– ధాన్యం రైతుకు కనీసం మద్దతు ధర కల్పించలేని దుస్థితి
– తొక్కిసలాటలో ఒక మరణానికి కారణమంటూ అల్లు అర్జున్ అరెస్ట్
– గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది ప్రాణం బలి
– అందుకు పూర్తిగా అప్పటి సీఎం చంద్రబాబే కారణం
– మరి అందుకు ఆయన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?
– ఇంకా ఇరుకు సందులో మీటింగ్‌కు ఏడుగురు బలి
– చీరల పంపిణీలో మరో ముగ్గురి ప్రాణాలు పోయాయి
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి
తాడేపల్లి: మోసం చేయడమే చంద్రబాబు నైజం అని, ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన హామీలేవీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషయం ఆరు నెలల్లోనే తేలిపోయిందని ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాలను వంచించాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఆక్షేపించారు.
అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. రైతులకు ప్రకటించిన రూ.20 వేల పెట్టుబడి సాయం లేదు. వారికి తగిన విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఎలాగోలా కష్టపడి పంట పండించినా ఇప్పుడు ధాన్యం సేకరణ సక్రమంగా లేదు. కనీస మద్దతు ధర అంతకన్నా లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తేమ శాతం పేరుతో రైతును దోచుకుంటున్నారు.
పంటలకు కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దళారులు, మిల్లర్లు కలిసి రైతు కష్టాన్ని దోచుకు తింటున్నారు. కర్నూలులో టమోట రైతు 50 పైసలకు తెగనమ్ముతుంటే, హెరిటేజ్‌తోపాటు బయట మార్కెట్‌లో కేజీ రూ.50 పెట్టి కొనాల్సి వస్తోంది. బాబు పాలనలో ఇంత దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. 75 కేజీల ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1725 ఎక్కడా లభించడం లేదు. ప్రతి బస్తాపై రైతులు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు.
హైదరాబాద్‌లో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే, హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తొక్కిసలాటకు 29 మంది బలయ్యారు. ఆ ఘటనకు పూర్తి బాధ్యుడు అప్పటి సీఎం చంద్రబాబు. మరి ఆ లెక్కన చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?.
కందుకూరులో ఇరుకు సందులో మీటింగ్ పెట్టి ఏడుగురిని, మరో చోట చీరల పంపిణీ పేరుతో చేసిన ప్రహసనానికి ముగ్గురు బలయ్యారు. ఇంత మందిని బలిగొన్న చంద్రబాబు సంతోషంగా బయట తిరగడం అత్యంత దారుణం. ఇంత మందిని దగా చేసిన చంద్రబాబు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదని నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు.