– జూ పార్కులతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్ది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణను అమలుచేయాలన్న మంత్రి సురేఖ
– అటవీ అధికారులతో కలిసి యానిమల్ అడాప్షన్ స్కీమ్ బ్రోచర్, డైరీ, కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించిన మంత్రి
– జంతువుల భావోద్వేగాలను గమనిస్తూ, వాటిని సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచన
– వరంగల్ లోని కాకతీయ జూ పార్కుకు రెండు వైట్ టైగర్ లు, సింహాన్ని తెప్పించే దిశగా సెంట్రల్ జూ అథారిటీని సంప్రదించాలని సూచన
– కోతుల బెడద నివారణకు కోఆర్డినేషన్ కమిటీల మీటింగ్ నిర్వహించాలని ఆదేశం
– జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని జూ పార్కులతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైర సౌకర్యాలతో తీర్చిదిద్ది, పర్యావరణహిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణను అమలుచేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అటవీశాఖను ఆదేశించారు.
ఈ రోజు డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అటవీ అధికారులతో కలిసి యానిమల్ అడాప్షన్ స్కీమ్ బ్రోచర్, డైరీ, కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి సురేఖ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, సందర్శకుల అభిరుచుల మేరకు, పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అటవీశాఖకు ఆదాయం సమకూరే విధంగా పకడ్బందీ ప్రణాళికలతో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పనిచేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూ పార్కుల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తొమ్మిది జూ పార్కులతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను అధికారులకు మంత్రి సురేఖకు వివరించారు.
రాష్ట్రంలోని నెహ్రూ జూ పార్క్, కాకతీయ జూ పార్క్, పిల్లలమర్రి మినీ జూపార్క్, లోయర్ మానేరు డీర్ పార్క్, కిన్నెరసాని డీర్ పార్క్ జంతు సంరక్షణ చర్యలు, కేబీఆర్, మృగవని, మహవీర్ హరిణ వసన్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సందర్శకుల సంఖ్య పెరిగే విధంగా అమలుచేయాల్సిన అదనపు సౌకర్యాలు పై మంత్రి సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
జంతువుల దత్తత పై అనుసరిస్తున్న విధివిధానాల పై మంత్రి సురేఖ ఆరా తీశారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పన నిమిత్తం ఆన్లైన్ లో టికెట్ బుకింగ్, ఇంటిగ్రేటెడ్ ఫాస్ట్ ట్రాక్ పార్కింగ్ వంటి ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నట్లు జూ పార్క్స్ డైరక్టర్ సునీల్ ఎస్. హేరామత్ మంత్రి సురేఖ గారికి వివరించారు. వృద్ధులు, చిన్నపిల్లల సౌకర్యాల నిమిత్తం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.
వరంగల్ కాకతీయ జూ పార్కు పై ప్రత్యేక దృష్టి
కాకతీయ జూ పార్కు మధ్య గుండా పోతున్న వరదనీటి డ్రైనేజీ కారణంగా దుర్వాసన వస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, డ్రైనేజీని జూ పార్కు బయటకు మళ్ళించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాకతీయ జూ పార్కుకు రెండు వైట్ టైగర్ లు, సింహాన్ని తెప్పించే దిశగా సెంట్రల్ జూ అథారిటీని సంప్రదించాలని మంత్రి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ ను ఆదేశించారు. ఈ మధ్యే వరంగల్ జూ పార్కుకు పులిని తరలించిన తర్వాత సందర్శకుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. వరంగల్ జూ పార్కుతో పాటు ఇతర జూ పార్కుల్లో ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
కోతుల సమస్య నివారణకు…
కోతుల బెడద నివారణకు సంబంధిత అన్ని శాఖలతో కోఆర్డినేషన్ కమిటి మీటింగ్ నిర్వహించి, కోతుల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం కనుగొనేలా చర్యలు చేపట్టాలన్నారు. కోతులను వన్యప్రాణి జాబితా నుండి తొలగించినందు వల్ల ఈ దిశగా కచ్చితమైన విధివిధానాలను రూపొందించి కోతుల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని మంత్రి సురేఖ పిసిసిఎఫ్ డోబ్రియాల్ ను ఆదేశించారు.