– ఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వ పాఠశాల ఇలా యాడ్ ఇచ్చి ఉండదు
– భారత దేశ చరిత్రలోనే విద్యావ్యవస్థలో ఇదొక రికార్డు
– నారా లోకేష్ నిజాయితీ ప్రకటన
విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించినప్పుడే సవాళ్లను స్వీకరించడం, అడ్డంకులను అధిగమించడం, కష్టసాధ్యమైన లక్ష్య సాధనను ఇష్టంగా తీసుకోవడం తనకు హాబీ అని ప్రకటించారు నారా లోకేష్.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజకీయరంగు పులుముకున్న విద్యను రాజకీయాలకు దూరం చేసే పని ముందుగా ఆరంభించారు. సమస్యలు తెలుసుకున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో విద్యా సంస్కరణలు అధ్యయనం చేయించారు. ప్రణాళిక సిద్ధంగా చేశారు. కార్యాచరణ ఆరంభించారు. తప్పు జరిగితే ఒప్పుకుంటూ..అది మరోసారి జరగకుండా చూసుకుంటూ.. పారదర్శకతతో, నిజాయితీతో విద్యాశాఖను నడిపిస్తున్నారు. దీని ఫలితమే ఇటీవల ఇంటర్ ఫలితాలు, నిన్ననే విడుదలైన పదోతరగతి అత్యుత్తమ ఫలితాలు.
దేశంలోనే ఈ యాడ్ ఒక రికార్డు
ఇదంతా ఒక ఎత్తు. అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యమైన కార్పొరేటు స్కూళ్ల కంటే ఒక మెట్టు ఎత్తులో ప్రభుత్వ విద్యాలయాలను నిలపాలనే మంత్రి నారా లోకేష్ చేపట్టిన మిషన్లో వచ్చిన ఫలితాలను అత్యంత నిజాయితీగా ప్రకటించారు. పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు, సాధించిన మార్కులు, వారి స్కూళ్ల వివరాలతో తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. భారత దేశ చరిత్రలోనే విద్యావ్యవస్థలో ఇదొక రికార్డు.. ఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వ పాఠశాల ఇలా యాడ్ ఇచ్చి ఉండదు.
నో పాలిటిక్స్..ఓన్లీ ఎడ్యుకేషన్
ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ మీరు గమనిస్తే..ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారుల ఫోటోలు లేవు. కూటమి ప్రభుత్వ రంగులు కానరావు, ప్రభుత్వ నినాదాలు కనపడవు. ప్రభుత్వ విద్యాలయాలు సగర్వంగా నిలబడి అనే విజయగర్వం ఒక్కటే కనిపిస్తోంది. ప్రతిభ చాటిన విద్యార్థుల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఆయా స్కూళ్లు, ఆయా ఊర్ల వివరాలు మాత్రమే పొందుపరిచారు.
నిజాయితీతో కూడిన ప్రకటన
1,2,3,4,5,6,7,8,9,10 ర్యాంకుల ప్రకటనల హోరు కాదిది. సాధించిందే చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా వచ్చిన మార్కులనే ప్రకటనగా ఇచ్చారు. మేమే నెంబర్ వన్ అని ప్రకటించలేదు. ఫలితాల్లో మెరుగ్గా ఉన్నాం..ప్రతిభ ప్రదర్శనలో ముందున్నాం అని మాత్రమే ప్రకటించారు.
ప్రవేశాలకు పిలుపు
ఏసీ క్యాంపస్లు, పిల్లలు ఊపిరి తీసుకోకుండా క్లాసులు, 1వ తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు ఇదీ ప్రైవేటు-కార్పొరేటు ప్రచార తీరు.. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు అమ్మలా శిక్షణ, నాన్నలా రక్షణ, స్నేహపూర్వక బోధన ఇదే మా ప్రభుత్వ పాఠశాలల బలం, సుశిక్షితులైన ఉపాధ్యాయులు మా బలగం అని ప్రకటన ద్వారా చాటిచెప్పారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే ప్రభుత్వ బడిలో చేర్పించండి అంటూ బడి ప్రవేశాలకు పిలుపునిచ్చారు.
స్ఫూర్తివంతమైన పథకాలు
బడికి అధికార దర్పపు రాజకీయ రంగులు పులమనీయలేదు. బడి గేటు లోపలికి రాజకీయాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టించారు. పథకాలకు స్ఫూర్తిమంతంగా నిలిచే మహనీయుల పేర్లు పెట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర.. ఇవీ ప్రస్తుతం నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలో పథకాల పేర్లు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి స్ఫూర్తి ప్రదాతల పేర్లు పథకాలకు పెట్టారు. ఈ పథకాలలో అందించే వస్తువులు, దుస్తువులు, క్రీడా పరికరాలు, పుస్తకాలపై సీఎం, విద్యాశాఖా మంత్రి బొమ్మలు కానీ, కూటమి ప్రభుత్వం రంగులు కానీ లేకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చి అమలు చేశారు మంత్రి నారా లోకేష్.
లోకేష్.. మీ నిజాయితీ ప్రకటన బాగుంది. మీ పారదర్శకత నచ్చింది. మీ సారధ్యంలో విద్యాశాఖ మరిన్ని విజయాలు సాధిస్తుందని, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కల సాకారం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంద శాతం విశ్వసిస్తున్నారు.
