– ‘పుష్ప’-2 బెనిఫిట్‌షోలో ఒక ప్రాణం పోవడం బాధించింది
– హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా?
– మనిషి ప్రాణం తీసుకొస్తారా?
– బాధితులకు 25 లక్షలు ఇవ్వా లి
– బెన్‌ఫిట్‌షోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం
– తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్ : ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీసుకొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా.. బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సినిమా హీరోకి , ప్రొడ్యూసర్స్‌కు చెప్తున్న. వాళ్ళని ఆదుకోండి అని సూచించారు.
కాగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ కు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి.