– ప్రముఖుల ఇళ్లకు వెళ్లడం ఏం సాంప్రదాయం?
– గతంలో ఏ చైర్మన్ అయినా అలా వెళ్లారా?
-స్వామి ప్రతినిధి గడప గడపకూ వెళతారా?
– బాబును తిడుతున్న బీఆర్‌ఎస్ నేతలకు వెళ్లి ఏం సంకేతాలిస్తున్నారు?
– మిగిలిన చైర్మన్లు కూడా బీఆర్‌ఎస్ నేతలను కలిస్తే పార్టీ సహిస్తుందా?
– ప్రముఖుల వద్దకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెళ్లడంపై టీడీపీ సోషల్‌మీడియాలో విసుర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన టీటీడీ చైర్మన్. అంటే కొండపై కొలువు తీరిన తిరుమల వెంకన్న ప్రతినిధి. అంటే ఆయనకు బోలెడంత గౌరవం ఉంటుంది. మిగిలిన వారికంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరైనా ఆయన వద్దకు వెళ్లాల్సిందే. కానీ విచిత్రంగా.. సాధారణ రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల మాదిరి, ప్రముఖుల ఇళ్లకు వెళ్లి ‘గడప గడపకూ చైర్మన్’ కార్యక్రమం ప్రారంభించడమే, వెంకన్న భక్తులకు రుచించడం లేదు. ఆయనకు ఆ పదవి ఇచ్చిన టీడీపీ కోసం పనిచేసే సోషల్‌మీడియా సైన్యానికి అస్సలు మింగుడుపడటం లేదు. మొత్తంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనుసరిస్తున్న కొత్త పద్ధతిపై పెదవి విరుపు.
టీవీ 5 చానెల్ అధిపతిగా ఉన్న బీఆర్ నాయుడు గత జగన్ సర్కారుపై ఒంటికాలితో లేచిన మాట నిజం. వైసీపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పోగు చేసిన మాట, అంతకంటే నిజం. ఫలితంగా ఆయనపై జగన్ సర్కారు దేశద్రోహం వంటి కఠినమైన కేసులు పెట్టిన మాట నిజం. టీడీపీకి జై కొట్టడం వల్ల, జగన్ సర్కారు ఇచ్చే వాణిజ్య ప్రకటనలు కోల్పోయిన మాట కూడా నిజం. ఇవన్నీ నిష్ఠుర నిజాలే.
అందుకే ఆయన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది. అది అలాంటిలాంటి ప్రతిఫలం కాదు. టీటీడీ చైర్మన్ వంటి ప్రతిష్ఠాత్మక పదవి వరించింది. నిజానికి ఆ పదవి పార్టీలో పనిచేసే వారికే దక్కుతుంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసం పెద్ద జాతర నిర్వహించారు. ఎంతపెద్ద సీనియర్లయినా వచ్చి పదవుల కోసం దరఖాస్తు చేసుకునే కొత్త విధానం అది. దానికి పార్టీ సభ్యత్వాన్ని ప్రాతిపదికగా నిర్దేశించారు.
అంటే సభ్యత్వం ఉన్న వారు ఆ నంబరు చెప్పాలన్నమాట. దానికి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ అనే రెండు పద్ధతులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా చూస్తే టీవీ 5 చానెల్ యజమాని బీఆర్ నాయుడుకు, టీడీపీ సభ్యత్వం ఉన్నట్లే భావించక తప్పదు. లేకపోతే పదవి దక్కి ఉండేది కాదు. సరే ఏదేమైనా నాయుడుగారికి అత్యంత ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ పదవి లభించింది. మంచిదే.
చైర్మన్ పదవి ప్రకటించిన తర్వాత నాయుడు గారు చాలామంది ప్రముఖులు, అనుభవజ్ఞులకు ఫోన్లు చేసి మీ సలహాలు, సూచనలు కావాలని కోరారట. అది కూడా భేషుగ్గానే ఉంది. తెలియని విషయాలు అనుభవజ్ఞుల నుంచి తెలుసుకోవడం మంచి పరిణామమే. అందుకు ఆయనను అభినందించాల్సిందే. సరే.. ఇక నాయుడు గారు టీవీ చానెల్ అధిపతి కాబట్టి, ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నాయకులు/నాయకురాళ్లు ఆయనను పొగడ్తలతో ముంచేయడం, ఆయన ఆ పదవికి అర్హుడేనని, నాయుడు గారి జమానాలో టీటీడీ దివ్యంగా వెలిగిపోతుందని మైకుల ముందు తీరికూర్చుని పొగిడేశారు. ఇవన్నీ అవసరార్ధ వ్యవహారాలనుకుందాం.
ఆ తర్వాత కొంతమంది జర్నలిస్టులు ఆయనకు హైదరాబాద్‌లో సన్మానం చేసి, జర్నలిస్టు కమ్యూనిటీకి చెందిన నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినందున.. ఇకపై టీటీడీపై ఎవరూ వ్యతిరేక వార్తలు రాయకూడదని భక్తిశ్రద్ధలతో, తాదాత్మ్యంతో ఒక పిలుపునిచ్చారు. సరే ఇవన్నీ మార్కెటింగ్ వ్యవహారాలు కాబట్టి, వాటిని వారి విజ్ఞతకు వదిలేయాల్సిందే. ఎందుకంటే నాయుడు గారు టీటీడీకి మొదటి చైర్మన్ కాదు. చివరి చైర్మన్ కూడా కాదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టీవీ9 యజమానులు కూడా టీటీడీలో సభ్యులుగా నియమితులైన సందర్భం విస్మరించకూడదు. సరే.. ఎవరి స్థాయి.. ఎవరి భజన.. ఎవరి విజ్ఞానం వారిది.
వీటిని పక్కనపెడితే.. టీటీడీ చైర్మన్‌గా ‘నియమితులైన’ నాయుడు గారు, తనకు ఆ పదవి వచ్చిన సందర్భంలో వివిధ వ్యక్తులను వారి ఇళ్లకు, ఆఫీసులకు వెళ్లి కలవడమే విమర్శల పాలవుతోంది. దానికి ‘మర్యాదపూర్వకంగా’ అనే, పత్రికారంగంలోని ఓ పడికట్టు పదం వాడినప్పటికీ, అది మర్యాద కాదన్నది భక్తులు, టీడీపీ సోషల్ మీడియా సైనికుల ఉవాచ.
ఈ విషయంలో రమణ దీక్షితులు చేసిన తప్పులే, బీఆర్ నాయుడు చేస్తున్నారన్నది ఓ పీఠాథిపతి అభిభాషణ. స్వామివారి ప్రతినిధి అయిన రమణదీక్షితులు, వీఐపీల వద్దకు వెళ్లడం, తనకు న్యాయం చేయాలని పాలకుల చుట్టూ తిరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు స్వామివారికి అర్చన చేసే రమణదీక్షితుల దగ్గరకే అందరూ రావాలి. కానీ అందుకు భిన్నంగా ఆయనే అందరి చుట్టూ తిరగడం వల్ల ఆయన స్థాయి, విలువ, హోదా దిగజారిపోయింది.
ముఖ్యంగా బీఆర్‌ఎస్ నాయకుల వద్దకు వెళ్లిన నాయుడు గారి తీరుపై, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు గుర్రుగా ఉన్నారు. వారు సంధిస్తున్న పోస్టులు చూస్తే.. ఆ మర్యాదపూర్వక కలయిక వారికి ‘అమర్యాద’గా తోచినట్లు అర్ధమవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావు, తలసాని, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, ఈనాడు అధినేత కిరణ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ల వద్దకు వెళ్లి ‘మర్యాదపూర్వకంగా’ కలిసిన వైనం.. గత కొద్దిరోజుల నుంచి సోషల్‌మీడియా వేదికగా విమర్శలకు గురవుతోంది.
ఈనాడు, ఆంధ్రజ్యోతి అధిపతుల వద్దకు వెళ్లి కలిసిన ఆ ‘మర్యాద’.. టీవీ9, ఎన్‌టీవీ అధిపతుల విషయంలో కనిపించకపోవడమే ఆశ్చర్యం. బహుశా ఆ విషయంలో నాయుడు గారికి పరిమితులు ఉండవచ్చేమో. ఆ వరసలో ఇతర చానెళ్లు, పత్రికల యజమానుల వద్దకు వెళ్లినట్లు లేదు. అంటే వారికి ఆ స్థాయి లేదనుకోవచ్చేమో!
మరి ఇప్పటికీ చంద్రబాబును పొట్టుపొట్టు తిట్టిపోసే బీఆర్‌ఎస్ నాయకులను, నాయుడు గారు స్వయంగా వెళ్లి కలవడం ఏం మర్యాద? అన్నది టీడీపీ సోషల్‌మీడియా సైనికుల సంధిస్తున్న ప్రశ్నలు. తాజాగా బీఆర్‌ఎస్ నిర్వహించిన దీక్షా దివస్‌లో ప్రసంగించిన ఆ పార్టీ అగ్రనేతలు.. నాటి ఉద్యమ ఘట్టాలు స్మరించుకుంటూ.. చంద్రబాబునాయుడు తెలంగాణపై చేసిన కుట్రను చెప్పి మరీ తిట్టిపోశారు. మరి ఇది మర్యాదనా? అమర్యాదనా? అన్నది తమ్ముళ్ల సందేహం.
అదే నాయుడు గారి స్థానంలో ఏ పట్టాభి, జీవీరెడ్డి, విజయకుమార్, ఆనం వెంకటరమణారెడ్డి, డేగల ప్రభాకర్, కోటేశ్వరరావో ఉంటే.. బీఆర్‌ఎస్ నేతలను ‘మర్యాదపూర్వకం’గా కలిసిన వారిని టీడీపీ నాయకత్వం ఉపేక్షిస్తుందా? అన్నది తమ్ముళ్లు సంధిస్తున్న ప్రశ్నల్లో ఒకటి. బహుశా బంతిలో వలపక్షం అంటే ఇదే కామోసు!
అయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులెవరూ, ఇలా మర్యాదపూర్వకంగా బీఆర్‌ఎస్ నేతలను వారి ఇళ్లకు వెళ్లి కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూటమి మంత్రివర్గంలో ఉన్న పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పార్ధసారధితోపాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విప్ కాలవ శ్రీనివాసులు వంటి ప్రముఖులతో బీఆర్‌ఎస్ ప్రముఖులకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పయ్యావుల కేశవ్‌తో ఒకప్పటి అనతపురం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కేసీఆర్‌కు సత్సంబంధాలుండేవి. ఇక ఎమ్మెల్యేలకయితే లెక్కలేదు. ఎందుకంటే వారంతా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కలసి పనిచేసిన వారే.
కానీ వారెవరూ తాము గెలిచిన తర్వాత, ఇప్పటిదాకా బీఆర్‌ఎస్ నేతలను కలిసిన దాఖలాలు లేవు. ఏదైనా వివాహా కార్యక్రమాల్లో కలిస్తే మినహాయించి, ‘మర్యాదపూర్వకం’గా వారితో కలిసిన దాఖలాలు భూతద్దం వేసినా కనిపించదు. మరి టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు ఒక్కరికే ఈ మినహాయింపు ఎందుకు? ఆయనకు చానెల్ చైర్మన్ హోదాలో ఆ పదవి ఇచ్చినప్పటికీ, అది టీ డీపీ పార్టీపరంగా ఇచ్చిన పదవి అన్నది విస్మరించకూడదన్నది తమ్ముళ్ల ఉవాచ. ఒకవేళ తమ్ముళ్లలో ఎవరైనా.. అలాంటి ‘మర్యాద పూర్వక కలయిక ఎవరైనా చేసి ఉంటే, ఈపాటికి వారికి శిరచ్ఛేదనమయ్యేదే! బహుశా ఆయన నాయుడు గారు కాబట్టి మినహాయింపు ఇచ్చి ఉంటారు కామోసు!
అయితే ప్రముఖుల ఇళ్లకు గడప గడపకూ ఆ ‘మర్యాదపూర్వక కలయిక’ కార్యక్రమమేదో, భక్తుల ఇళ్లకు వెళ్లి.. కొండపై సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీసి ఉంటే, నాయుడు గారికి మరింత సమాచారం వచ్చి ఉండేది. ఫలితంగా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆ పర్యటన అక్కరకొచ్చేది. అది చైర్మన్‌గా ఆయన విజయానికి అక్కరకొచ్చేది.
అంటే.. కొండపై మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? దర్శనం బాగా జరిగిందా? లడ్డు, ప్రసాదం నాణ్యత బాగుందా? బాగోలేదా? మీకు సమయానికి ఫలహారం అందిందా? మెట్ల మార్గంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? దర్శనం త్వరగా కావాలంటే ఏం చేయాలి? కొండపై ఉన్న హోటళ్లలో నాణ్యత ఎలా ఉంది? కాటేజీల్లో సమస్యలేమైనా ఎదుర్కొన్నారా? ఇంకా ఏం చేస్తే బాగుంటుందని.. జర్నలిస్టు అవతారమెత్తి, భక్తుల ఆధార్‌కార్డు ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లి కుశలప్రశ్నలు వేసి ఉంటే బాగుండేదన్నది భక్తకోటి ఉవాచ.
అందుకు భిన్నంగా వీఐపీల వద్దకు వెళితే ఏం ప్రయోజనం? ఆ పరిచయాలను ఆధారం చేసుకుని, రేపు వారు దర్శనాలకు లెటర్లు అడగటం తప్ప?! ఇవీ టీడీపీ సోషల్‌మీడియా సైనికుల మధ్య జరుగుతున్న చర్చ!! మీకు అర్ధమవుతోందా?