– మధుసూదన్ నిబద్ధత మరువలేనిది
-మిర్యాలగూడలో మధు నివాసానికి వెళ్లి పరామర్శించిన భట్టి విక్రమార్క
-కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన ఉపముఖ్యమంత్రి
– హైదరాబాద్‌కు జ్యోతి బదిలీ, కుమారుడికి ఉద్యోగంపై సానుకూల హామీ
మిర్యాలగూడ: ఉన్నతమైన విలువలు, వృత్తి పట్ల అంకితభావం కలిగిన సిపీఆర్వో మారబోయిన మధుసూదన్ కోల్పోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దివంగత సిపీఆర్వో మారబోయిన మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం మిర్యాలగూడలోని మధుసూదన్ నివాసానికి వెళ్లిన ఆయన, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
మధుసూదన్ భార్య జ్యోతి, తల్లి పార్వతమ్మలతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. మధుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాత్రికేయ విలువలకు మధు నిలువెత్తు రూపం. సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం, వృత్తిలో ఆయన చూపిన నిబద్ధత ఎందరికో ఆదర్శం అని ఆయన కొనియాడారు. మధు మృతి ఆ కుటుంబానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పరామర్శ సమయంలో కుటుంబ సభ్యులు తామ ఎదుర్కొంటున్న సమస్యలను ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మధు సూదన్ సతీమణి జ్యోతి ప్రస్తుతం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో కోఆర్డినేటర్‌గా హైదరాబాద్‌లో డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. తన కుమారుడి భవిష్యత్తు నిమిత్తం తనను శాశ్వతంగా హైదరాబాద్ లేదా మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాకు బదిలీ చేయాలని కోరారు. దీనిపై భట్టి స్పందిస్తూ, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీటెక్ పూర్తి చేసిన మధు సూదన్ కుమారుడు వెంకట్ సూరజ్ కు కార్పొరేట్ సంస్థల్లో మంచి ఉద్యోగం వచ్చేలా సహకరించాలని కోరగా, సురేష్ భవిష్యత్తు బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
సీపీఆర్వో దివంగత మధుసూదన్ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి ఎటువంటి అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని భట్టి విక్రమార్క తెలిపారు. వ్యక్తిగతంగానూ ఆ కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.