Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ ఉత్ప‌త్తి ఎంత ముఖ్య‌మో.. ఆదా చేయ‌డ‌మూ అంతే ముఖ్యం

– ఇంధ‌న పొదుపు వినూత్న కార్య‌క్ర‌మాల‌తో జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు
– గ‌త అయిదేళ్ల‌లో విద్యుత్ డిపార్టుమెంట్‌ను సంక్షోభంలోకి నెట్టారు
– విద్యుత్ శాఖ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళిస్తున్నాం.
– ఛార్జీల భారం లేకుండా డిపార్టుమెంట్ స‌మ‌ర్థ‌త‌ను పెంచి.. న్యాయం చేస్తాం
– గ్రీన్ ఎన‌ర్జీని, సౌర, ప‌వ‌న విద్యుత్‌ల‌నూ పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం
– ఎన‌ర్జీ యూనివ‌ర్సిటినీ ఏర్పాటు చేస్తాం.
– వ‌చ్చే అయిదేళ్ల‌లో ప‌ది ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డులు వ‌స్తాయి.
– ఏడు ల‌క్ష‌ల 50 వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారంచుట్టాం
– 2047 నాటికి ప్ర‌జల ఆదాయం 15 రెట్లు పెరిగేలా కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం
– ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం కావాలంటే ప్ర‌జ‌ల్లో పెద్దఎత్తున చైత‌న్యం రావాలి
– ఇంధ‌న సామ‌ర్థ్యాన్ని పెంచే గొప్ప కార్య‌క్ర‌మంలోని ఊర్జావీరులంద‌రికీ అభినంద‌న‌లు
– భ‌విష్య‌త్తులో అవ‌స‌ర‌మైతే ప్ర‌తి 30 కి.మీ. ఒక ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్ పెట్టేదిశ‌గా చొర‌వ తీసుకుంటున్నాం.
– ఏపీ-ఇంధ‌న సామ‌ర్థ్య కార్య‌క్ర‌మం-ఊర్జావీర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో
ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు

పోరంకి: శ‌నివారం కృష్ణాజిల్లా పోరంకిలోని ముర‌ళీ రిసార్ట్ క‌న్వెన్ష‌న్‌లో కేంద్ర విద్యుత్ శాఖ, ఎన‌ర్జీ ఎఫీషియ‌న్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌), ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఏపీ-ఇంధ‌న సామ‌ర్థ్య కార్య‌క్ర‌మం-ఊర్జావీర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో గౌర‌వ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు నారాచంద్ర‌బాబు నాయుడు, గౌర‌వ కేంద్ర విద్యుత్‌, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రివ‌ర్యులు మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్.. ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు.

తొలుత విద్యుత్‌ను ఆదాచేసే ఉప‌క‌ర‌ణాలను ప్ర‌ద‌ర్శించి అధికారులు వివ‌రించారు. ఇంధ‌న సామ‌ర్థ్య పెంపు విధానాల ఫ‌లితాల‌ను వివ‌రించారు. అనంత‌రం జ్యోతిప్ర‌జ్వ‌ల‌న‌తో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌తి మ‌నిషినీ ఇంధ‌న సామ‌ర్థ్య ఛాంపియ‌న్‌గా తీర్చిదిద్దే కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌తిబింబించే కార్య‌క్ర‌మాల ఏవీని ప్ర‌ద‌ర్శించారు.

క‌రెంటు బిల్లుల భారాన్ని త‌గ్గించి.. ఆర్థిక చేయూత‌నందించి, ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త‌కు దోహ‌దం చేసే ఇంధ‌న పొదుపు ఉప‌క‌ర‌ణాలు, న‌వ ఆవిష్క‌ర‌ణ‌ల స‌మాహారాన్ని అతిథుల ముందు ఆవిష్క‌రించారు.
ప‌ర్యావ‌ర‌ణానికి తూట్లు పొడుస్తున్న క‌ర్బ‌న ఉద్గారాల‌ను భారీగా త‌గ్గించే భార‌త ప్ర‌భుత్వ ల‌క్ష్యాలను వివ‌రించారు. అనంత‌రం ఊర్జావీర్ టూల్ కిట్‌ల‌ను ఆవిష్క‌రించారు. ఊర్జావీర్ స‌ర్టిఫికెట్లు ప్ర‌దానంచేశారు.

అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు విద్యుత్‌ను ఆదాచేసే ఇండ‌క్ష‌న్ కుక్ సెట్ల‌ను అంద‌జేశారు. కేంద్ర గృహనిర్మాణం, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌- ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్‌యోజ‌న 2.0 స్కీమ్‌పై కుదిరిన ఎంవోయూ ప‌త్రాల‌ను ఇరు ప‌క్షాల అధికారులు అందుకున్నారు. ఇంధ‌నాన్ని ఆదాచేసే ప‌రిక‌రాల‌ను అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర‌ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన శాఖ‌ల‌ను మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్ నిర్వ‌హిస్తున్నార‌ని.. ఆయ‌న నేతృత్వంలోని ఇంధ‌నం, గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ‌లు విక‌సిత్ భార‌త్ – 2047 సాకారానికి చాలా కీల‌క‌మైన‌వ‌ని పేర్కొన్నారు. ల‌క్షమంది ఊర్జావీర్‌ల‌ను ప్ర‌మోట్ చేయాల‌నుకుంటే వారంలోనే 12 వేలమంది ఆన్‌లైన్లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని.. దీన్నిబ‌ట్టి చూస్తే ఇంటిద‌గ్గ‌ర కూర్చొని డ‌బ్బులు సంపాదించే ప‌రిస్థితికొస్తున్నార‌ని అన్నారు. ఇది శుభ‌ప‌రిణామ‌మ‌ని.. రిజిస్ట‌ర్ అయిన ఊర్జావీర్‌లంద‌రినీ మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్న‌ట్లు చెప్పారు.

విద్యుత్‌ను ఆదాచేసే ఇండ‌క్ష‌న్ కుక్ సెట్‌ల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల అంగ‌న్వాడీ కేంద్రాల్లో చాలా సుల‌భంగా త‌క్కువ స‌మ‌యంలో వంట‌చేసే అవ‌కాశ‌ముంటుంద‌న్నారు. ప్ర‌జ‌లు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. ఇలా అంద‌రూ క‌లిసి ఈరోజు ఓ మెగా ఈవెంట్‌ను నిర్వ‌హించామ‌ని.. 43 వేల పాఠ‌శాల‌ల్లో ఒకేరోజు ఒకే స‌మ‌యంలో ఉపాధ్యాయులు- త‌ల్లిదండ్రుల స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం ప్ర‌పంచంలోనే మొద‌టిసారని పేర్కొన్నారు.

ఇదేరోజు మ‌రో ముఖ్య కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనైనా త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం అనేది ఆ రాష్ట్ర ప్ర‌గ‌తికి చిహ్న‌మ‌ని, క‌రెంట్ వినియోగంతో త‌ల‌స‌రి ఆదాయం అనేది అనుసంధాన‌మై ఉంటుంద‌న్నారు. అందుకే ఇంధ‌న రంగానికి చాలా ప్రాధాన్యం ఉంద‌ని.. ప‌వ‌ర్ లేకుంటే ఏదీ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి అని పేర్కొన్నారు.

ఇంకా ఏమ‌న్నారంటే.. 1998లో విద్యుత్ రంగ సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చాన‌ని.. దేశంలో ఎవ‌రూ చేయ‌ని సాహసం చేశాన‌ని, దేశంలో మొద‌టిసారిగా విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో ఏపీని నెం.1గా చేసే బాధ్య‌త ఎన్‌డీఏ ప్ర‌భుత్వం తీసుకుంటుందని తెలియ‌జేస్తున్నాను. 2016లో వ‌ర‌ల్డ్ బ్యాంకు ఏపీకి మొద‌టి స్థానం ఇచ్చారు. ఆనాడు ఏపీ స్టేట్ ఎన‌ర్జీ క‌న్జ‌ర్వేష‌న్ మిష‌న్‌కు వివిధ అవార్డులు వ‌చ్చాయి. ఉజాలా ప‌థ‌కం ద్వారా 2.20 కోట్ల ఎల్ఈడీ బ‌ల్బుల‌ను పంపిణీ చేశాం.

మూడు ల‌క్ష‌ల 23 వేల ఇంధ‌న పొదుపు ఫ్యాన్లు ఇచ్చాం. ల‌క్షా 45 వేల ట్యూబ్‌లైట్లు ఇచ్చాం. 26 ల‌క్ష‌ల 59 వేల ఇంధ‌న సామ‌ర్థ్య వీధిలైట్ల‌తో ఎక్క‌డిక‌క్క‌డ సెన్స‌ర్లు పెట్టి అన్ని గ్రామాల్లోనూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం వెలుగులు నింపింది. 68 వేల 171 నాన్ ఐఎస్ఐ పంపుసెట్ల‌ను ఎన‌ర్జీ ఎఫీషియ‌న్సీ పంపుసెట్లుగా క‌న్వ‌ర్ట్ చేశాం. ఒక యూనిట్ క‌రెంటును ఆదా చేస్తే రెండు యూనిట్ల క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్లు.. ఈ విష‌యాన్ని ప్ర‌తిఒక్క‌రూ గుర్తుపెట్టుకోవాలి. స‌మ‌ర్థ‌వంతంగా విద్యుత్‌ను ఉప‌యోగించుకుంటే వాతావ‌ర‌ణాన్ని కాలుష్యంబారిన ప‌డ‌కుండా చూడొచ్చు. 12 వేల మంది రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని.. ఆన్‌లైన్లో శిక్ష‌ణ తీసుకున్నార‌ని, కొందరు ఊర్జావీరులైతే కార్య‌క‌లాపాలు కూడా ప్రారంభించార‌ని పేర్కొన్నారు.

ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా వినూత్న కార్య‌క్ర‌మాల ద్వారా ఇంటివ‌ద్దే ఉండి డ‌బ్బులు సంపాదించే మార్గం చూపిస్తాన‌ని చెప్పాన‌ని.. అందులో ఇది మొద‌టి మెట్టు అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఫ్లెక్సిబుల్ వ‌ర్కింగ్ వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచానికి సేవ‌లందించే అవ‌కాశం భార‌త‌దేశానికి ఉంద‌ని.. అందులో మొద‌టి స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంటుంద‌ని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం, వ‌ర్క్ స్టేష‌న్ల క్రియేష‌న్‌.. ఇలా వివిధ విధానాల‌ను తెస్తాం. స్కిల్ అప్‌గ్ర‌డేష‌న్‌, కొత్త టెక్నాల‌జీల‌తో ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని.. దీనివ‌ల్ల ఆదాయాలు పెరుగుతాయ‌ని పేర్కొన్నారు.

అంగ‌న్వాడీల‌కు అంద‌జేసిన ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌లు సుర‌క్షిత‌మైన‌వని.. తేలిగ్గా శుభ్రం చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. 26 జిల్లాలో 55 వేల 607 అంగ‌న్వాడీల‌కు ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌లు ఇస్తున్నామ‌ని, రెండు నెల‌ల్లో అన్ని అంగ‌న్వాడీల‌కు వీటిని అందించే బాధ్య‌త ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని తెలియ‌జేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. వీటివ‌ల్ల 20 శాతం నుంచి 30 శాతం వ‌ర‌కు విద్యుత్ ఆదా అవుతుంద‌న్నారు.

వినూత్న విధానాల‌తో పెద్దఎత్తున విద్యుత్ ఆదా
పీఎంఏవై కింద ఇళ్లు క‌ట్టుకున్న ల‌బ్ధిదారుల‌కు ఈ రోజు విద్యుత్‌ను ఆదాచేసే బ‌ల్బులు వంటివి ఉచితంగా ఇచ్చామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఇలాంటివాటివ‌ల్ల పెద్దఎత్తున క‌రెంటు ఆదా అవుతుంద‌న్నారు. ఎన‌ర్జీ సేవింగ్ స్ట‌వ్‌పై మీరు పెట్టిన పెట్టుబ‌డి ఏడాదిలోనే తిరిగివ‌స్తుంద‌ని.. ఫ్యానుకు అయితే రెండేళ్ల మూడు నెల‌లు ప‌డుతుంద‌ని, ఎల్ఈడీ బ‌ల్బు అయితే రెండు నెల‌ల్లోనే పెట్టుబ‌డి తిరిగివ‌స్తుంద‌ని వివ‌రించారు. ట్యూబ్‌లైట్‌కు నాలుగు నెల‌లు, ఏసీ అయితే నాలుగేళ్లలో వ‌స్తుంద‌న్నారు. ఇలా వివిధ ఇంధ‌న సామ‌ర్థ్య ఉప‌క‌ర‌ణాలు ఉప‌యోగిస్తే ప్ర‌తి ఇంట్లోనూ దాదాపు 20 శాతం క‌రెంటు ఆదా అవుతుంద‌ని పేర్కొన్నారు.

వినూత్న విధానంతో పీఎం సూర్య‌ఘ‌ర్ కార్య‌క్ర‌మం ద్వారా ఇంటిపైనే సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాల్ చేసి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చు. ఇలాంటి వాటివ‌ల్ల విద్యుత్ ఛార్జీల భారం త‌ప్పుతుంద‌న్నారు. రాయితీతో సోలార్ పంపుసెట్టు వ‌ల్ల కూడా ఇదేవిధ‌మైన ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నారు. అద‌న‌పు క‌రెంట్‌ను ఎల‌క్ట్రిసిటీ బోర్డుకిస్తే డ‌బ్బులు కూడా వ‌స్తాయ‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్ర‌తిఒక్క‌రూ ఇళ్ల‌వ‌ద్ద‌, పొలాల్లో క‌రెంట్‌ను ఉత్ప‌త్తిచేసే ప‌రిస్థితి రావాల‌ని.. విద్యుత్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా సంస్థ‌లు గ్రిడ్‌ను మేనేజ్ చేసే ప‌రిస్థితి ఉండాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఖ‌ర్చు త‌గ్గాలి.. ప్ర‌జ‌ల ఆదాయం పెర‌గాలి.. మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలు రావాల‌నే ఉద్దేశంతో అనేక కార్య‌క్ర‌మాల‌కు నాందిప‌లుకుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుత ఫ‌లితాలు
సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని.. త్వ‌ర‌లోనే ఒక మెసేజ్ వాట్సాప్‌లో పెడితే చాలు.. ఆ ప‌ని పూర్త‌వుతుంద‌ని.. ఇంతేకాకుండా ఆ ప‌నిచేయ‌క‌పోతే సంబంధిత వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇందుకు ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉప‌యోగిస్తామ‌ని తెలిపారు. పాత గ‌వ‌ర్న‌మెంటు చేసిన ప‌నుల‌ను చ‌క్క‌దిద్దేందుకు ఈరోజు రెవెన్యూ స‌ద‌స్సులు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఒక‌రోజులోనే 12వేల పిటిష‌న్లు వ‌చ్చాయన్నారు. గ‌డ‌చిన అయిదేళ్ల‌లో విద్యుత్ రంగం మొత్తం దెబ్బ‌తింద‌న్నారు.

ఎక్క‌డెక్క‌డో అప్పులు చేశారు. అధిక ధ‌ర‌కు క‌రెంటును కొని విద్యుత్ శాఖ‌ను సంక్షోభంలోకి నెట్టేశారు. క‌రెంటు ఛార్జీలు పెంచి రూ. 33 వేల కోట్ల అద‌న‌పు భారం వేశారు. ల‌క్షా 29 వేల 503 కోట్ల రూపాయ‌లు డిపార్టుమెంటుకు న‌ష్టం వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. క‌రెంటు ఛార్జీలు పెంచ‌కుండా ఈ విభాగం స‌మ‌ర్థ‌త‌ను పెంచి న్యాయంచేసే బాధ్య‌త తీసుకుంటామ‌ని హామీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. గ్రీన్ ఎన‌ర్జీని, సోలార్ ఎన‌ర్జీని ప్రోత్స‌హిస్తున్నాం.

ప‌వ‌న విద్యుత్‌తోపాటు పంప్డ్ ఎన‌ర్జీకి ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. పీఎం సూర్యఘ‌ర్‌తో ఇంటి పైక‌ప్పుపై సోలార్ ప్యానెల్ ఇన్‌స్ట‌లేష‌న్ చేసి విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకునేలా ప్రోత్స‌హిస్తాం.. వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు సంబంధించి పీఎం కుసుమ్ ప‌థ‌కం ద్వారా కూడా ముందుకెళ్తామ‌ని తెలిపారు. రైతుల‌కు వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇస్తున్నామ‌ని.. ఎల్ఈడీ బ‌ల్బుల నిర్వ‌హ‌ణ‌కు ఇటీవ‌ల రూ. 150 కోట్లు మంజూరు చేశామ‌ని వివ‌రించారు.

గ్రీన్ హైడ్రోజ‌న్‌పై ప్ర‌త్యేక దృష్టి
రాష్ట్రంలో ఏడాదికి 1.5 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తిని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నామ‌ని.. ఇటీవ‌లే గ్రీన్ ఎనర్జీ పాల‌సీని రిలీజ్ చేశామ‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. 78.5 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు, 35 గిగావాట్ల ప‌వ‌న్ విద్యుత్ దిశ‌గా వెళుతున్నామ‌ని వివ‌రించారు. 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఎన‌ర్జీపైనా దృష్టిసారిస్తున్నామ‌ని.. బ‌యో సీబీజీని రోజుకు ప‌దివేల ట‌న్నులు ఉత్ప‌త్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు తెలిపారు. ఎక్క‌డిక‌క్క‌డ ఛార్జింగ్ స్టేష‌న్లు పెట్టాల‌ని.. క‌నీసం 5 వేలు ఏర్పాటు చేయాల‌ని.. అవ‌స‌ర‌మైతే ప్ర‌తి 30 కి.మీ. ఒక ఛార్జింగ్ స్టేష‌న్ పెట్టి ఎక్క‌డా ఇబ్బంది లేకుండా చూడాల‌నేది ల‌క్ష్యంగా ఉంద‌ని.. అన్ని వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాలుగా మార్చాల‌నేది లక్ష్యం.

ఎన‌ర్జీ యూనివ‌ర్సిటీ పెడ‌తామ‌ని పేర్కొన్నారు. అన్నింటికంటే అత్యంత కీల‌క‌మైన శాఖ విద్యుత్ శాఖ అని.. ఈ డిపార్ట్‌మెంట్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌కుంటే ఆర్థిక వ్య‌వ‌స్థ కుంటుప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో విద్యుత్ డిపార్ట్‌మెంట్‌ను స‌మూల ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని తెలిపారు. కొత్త విధానంతో రాబోయే అయిదేళ్ల‌లో ప‌ది ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని.. 7 ల‌క్షల‌ 50 వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశముంద‌న్నారు. దీనికి శ్రీకారంచుట్టామ‌ని తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ఎన్‌టీపీసీ, జెన్‌కో రెండూ క‌లిసి దాదాపు రెండుల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయ‌న్నారు.

దీనివ‌ల్ల ల‌క్షా 22 వేల 500 మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. గ్రీన్ కో, రిల‌యెన్స్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయ‌న్నారు. క‌రెంటును ఉత్ప‌త్తి చేయ‌డం ఎంత ముఖ్య‌మో ఆదా చేయ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌న్నారు. దేశ ప్ర‌ధాన‌మంత్రి విక‌సిత్ భార‌త్ కోసం స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక పెట్టుకున్నార‌ని.. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర విజ‌న్‌ను నిర్దేశించుకుంద‌ని వివ‌రించారు. 2047 నాటికి ఆదాయం 15రెట్లు పెరిగేలా కార్య‌క్ర‌మానికి శ్రీకారంచుట్టామ‌ని.. అది జ‌ర‌గాలంటే మీలో చైత‌న్యం రావాల‌ని సూచించారు. రాష్ట్రంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని గౌర‌వ కేంద్ర‌మంత్రిని కోరుకుంటున్న‌ట్లు చెబుతూ ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

LEAVE A RESPONSE