరు-అద్దంకి నియోజకవర్గాల్లో.. గత నెలరోజుల నుంచి మొదలైన గ్రానైట్ పలకల దందా, ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత నెలరోజుల క్రితం వరకూ అద్దంకి నియోజకవర్గం నుంచి వెళ్లే గ్రానైట్ లారీలకు, ఆ నియోజకవర్గం టీడీపీ రాష్ట్ర అగ్రనేత మూమూళ్లు తీసుకునేవారు కాదు. పర్చూరు నియోజకవర్గ కీలక నేతనే వాటిని వసూలు చేసుకునేవారు. ఇప్పుడు అద్దంకి నేత కుడిభుజమైన ఓ ప్రముఖుడు సారధిగా ఉంటూ.. గానైట్ లారీల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుప్పుమంటోంది.

మైనింగ్, రెవిన్యూ, పోలీసు అధికారులకు రాష్ట్ర పార్టీ ప్రముఖుడి పక్షాన రంగంలోకి దిగిన వ్యక్తి నుంచి.. నెల మామూళ్లు కూడా అందినట్లు చెబుతున్నారు. జిల్లా రెవిన్యూ కీలక అధికారికి ఒక్కరికే, నెలకు 30 లక్షలు మామూళ్లు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే సంప్రదాయం కొనసాగిందని చెబుతున్నారు. కాకపోతే ఆయనకు నెలకు 20 లక్షల రూపాయలు ఇచ్చేవారట. ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం బల్లికురువ, సంతమాగులూరు మండలాలనుంచి లారీలు వెళుతుండటంతో, దానిని 10 లక్షలకు పెంచేశారు.

అందువల్ల లారీకి 25 వేల నుంచి 32 వేలకు పెంచారు. అంటే మామూళ్ల వ్యవహారం గత ప్రభుత్వంలో కంటే పెరిగిందన్నమాట. జగన్ జమానాలో చీరాల వైసీపీ నేత పర్చూరు ఇన్చార్జిగా ఉన్నప్పుడు.. ఒక్కో లారీకి 25 వేలు వసూలు చేసేవారు. నాటి అద్దంకి వైసీపీ యువనేత కూడా, లారీల నుంచి మామూళ్లు ‘ చైతన్యవంతంగా’ వసూలు చేసేవారన్న ఆరోపణలు తెలిసిందే. ఇదంతా జీరో బిల్లుల దందా వ్యవహారం.

ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ, సంతమాగులూరు మండలాల నుంచి గ్రానైట్ పాలిషింగ్ పలకలు, తెలంగాణ-మహారాష్ట్రకు అడ్డదారుల్లో తరలివెళుతున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజానికి గత నెల రోజుల క్రితం వరకూ.. ఈ నియోజకవర్గం నుంచి వెళ్లే లారీల నుంచి, అక్కడి రాష్ట్ర ప్రముఖుడు మామూళ్లు తీసుకోలేదన్న ప్రచారం జరిగింది. చెడ్డపేరు వస్తుందన్న భయమే దానికి కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. అందువల్ల వాటిని, పర్చూరు టీడీపీ ప్రముఖుడే వసూలు చేసుకునేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కానీ గత నెలరోజుల నుంచి ఆ అద్దంకి టీడీపీ రాష్ట్ర ప్రముఖుడు పక్షాన ఒకరు రంగంలోకి దిగి, ఈ దందాకు ‘సారధి’గా వ్యవహరిస్తున్నారని, పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ప్రముఖుడికి కుడిభుజంగా వ్యవహరించే ఈయన సారధిగా ఉంటున్న గ్రానైట్‌తోపాటు, గ్రావెల్ దందా కూడా విజయవంతంగా నడుస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బల్లికురువ, సంతమాగులూరు మండలాల నుంచి.. దాదాపు 50 గ్రానైట్ పాలిషింగ్ పలకల లారీలు తెలంగాణకు తరలివెళుతున్నట్లు చెబుతున్నారు.

ఈ జీరో దందా వ్యాపారంలో చెక్‌పోస్టు నిర్వహణ అధీకృత కంపెనీకి 16 వేలు ఇచ్చి, మిగిలిన 16 వేలు నేతలు జేబుల్లో వేసుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. చెక్‌పోస్టు నిర్వహణ దక్కించుకున్న కంపెనీలు తన బాధ్యతను రాష్ట్ర స్థాయి ప్రముఖుడికి అనధికారికంగా అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి టన్ను పాలిషింగ్ పలకలకు 1300 రూపాయల సేల్స్‌టాక్స్, మైనింగ్ టాక్సు 700 రూపాయల చొప్పున 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రకారంగా లారీకి 70 వేల ఆదాయం సర్కారు ఖజానాలో జమకావలసి ఉంది. కానీ టీడీపీ రాష్ట్ర ప్రముఖులు లారీకి కేవలం 32 వేలు చెల్లించి, వ్యాపారం చేసుకుంటున్న వైనం అటు రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తోంది. అసలే రాష్ట్రం ఆర్ధికంగా బలహీనంగా ఉన్న పరిస్థితిలో, ఖజానాను పరిపుష్ఠం చేయాల్సిన టీడీపీ నాయకులే.. ఖజానాకు తూట్లు పొడిచే దందాకు తెరలేపడంతో, కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి కన్నం పడుతోంది.

వాస్తవానికి జీరో దందాలో వెళ్లే 35 టన్నుల లారీకి 75 వేల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆరకంగా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల నుంచి వెళ్లే 110 లారీలు, నెలకు 23 కోట్ల రూపాయలు పన్ను రూపంలో సర్కారు ఖజానాకు చెల్లించాలి. కానీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్న అక్రమార్కులు, నిర్భయంగా తమ వ్యాపారాలు చేసుకుని కోట్లు గడిస్తూ, ఖజానాకు చిల్లు పెడుతున్నారు. దీనిపై అటు విజిలెన్స్, ఇటు ఇంటలిజన్స్ దళాలు కూడా కన్నేయకపోవడమే విచిత్రం. కారణం.. ‘మామూలే’. దీనివల్ల బాపట్ల జిల్లా మైనింగ్, సేల్స్‌టాక్స్ విభాగం కోట్ల రూపాయల్లో ఆదాయం కోల్పోతోంది.

గ్రావెల్ తరలింపులోనూ అదే దందా

అద్దంకి నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి దందా యధేచ్చగా జరుగుతున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో నీటిపారుదల శాఖ నిబంధనలకు సైతం నీళ్లొదిలి, లక్షల్లో అర్జిస్తున్న అధికార ప్రముఖుల దందాపై తమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి దందాల వల్ల పార్టీకి అప్రతిష్ఠ వస్తుందన్నది వారి ఆందోళన.

ధర్మవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వకాలు, తరలింపు దందా జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇది కూడా అద్దంకి చెందిన ఓ రాష్ట్ర ప్రముఖుడి అనుచరుడే సారధిగా ఉన్నారంటున్నారు. ధర్మవరం గ్రామ నేతలు అడ్డుపెట్టుకుని, గ్రావెల్ దందా చేస్తున్నారని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మవరం పెద్ద చెరువులో దాదాపు వంద టిప్పర్లతో గ్రావెల్, మట్టి తవ్వి, నిర్భయంగా తరలిస్తూ లక్షలు గడిస్తున్నారని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్నారు.

అద్దంకి నియోజకవర్గం గుండా అమరావతికి వెళ్లే బెంగళూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు గ్రావెల్, మట్టి అవసరం. అది రాష్ట్ర పార్టీ ప్రముఖుడికి కలసివచ్చిందంటున్నారు. ధర్మవరం చెరువులోని గ్రావెల్, మట్టిని ఈ పనులకు తరలించడం ద్వారా.. ఒక టిప్పర్ గ్రావెల్‌కు వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ పనులకు సారధిగా ఉన్న రాష్ట్ర పార్టీ ప్రముఖుడి అనుచరుడు లక్షల్లో కూడగడుతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు.

నిజానికి గ్రావెల్, మట్టి తవ్వడం నిషేధం. అవి నీటిపారుదల శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. సహజంగా చెరువుల్లో వీటి తవ్వకాలను గ్రామస్తులు అంగీకరించరు. దానికి ఒక కారణం ప్రకృతి సంపద నాశనమవడం అయితే.. రెండో కారణం గ్రామంలో రోడ్లు ధ్వంసం కావడం. ఈ కారణంతోనే రాష్ట్ర ప్రముఖుడి అనుచరులు శింగరకొండ, కలవకూరు గ్రామాల్లో గ్రావెల్, మట్టి తవ్వుకునే ప్రయత్నాలను అక్కడి ప్రజలు అడ్డుకున్న క్రమంలో ధర్మవరంపై దృష్టి సారించారు. అయితే ఇప్పుడు ధర్మవరం గ్రామంలో వారికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం విశేషం.

కాగా అద్దంకి నియోజకవర్గంలోని రెండు మండలాల నుంచి మొదలైన గ్రానైట్ పాలిషింగ్ పలకల దందాను, రాష్ట్ర ప్రముఖుడి అనుచరుడే సారధిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పర్చూరులో ఇదే దందాను అనిల్ అనే వ్యక్తి, స్థానిక టీడీపీ అగ్రనేత పక్షాన నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలోనూ సదరు వ్యక్తి ఆధ్వర్యంలోనే.. గ్రానైట్, దందా జరిగిందంటున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినా మళ్లీ ఆ వ్యక్తికే వసూళ్లు అప్పగించడంపై టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ జమానాలో ఆర్ధికంగా బాగా నష్టపోయినా టీడీపీని వీడలేదని.. ఆయన చిన్నా చితక పనులు చేయరని.. డబ్బుకు వెనుకాడర న్న ప్రచారం బయట ఉధృతంగా జరుగుతుంటుంది. కానీ జగన్ జమానాలో తన క్వారీలను బందరు, గుడివాడ వైసీపీ ప్రముఖులకు ఇచ్చుకుని వ్యాపారం చేసుకున్న వైనం ఇటీవలి కాలం వరకూ బయట ప్రపంచానికి తెలియలేదు. ఇటీవలే ఆ తెరచాటు రాజకీయం పార్టీకి సైతం తెలిసిందట. కొత్తగా తన నియోజకవర్గంలోని రెండు మండలాల్లో.. గ్రానైట్ పాలిషింగ్ పలకల దందాను, తన అనుచరుడి ఇచ్చి వ్యాపారం చే సుకుంటున్న ఆ రాష్ట్ర నేత తెలివి చూసి, తెలుగుతమ్ముళ్లు తెల్లబోతున్నారట.

LEAVE A RESPONSE