Suryaa.co.in

Editorial

ఇక చాలుదొరా!

  • యనమల లేఖపై పార్టీలో అసంతృప్తి

  • బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని నేతల ఆగ్రహం

  • మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములను బీసీలకు ఎందుకు ఇప్పించలేదన్న ప్రశ్నలు

  • యనమల మంత్రిగా ఉన్నప్పుడే కెవిరావుకు భూములు ఇచ్చిన వైనం

  • అప్పుడు క్యాబినెట్‌లో ఎందుకు వ్యతిరేకించలేదంటున్న నేతలు

  • రాజ్యసభ, గవర్నర్ పదవులు రాదన్న నిర్వేదంతోనే లేఖ రాశారంటున్న టీడీపీ వర్గాలు

  • కూతురు, వియ్యంకుడు, అల్లుడికి పదవులిచ్చిన వైనం విస్మరించారా అంటున్న నేతలు

  • యనమల కుటుంబానికి ఇంకా ఎన్ని పదవులిస్తారన్న చర్చ

  • లేఖలో కమ్మ-బీసీ కులాల మధ్య విభజనకు వ్యూహమంటున్న నేతలు

  • కెవిరావు, దివీస్ మురళిని చౌదరి అంటూ పేర్కొన్న యనమల

  • నాయకత్వం ఇకనైనా మారాలంటున్న నేతలు

  • పార్టీ సొంత పత్రిక ‘చైతన్యరథం’ లోనూ యనమల లేఖ వార్త రావడంపై నేతల విస్మయం

  • మీడియా గ్రూపులో పెట్టిన మెసేజే ‘సాక్షి’కి వార్తగా మారిన వైనంపై ఆశ్చర్యం

  • టీడీపీ వర్గాల్లో యనమల ‘లేఖ’లకలం

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగుదేశంలో కొత్త కుదుపు. సీనియర్ నేత, పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా వివిధ హోదాలు అనుభవించిన మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుపై సంధించిన అసంతృప్తి లేఖ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది.

అసలు దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది యనమల, కింజరాపు కుటుంబాల కోసమేనన్న భావన, పై నుంచి కింది స్థాయి వర్గాలకూ ఉంది. అంటే యనమల రామకృష్ణుడు, కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబాలు అనుభవించినన్ని పదవులు, మరే ఇతర సీనియర్లు అనుభవించలేదన్న చర్చ దశాబ్దాల నుంచి వినిపిస్తున్నదే. గతంలో ఎర్రన్నాయుడు, తర్వాత ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌నాయుడు, ఆయన మామ-ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, బావ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అంతకుముందు ఆయన భార్యకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అలాంటి యనమల రామకృష్ణుడు కాకినాడ సెజ్ భూములు కేంద్రంగా.. బీసీ కార్డు సంధించడం పార్టీ వర్గాలను సహజంగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇది తిరుగుబాటా? లేక పార్టీ నాయకత్వంలో మారిన విధానాలపై అసంతృప్తితో ఉన్న సీనియర్లను కూడగట్టే వ్యూహమా? లేక తన అసంతృప్తి లేఖతో పరిమితమా అన్నది చూడాలి.

‘‘ కాకినాడ సెజ్ ద్వారా కెవి రావు చౌదరి వేలు కోట్లు సంపాదించారు. కానీ దానివల్ల బీసీ రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. కాకినాడ సెజ్‌లో ఆయనకు చెందిన బడా కంపెనీలు తక్కువ ధరలకు పొంది, తర్వాత వాటిని జీఎంఆర్‌కు వందలకోట్లను అమ్మారు. తర్వాత వాటిని మరో కంపెనీకి అమ్మి 4 వేల కోట్లు సంపాదించారు. సెజ్‌లో పరిశ్రమ స్థాపనకు దివీస్ (మురళీచౌదరి)తో భారీగా భూములు పొంది, భారీ ప్రయోజనాలు పొందాయి. కానీ బీసీ కులాలకు చెందిన రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు.

కోన అటవీ ప్రాంతాలకు చెందిన ప్రజలు, కాకినాడ సెజ్ వల్ల వెయ్యి ఎకరాలు నష్టపోయారు. వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై నేను ఇప్పటికే చెన్నై ఎన్జీటీ, సీఎం, కేంద్ర పర్యావరణ శాఖ, ఏీపీపసీబీకి లేఖ రాశా. కానీ అవి రాజకీయ నియంత్రణలో ఉన్నాయి’’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో యమనల పేర్కొన్నారు. అంటే వాటిని కూడా పార్టీ నియంత్రిస్తోందని యనమల తన లేఖలో చెప్పకనే చెప్పినట్టయింది.

కెవిరావుకు సైతం సెజ్‌లో నష్టపోయిన రైతులకు న్యాయం చేయలేదని యనమల ఆరోపించారు. ‘ఆయన ఆ భూములు మార్కెటింగ్ చేసుకుని వెయ్యి కోట్ల వరకూ సంపాదించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీలు నష్టపోతుండగా, ధనికులు మాత్రం బాగుపడుతున్నారని వ్యాఖ్యానించారు. బీసీలు రాజకీయాలు, సంపద సృష్టిలోనూ నష్టపోతున్నారు. బీసీ రైతులు, మత్య్సకారులను బిగ్‌షాట్స్ నుంచి రక్షిస్తేనే నిజమైన ప్రజాసామ్యం ఉంటుంద’ని యనమల తన లేఖలో స్పష్టం చేశారు.

రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో సీనియర్ నేత యనమల రాసిన లేఖ చర్చనీయాంశమయింది. అయితే ఈ లేఖను టీడీపీ మీడియా గ్రూపులో పోస్టు చేయడం, వైసీపీ అధికార మీడియా సాక్షికి ఆయుధంగా మారింది. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే… టీడీపీ అధికార డిజిటల్ మీడియా చైతన్యరథంలో కూడా యనమల లేఖ రావడం ఆశ్చర్యం.

కాగా.. సోమవారం రాజ్యసభ సభ్యుల అభ్యర్ధులను ప్రకటించనున్న సమయంలో, యనమల అదనుచూసి లేఖ రాయడం చర్చనీయాంశమయింది. కాకినాడ జిల్లాకే చెందిన పారిశ్రామికవేత్త సాన సతీష్ పేరు దాదాపు ఖాయమైందని, ఆయన మోపిదేవి వెంకటరమణతో ‘మాట్లాడుకున్న’ తర్వాతనే రాజీనామా చేసినందున, ఆ సీటు సతీష్‌కే ఇస్తారన్న ప్రచారం ఉంది. ఆ మేరకు పార్టీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాయకత్వం తూర్పు గోదావరి జిల్లా పార్టీని సతీష్‌కు అప్పగించం కూడా, యనమలకు రుచించడం లేదంటున్నారు. ఇన్ని దశాబ్దాలు జిల్లా పార్టీని శాసించిన తనను పక్కనబెట్టి, అసలు ఎవరూ తెలియని సతీష్‌కు జిల్లా పార్టీ పెత్తనం అప్పగిండం, సీనియర్ నేతగా ఆయన అహం దెబ్బతీసినట్టయిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ సూత్రప్రాయంగా అంగీకరించింది. దానిని సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే రాజ్యసభపై ఎప్పటినుంచో ఆశ పెట్టుకున్న యనమలకు ఇది రుచించలేదని, అందుకే అదనుచూసి బాబుపై అసంతృప్తి లేఖాస్త్రం సంధించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే యనమల రాజ్యసభ సీటు ఆశించగా, అప్పుడు దానిని సీఎం రమేష్‌కు ఇచ్చారు.

కాగా యనమల లేఖపై పార్టీలోని అన్ని వర్గాలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ సోషల్‌మీడియా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అలాంటి లేఖ ఇప్పటిదాకా ఎలాంటి పదవులు రానివారు రాస్తే క్యాడర్ స్వాగతించేదని, కానీ పార్టీ పుట్టిన నుంచి ఇప్పటివరకూ అన్ని పదవులూ అనుభవించిన.. యనమల వంటి సీనియర్ నాయకుడే రాయడం సహించకూడదంటున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో లేనప్పుడు కూడా యనమల అధికారం అనుభవించారని నేతలు గుర్తుచేస్తున్నారు.

పార్టీలో కమ్మ-బీసీ కుల విభజన తీసుకురావడమే ఆయన లక్ష్యమని లేఖ స్పష్టం చేస్తోందని మరికొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కెవిరావు చౌదరి, దివీస్ మురళి చౌదరి అంటూ పేర్కొనడమే దానికి నిదర్శమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటిదాకా వైసీపీ అధికార మీడియా సాక్షి కూడా కెవి రావు చౌదరి, మురళీచౌదరి అని రాయలేదని గుర్తు చేస్తున్నారు.

‘‘ఆయనకు స్పీకర్, పొలిట్‌బ్యూరో, మంత్రి, ఎమ్మెల్సీ పదవులిచ్చారు. ఆయన కూతురికి నిన్నటి ఎన్నికల్లో సీటిచ్చారు. అంతకుముందు తమ్ముడు కృష్ణుడికి తుని ఇన్చార్జి ఇచ్చారు. వియ్యంకుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌కు ఎమ్మెల్యే, ఆయన కొడుకు మహేష్‌కు ఏలూరు ఎంపీ సీటిచ్చారు. అంతకుముందు సుధాకర్‌యాదవ్ ఇరిగేషన్ కాంట్రాక్టులు, టీటీడీ చైర్మన్ పదవులిచ్చారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కార్పొరేషన్ ఎండీగా ఆయన అల్లుడిని నియమించుకున్నారు. యనమలను పార్టీ ఫ్లోర్‌లీడర్‌ను చేశారు. అసలు యాదవుల బలం లేని తూర్పుగోదావరి జిల్లాలో పార్టీని ఆయనకే అప్పగించారు. పార్టీకి విధేయులుగా ఉన్న యాదవులయిన బీద ర విచంద్ర వంటి నేతలకు సైతం ఇవ్వని అవకాశాలు, బీసీ-యాదవ కోటాలో యనమల అనుభవించారు.

జిల్లాలో సీనియర్లయిన బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రును కాదని, ఆయనకే పార్టీని ధారాదత్తం చేశారు. నిజాయతీపరుడిగా పేరున్న బుచ్చయ్యచౌదరి తనకు పార్టీలో అన్యాయం జరుగుతున్నప్పటికీ, ఇప్పటికీ పార్టీ కోసం వాటిని మౌనంగా భరిస్తున్నారు. అంటే యనమల కుటుంబం, పార్టీ వల్ల ఎంత లబ్ధిపొందిందో అర్ధమవుతోంది. అలాంటి యనమల ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందని లేఖ రాయడమే విచిత్రం. అంటే తనకు రాజ్యసభ సీటుగానీ, గవర్నర్ పదవి గానీ రాదని నిర్ధారించుకునే ఆయన ఈ లేఖ రాసినట్లు కనిపిస్తోంద’’న్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తనకు అవకాశాలు రాకపోతే బీసీలకు అన్యాయం జరిగినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. తనను సీఎంను చేయడంలో యనమల కీలకపాత్ర, సహాయం చేశారన్న చంద్రబాబులోని ఏకైక బలహీనత-కృతజ్ఞతను.. యనమల ఇప్పటిదాకా తన రాజకీయ ఉన్నతికి వాడుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నిజానికిప్పుడు కేవీరావుపై వ్యతిరేకంగా లేఖ రాసిన యనమల మంత్రిగా ఉన్నప్పుడే, సెజ్‌కు అనుమతులు వచ్చాయని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అప్పుడు మంత్రిగా ఉన్న యనమల, క్యాబినెట్‌లో దానిని ఎందుకు వ్యతిరేకించలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

‘‘ఇప్పుడు జీఎంఆర్‌కు వ్యతిరేకంగా లేఖ రాశారు బాగానే ఉంది. కానీ కాకినాడలో ఆయన గెస్ట్‌హౌస్ కట్టించింది ఎవరు? సెజ్‌కు అనుమతుల తర్వాత ఏం జరిగిందో, ఎవరు ఎవరిని కలిశారో మాకు తెలియదా? జిల్లాలో ఆయన వల్ల ఎంతమంది సీనియర్లు నష్టపోయారో మాకు తెలియదా? ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అన్నీ మాట్లాడ తాం’’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

సీనియర్ల అసంతృప్తికి ఆయుధమయ్యారా?

ఇదిలాఉండగా.. గత ఆరునెలల నుంచీ పార్టీ నాయకత్వంలో మారిన విధానంపై వ్యతిరేకతతో ఉన్న సీనియర్లను కూడగట్టేందుకే, యనమల ఈ లేఖ రాశారన్న మరో చర్చ కూడా జరుగుతోంది. గత ఆరునెలల నుంచి సీనియర్లను వ్యూహాత్మకంగా పక్కకు తప్పించడంతోపాటు, వారికి అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వని నాయకత్వ కొత్త విధానంపై, సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. పాత తరాన్ని పక్కకుపెట్టి, కొత్త తరాన్ని తెచ్చుకుని వారితో పార్టీ నడిపిద్దామన్న నాయకత్వ వైఖరి సీనియర్లకు నచ్చడం లేదు.

తమకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం, ఇచ్చినా తమ వెంట వచ్చేవారిని ఆపేయడం, తమ ఫోన్లు తీయకపోవడం సీనియర్లకు ఆగ్రహం కలిగిస్తోంది. అసలు పార్టీ నాయకులకు బాబు-లోకేష్ నెలల తరబడి అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం, తమ ప్రమేయం లేకుండానే తమ నియోజకవర్గాల నాయకులకు పదవులివ్వడం సీనియర్లకు మింగుడుపడటం లేదు.

పైగా ఎన్నికల ముందు పొలిట్‌బ్యూరోలో చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకునే సంప్రదాయాన్ని పక్కకుపెట్టి, ఏకపక్ష నిర్ణయాలు ప్రకటించడం ద్వారా, పార్టీ కేసీఆర్-జగన్ బాటలో వెళుతోందన్న చర్చ సీనియర్ల మధ్య చాలాకాలం నుంచి జరుగుతోంది. జగన్-కేసీఆర్ ఎవరినీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకునే వారు కాబట్టి, తామూ అదే దారిన వెళదామని నాయకత్వం నిర్ణయించిందన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తున్నవే. ఈ అసంతృప్తిని గమనించిన యనమల.. వారిని కూడగట్టే వ్యూహంలో భాగంగానే లేఖాస్త్రం సంధించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
NCB-Garu

LEAVE A RESPONSE