ఈరోజు పత్రికలు చూడగానే పదో తరగతి పరిక్షా ఫలితాల ప్రకటనలు కనిపించాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇది మామూలే కదా అనుకున్నా. అయితే ప్రభుత్వ బడుల్లో 10వ తరగతి చదివిన పిల్లలు అత్యధిక మార్కులు సాధించిన ప్రకటన ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నలుగురు విద్యార్థులు 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించారు. మరో ఆరు మందికి 595 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివిన విద్యార్థుల పరీక్షా ఫలితాల ర్యాంకులు ఇలా ప్రకటన రూపంలో రావటం చరిత్రలో ఇదే మొదటిసారి. ఉదయం చూసినప్పుడే నేను అనుకున్నాను. కొందరు అధికారులతో మాట్లాడిన తర్వాత ఇదే తొలిసారని నిర్థరించుకున్నాను. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు.
అంతా బాగానే ఉంది కానీ… ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సాధించిన మార్కుల గురించి ప్రభుత్వానికి పేరు వచ్చేలా ప్రకటన రూపొందించటం ఇక్కడ గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఆ క్రెడిట్ తీసుకోవచ్చు. కానీ ఎందుకనో ఆయన తీసుకోలేదు. చదువుల్లో రాజకీయాలు చొప్పించవద్దని లోకేష్ ఇటీవల తరచూ చెబుతున్నారు. బహుశా అందుకే ఆయన ప్రభుత్వ బడులు సాధించిన విజయాల్ని తన ఖాతాలో వేసుకోలేదు కావొచ్చు.
నిజంగా ఈ ఘనత వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులది… వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులదే. కాకపోతే ప్రభుత్వ బడులు అత్యున్నత స్థాయిలో ఉండాలనే ఆలోచనతో పనిచేయటంలో లోకేష్ కు క్రెడిట్ ఇవ్వొచ్చు. ప్రభుత్వ విద్య వ్యవస్థ గతంలో మాదిరిగా లేదు. మారుతోందని చెప్పటానికి ఇవాళ పేపర్లో వచ్చిన ప్రకటన ఊతమిస్తుంది.
ప్రభుత్వ బడుల్లో ఏం మారిందంటే… ప్రభుత్వ ఫోకస్ మారిందని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా లీప్(లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు ఈ కార్యక్రమం ప్రభుత్వ బడుల్లో అమలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ బోధన విధానాలను తీసుకుని… మన అవసరాలు, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మార్చి…. ఇక్కడి పిల్లలకు అర్థమయ్యేలా కరిక్యులం తయారు చేసి పాఠాలు చెప్పారు.
కేవలం పాఠాలే కాకుండా విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం ప్రభుత్వ బడుల్లో అమలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలైంది. లోకేష్ ప్రత్యేక చొరవతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతోంది.
ఇలాంటి పాఠశాలలు నియోజకవర్గానికి కనీసం ఒకటి ఉండాలని లోకేష్ ఆలోచన. లీప్ విధానం అక్కడ అమలు చేయటం ద్వారా ప్రభుత్వ బడుల్ని ప్రైవేటుగా ధీటుగా తయారు చేయటం, కార్పొరేట్ తరహా సౌకర్యాలు అందించటం ఇక్కడ ప్రత్యేకత.
– సానె పూర్ణ చంద్రశేఖర్