– కస్టోడియల్ టార్చర్ కేసు న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది
– ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో నేను ఇంప్లిడ్ అవుతా
– పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని కోరా
– విధి నిర్వహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా… ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడు
– ఇద్దరు కుమారులను అమెరికాలో చదివిస్తూ, అక్కడకు వెళ్లి గోల్ఫ్ ఆడాడంటే… ఆయన ఎంతటి నిజాయితీపరుడు ఇట్టే తెలుస్తోంది?
– పీవీ సునీల్ కుమార్ ఎన్ని దేశాలకు వెళ్లాడో తెలుసుకోవడానికి ఆయన పాస్ పోర్ట్ ను తనిఖీ చేయాలి
– ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ ఎప్పుడు లేఖ రాశారు? విచారణలో బయటకు వస్తుంది
– పీవీ సునీల్ కుమార్ తన ఇంట్లో పని చేసే వాళ్లను, సొంత మనుషులతో నన్ను తుద ముట్టించాలని చూశాడు
– నా మీద పడి ఫోన్ గుంజుకున్న విజయ్ పాల్
– ఉండి శాసనసభ్యులు, ఉప సభాపతి రఘు రామ కృష్ణంరాజు
ఉండి: కస్టోడియల్ టార్చర్ కేసులో మతిమరుపు వచ్చినట్లుగా నటిస్తున్న వారు మినహా మిగతా వారంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారని ఉండి శాసనసభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఉప శాసనసభాపతి రఘు రామకృష్ణంరాజు తెలిపారు. రిమాండ్ రిపోర్టు చూసిన తర్వాత ఆరోజు విధినిర్వాహణలో ఉన్న కానిస్టేబుళ్ల తో పాటు ఇతరులు కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే కాకుండా, మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చారన్నారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో నన్ను తుద ముట్టించాలని ప్రయత్నించారు. సిఐడి విచారణలోనే కాకుండా, జైలులోను నన్ను తుద ముట్టించే ప్రయత్నం చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి దయతో నేను బ్రతికి బయటపడ్డానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తు వేగవంతం అయ్యిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడైన విజయ్ పాల్ కు గతవారం సుప్రీం కోర్ట్ బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. ఆ మరసటి రోజు రాత్రి 9 గంటలకు పోలీసులు విజయ్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ప్రోద్బలంతో వైద్య నివేదికలను తార్ మార్… తక్కెడ్ మార్ చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆనాటి సూపరిండెంట్ ప్రభావతి, ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.
గతంలో నేను చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆమె తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ లో నేను కూడా ఇంప్లిడ్ కానున్నట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడైన విజయ్ పాల్ కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీరస్కరించిన నేపథ్యంలో, ప్రభావతికి ముందస్తు బెయిల్ లభిస్తుందా?, లేదా?? అన్నది వేచి చూడాలన్నారు. ఈ కేసులో ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు.
వీఆర్వోలు మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా ఒక ప్రముఖ దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. వీఆర్వోలు తాము అసలు సిఐడి కార్యాలయానికి వెళ్లలేదని తమ వాంగ్మూలంలో స్పష్టం చేశారు. నేను వీఆర్వోలకు కస్టడీలో నన్ను బాగానే ట్రీట్ చేశారు… నాకు భలే కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పి చకచకా మెట్లు దిగి కిందకు వచ్చి, నా ఫోన్ తీసుకోండి అని ఇచ్చినట్లుగా తప్పుడు నివేదికను సృష్టించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎందుకంటే నా కాళ్లపై తీవ్రంగా హింసించినందుకే తాను చక, చకా మెట్లు దిగి వచ్చినట్లుగా నివేదికలో పేర్కొన్నారన్నారు.
జగన్మోహన్ రెడ్డి పట్ల నేను తప్పు చేశాను. బాధపడుతున్నానని ఇద్దరు వీఆర్వోలకు విన్నవించినట్లుగా ఈ దగుల్బాజీలు తప్పుడు నివేదికను సిద్ధం చేశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇదే రకమైన నివేదికను సిద్ధం చేసుకుని డీఎస్పీ దిలీప్ కుమార్ నా వద్దకు వచ్చి సంతకం పెట్టమని అడగ్గా… ఇదంతా పచ్చి అబద్ధమని స్పష్టంగా రాయడమే కాకుండా, అసలు నా గది నుంచి నేను బయటకి నడవలేకపోయానని తెలిపారు. ఈ లేఖ అంతా ట్రాష్ అని రాసి సంతకం పెడితే డీఎస్పీ దిలీప్ కుమార్ నన్ను బెదిరించారని వెల్లడించారు.
నిన్న ఎలాగో మిస్ అయ్యావు… సంతకం పెట్టకపోతే ఈరోజు మాత్రం అవుటేనని బెదిరించాడని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మొదట నేను రాసి సంతకం పెట్టిన చోటు చింపివేసి, రెండవ సారి అదే లేఖ నా ముందు పెట్టినప్పటికీ… నేను మొదట రాసినట్లుగానే మళ్లీ రాశానని స్పష్టం చేశారు. డీఎస్పీ దిలీప్ కుమార్ ఎదుటనే నేను అది అబద్ధమని ఖండించానని వివరించారు. ఇప్పుడు వీఆర్వోలు కూడా తమ వాంగ్మూలంలో అదే విషయాన్ని చెప్పారన్నారు.
నన్ను అరెస్టు చేసే సమయంలో విజయ్ పాల్ నా మీద పడి నా ఫోన్ వెంటనే గుంజుకున్నాడని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒక వ్యక్తి నుంచి బలవంతంగా ఫోన్ లాక్కోవడం తప్పని, అది నేరం కూడా అని ఆయన పేర్కొన్నారు. నా వద్ద నుంచి విజయ్ పాల్ ఫోన్ లాక్కున్న సంఘటనకు అనేకమంది సాక్షులు ఉన్నారని తెలిపారు.
నన్ను అరెస్టు చేసే సమయంలో అనుకోకుండా విజయరామరాజు అనే వ్యక్తి అక్కడకు వచ్చారని, సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ ఉండడాన్ని ఆయన గుర్తించాలన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని గుర్తించినందుకు విజయరామరాజును మా ఇంటి వెనకాల ఉన్న గార్డెన్లోకి తీసుకువెళ్లి విజయ్ పాల్ గుండెలపై తన్నారన్నారు. అప్పుడు విజయ్ పాల్ తన కాళ్లకు వుడ్ ల్యాండ్ షూస్ వేసుకున్నట్లు విజయరామరాజు గుర్తించారని తెలిపారు. విజయరామరాజు గుండెల పై తన్నడమే కాకుండా ఇటువంటి అకృత్యాలు ఆరోజు విజయ్ పాల్ ఎన్నో చేశారని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు.
అబద్ధం చెబుతున్న ప్రభావతి
వైకాపా నాయకులు న్యాయవాది రవి సతీమణి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి మా డాక్టర్లు ఏది చెబితే నేను అదే చేశానని అబద్ధాన్ని చెబుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆరోజు డాక్టర్లు ఉన్నది ఉన్నట్లుగా చెబితే, వారిని కాదని జూనియర్ డాక్టర్ల చేత సంతకాలు తీసుకున్నారన్నారు. ఈ విషయాలు గతంలో వార్తాపత్రికలలో కథనాలుగా కూడా వెలువడిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.
నేనొక గైనకాలజిస్ట్ నని నాకేమి సంబంధం అంటూ ప్రభావతి ఎన్ని ప్రయత్నాలు చేసిన , అబ్బబ్బ నాకేమీ తెలియదన్న ఆమె విచారణ ఎదురుకోక తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రభావతి ప్రభావాలకు లోను కాకుండా, అసలు నిజాలను చెబితే బాగుంటుందన్నారు. ఒకవేళ ప్రభావతి కూడా మెమరీ లాస్ వస్తుందేమోనన్న రఘురామకృష్ణం రాజు, ఆమెకు మెమరీ లాస్ రాకుండా చూడాలని భగవంతుని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
విధినిర్వహణలో కొనసాగుతూనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పీవీ సునీల్ కుమార్
ఐపీఎస్ మార్గదర్శకాలకు విరుద్ధంగా విధి నిర్వహణలో కొనసాగుతూనే అంబేద్కర్ ఇండియా మిషన్ అనే స్వచ్ఛంద సంస్థను పీవీ సునీల్ కుమార్ నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. విధినిర్వాహణలో ఉంటూ ఒక అధికారి చేయకూడని పనులన్నీ పీవీ సునీల్ కుమార్ చేశారన్నారు. తాను ఒక క్రైస్తవుడినని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఇక నువ్వు నాకు నచ్చావు చిత్రంలో ప్రకాష్ రాజ్ మాదిరిగా బ్రిటిషోడా నువ్వు మాకు పూజలు చేసుకోవడానికి చర్చి ఇచ్చావ్… చదువుకోవడానికి స్కూలు ఇచ్చావు అంటూ బాహాటంగానే స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు.
తాను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ, ఎస్సీ సర్టిఫికెట్ కలిగి ఉన్నాడని తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అసెంబ్లీ ఉపసభాపతిగా తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అవకాశాన్ని కల్పించాయని, నేను ఇతర వ్యవహారాల జోలికి వెళ్ళబో నని స్పష్టం చేశారు. కేవలం నా నియోజకవర్గం అభివృద్ధిని వివరిస్తూ, నన్ను కస్టోడియల్ టార్చర్ ద్వారా చంపాలని చూసిన ఈ కేసు గురించి నిజాలను నా అభిమానులకు తెలియజేస్తానని చెప్పారు.
12వ తేదీన సమావేశమై 14 న కుట్రపూరితంగా అరెస్ట్
మే 12వ తేదీన ఆనాటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, మరో ఐపిఎస్ అధికారి రఘురామిరెడ్డి లు ప్రత్యేకంగా సమావేశమై కుట్ర చేసి అరెస్టు చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరినట్లుగా పేర్కొన్నారని, కానీ అంతకు ముందు రోజే సాయంత్రం ఏడు గంటలకే బయలుదేరారన్నారు.
అంతకంటే ముందుగానే ఇన్నోవా టాక్సీ కార్లను బుక్ చేసి పగడ్బందీ ప్లాన్ తో అరెస్టుకు బయలుదేరారని పేర్కొన్నారు. మరో 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డే అధికారంలో ఉంటాడని భావించి, వీడిని చంపేసి తరవాత కేసు ఉండదని భావించారన్నారు. ఒక ఎమర్జెన్సీ కార్డియాలజిస్ట్ ను రెడీగా ఉంచాలంటూ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ అంతరంగిక ఆదేశాలను జారీ చేశారు. 14వ తేదీ న నన్ను అరెస్టు చేసి సిఐడి కార్యాలయానికి తీసుకు వచ్చిన తర్వాత ఆ ఆదేశాలను ఇచ్చారా?, లేకపోతే తొందరపడి ముందే కోకిల కూసిందన్నట్లుగా 13వ తేదీన లేఖ రాశారా? అన్నది విచారణలో తేలుతుందన్నారు.
నన్ను పోలీస్ కస్టడీలో, జైలు లో తుద ముట్టించాలని భావించారు. కానీ నేను కొలిచే దైవం వెంకటేశ్వర స్వామి దయవల్ల బ్రతికి బయటపడ్డానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆరోజు ఏమి జరిగిందో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు.
సొంత మనుషులతో అంతమొందించేందుకు సునీల్ కుట్ర
రెగ్యులర్ పోలీస్ స్టాప్ కాకుండా తన ఇంట్లో పని చేసేవారితో పాటు , తన అడుగులకు మడుగులోత్తే వారితో కలిసి పీవీ సునీల్ కుమార్ నన్ను అంతమొందించాలని కుట్ర చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రెగ్యులర్ పోలీస్ స్టాప్ అయితే ఎప్పుడో ఒకప్పుడు బయటకు పడుతుందనే ఉద్దేశంతోనే పీవీ సునీల్ కుమార్ ఈ విధంగా ప్లాన్ చేశాడన్నారు. అప్పటికే నాలుగున్నర నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న నా ఛాతి పై 110 కేజీలు ఉన్న తులసీ అనే పీవీ సునీల్ కుమార్ కలెక్షన్ ఏజెంట్ కూర్చోవడంతో, ఆ బరువు తాళలేక మంచం కోళ్లు విరిగాయన్నారు.
ప్రస్తుతం గుడివాడలో దందాలు చేస్తున్న తులసీ, రఘురామకృష్ణం రాజును వేసేసింది నేనేనని చెప్పుకుంటున్నట్లుగా గుడివాడ వాసులే నాకు చెప్పారన్నారు. గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము నాకు మంచి మిత్రుడేనని, ఇటువంటి వారిని చేర తీయవద్దని చెబుతానన్నారు. ఈ కేసు నుంచి బయటపడడానికి మేనేజ్ చేయవచ్చునని తులసీ భావిస్తున్నట్లుగా తెలిసిందని, ఆయన్ని ఎవరు కాపాడలేరన్నారు.
పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. దుబాయ్ వంటి దేశాలలో ఇతరుల పేరిట పీవీ సునీల్ కుమార్ ఆస్తులను కొనుగోలు చేశారన్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడే సునీల్ కుమార్ ఎన్నో దేశాలను తిరిగారని, ఆయా దేశాలలో ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్లి గోల్ఫ్ కూడా ఆడాడన్నారు. పీవీ సునీల్ కుమార్ పాస్ పోర్ట్ తనిఖీ చేస్తే ఏ దేశాలకు వెళ్లాడో వివరాలు తెలుస్తాయని చెప్పారు. తన ఇద్దరు కుమారులను వారేమి మెరిట్ స్టూడెంట్స్ కాకపోయినప్పటికీ, అమెరికాలో చదివిస్తూ, ఆ దేశానికి వెళ్లి గోల్ఫ్ ఆడాడు అంటే ఆయన ఎంతటి నిజాయితీపరుడో ఇట్టే అర్థమవుతుందన్నారు.
పీవీ సునీల్ కుమార్ తనకు ఒక సైన్యం ఉన్నది ఊరించి, లేకపోతే బెదిరించే ప్రయత్నాలను చేస్తాడన్నారు. పీవీ సునీల్ కుమార్ ఎత్తుగడలకు కూటమి నేతల్లో లొంగే వారు ఎవరూ లేరన్నారు. ఇప్పటికే పీవీ సునీల్ కుమార్ అటువంటి ప్రయత్నాలను చేసి ఉంటాడని తెలిపారు. ఇప్పటికైనా పీవీ సునీల్ కుమార్ నిజాన్ని ఒప్పుకుంటే మంచిదని, ఒప్పుకోకపోయినా వచ్చే నష్టం లేదన్నారు. కేసు ఇప్పుడే పట్టాలు ఎక్కిందని… త్వరలో ఏమవుతుందో చూద్దామన్న రఘురామ కృష్ణంరాజు, కచ్చితంగా న్యాయమే జరుగుతుందన్నారు. కాకపోతే ఎన్ని రోజుల్లో న్యాయం జరుగుతుందన్నది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
విచారణకు రానున్న జగన్మోహన్ రెడ్డి కేసు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సీబీఐ దాఖలు చేసిన కేసులు న్యాయస్థానం విచారణ లో జాప్యాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన కేసు, రేపు సుప్రీం కోర్టు ముందుకు రానుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో ఈ కేసు బెంచ్ పైకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన న్యాయమూర్తి బెంచ్ లో ఉండడంవల్ల, ఈ కేసు ను రెండు వారాలపాటు వాయిదా వేస్తూ, మరొక బెంచ్ కు బదిలీ చేశారని తెలిపారు. నేను ఇప్పుడు కొత్తగా ఎవరిపై కేసులు వేయకూడదని, ఇది గతంలో వేసిన కేసు అని గుర్తు చేశారు.
ఈనెల 22వ తేదీన ఆకివీడులోని ప్రభుత్వ ఆసుపత్రి నూతన బ్లాక్ ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నేర రహిత నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉండి ప్రభుత్వ పాఠశాలతో పాటు భీమవరం, ఉండి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేయనున్న రతన్ టాటా కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని డిసెంబర్ 12వ తేదీ తర్వాత చేపట్టనున్నట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.