Suryaa.co.in

Editorial

గౌడ సభలో గత్తర.. సారీతో సరి!

  • గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో మాజీ మంత్రి జోగి రమేష్

  • సభలో వైఎస్‌ను కీర్తించిన జోగి రమేష్

  • పార్ధసారధి, గౌతు శిరీషపై రోజంతా మాటల దాడి చేసిన టీడీపీ సోషల్‌మీడియా సైన్యం

  • ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు గుడివాడ నాని, వంశీ, రోజాని కూడా పిలవండని వ్యంగ్యాస్త్రాలు

  • మీరూ మీరూ ఒకటే.. మేమే పిచ్చోళ్లమంటూ ఆగ్రహం

  • జోగి ఉన్న సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా హాజరవుతారంటూ ప్రశ్నల వర్షం

  • దానితో క్షమాపణ చెప్పిన మంత్రి పార్ధసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష

  • జోగి రాక తమకు తెలియుదని వివరణ

  • తన చిత్తశుద్ధిని శంకించవద్దన్న శిరీష

  • సొంత పార్టీ సోషల్‌మీడియా సైన్యం విమర్శలపై మనస్తాపం

  • సాయుంత్రానికి టీ కప్పులో తుపానులా చల్లారిన వైనం

  • పదునెక్కుతున్న టీడీపీ సోషల్‌మీడియా సైన్యం

( మార్తి సుబ్రహ్మణ్యం)

నాయుకత్వం తమ అవసరాలకు ఎన్ని సర్దుబాట్లయినా చేసుకుంటుంది. అవసరార్ధ రాజకీయుం చేస్తుంటుంది. అందులో జరిగే తప్పులను పట్టించుకోదు. కార్యకర్తల మనోభావాలతో పనిలేకుండా, తన నిర్ణయాలు తాను తీసుకునే ‘కొత్త తరహా నాయుకత్వం’ వచ్చేసింది. కానీ కార్యకర్తలు మాత్రం నాయుకత్వం తీసుకునే నిర్ణయాలను నిర్భయుంగా నిలదీస్తారు. తప్పులు జరిగితే కడిగేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు. తన మెడపై వైసీపీమూకలు కత్తి పెట్టి జగన్ జిందాబాద్ అనకపోతే చంపేస్తామని బెదిరిస్తే.. తన ప్రాణం పోయినా అననంటూ ఆ కత్తితో తానే మెడ కోసుకున్న, చంద్రయ్యు లాంటి కరుడుగట్టిన కార్యకర్తలున్న పార్టీ అది. అదే తెలుగుదేశం ప్రత్యేకత! దేశంలో ఏ ప్రాంతీయుపార్టీలోనూ కనిపించని కరుడుగ్టిన కార్యకర్తలున్న పార్టీ అది!!

తప్పు చేస్తే ఎవరినయినా నిగ్గదీసి కడిగిపారేసే టీడీపీ కార్యకర్తలకు.. గత ఆరునెలల నుంచి జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చడం లేదు. రణమే తప్ప రాజీ ఎరుగని పసుపు సైన్యం.. నయా ‘రాజీ’కీయాలను సహించలేక ఉడికిపోతోంది. దానిని వేలెత్తిచూపుతూ సోషల్‌మీడియా సైన్యం పుంఖానుపుంఖాల పోస్టులు పెడుతోంది. టీడీపీ కార్యకర్తకు కోపం వస్తే అంతే. అసలు పసుపు సైన్యానికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? నూజివీడు గత్తరలా ఉంటుంది!

నూజివీడులో జరిగిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ హాజరవడం పసుపు సైన్యం ఆగ్రహానికి కారణమయింది. మంత్రి పార్ధసారథి, లచ్చన్న మనుమరాలైన టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరైన ఆ సభలో.. మాజీ మంత్రి, చంద్రబాబు ఇంటిపై వైసీపీ మూకలతో దాడికి దిగిన జోగి రమేష్ కూడా వేదిక పంచుకున్న వైనంపై కన్నెర్ర చేస్తూ, సోషల్‌మీడియా పసుపు సైన్యం.. ఉదయుం నుంచి అవిశ్రాంతంగా విమర్శల వర్షం కురిపిస్తూనే ఉండటం, పార్టీని ఖంగుతినిపించింది. ఆ ఘటనపై కార్యకర్తలు ఆ స్థాయిలో ప్రతిస్పందిస్తారని నాయుకత్వం ఊహించలేదు. సాన సతీష్‌కు రాజ్యసభ ఇచ్చిన తర్వాత వెల్లువెత్తిన నిరసనకు మించిన స్వరం.. నూజివీడు ఘటనలో ప్రతిధ్వనించడం విశేషం.

మీరూ మీరూ ఒకటే. ఎటొచ్చీ మేమే పిచ్చోళ్లం.. ఇక రేపు గుడివాడలో ఎర్టీఆర్ విగ్రహావిష్కరణకు అసెంబ్లీ బాబు భార్యను, బాబు, లోకేష్‌ను తిట్టిపోసిన కొడాలి నాని, వంశీని కూడా పిలిచి వేదిక ఎక్కించండి.. మీకు మా మనోభావాలతో పనిలేదు. అధికారం వచ్చిన తర్వాత మా అవసరంలేదు.. ఆరునెలల నుంచి రాజీలే తప్ప రణం ఎక్కడిది?.. దీనికోసమేనా మేం జగన్‌తో యుుద్ధం చేసింది? మేం కిందస్థాయిలో ప్రత్యర్ధులతో యుద్ధాలు చేస్తూ సర్వం నష్టపోతుంటే.. మీరు పైస్థాయిలో సర్దుకుపోతారా?.. కార్యకర్తల గళం వినిపించకుండా గొంతునొక్కినా.. ఇది మా పార్టీ. మా గళం వినిపిస్తూనే ఉంటాం. పార్టీని కాపాడుకుంటాం.. అంటూ పసుపు సైనికులు శరపరంపరగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

దానితో దిద్దుబాటుకు దిగిన మంత్రి పార్ధసారథి ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్షమాపణ కోరారు. కార్యకర్తల మనోభావాలు గాయుపరిచినందుకు సారీ చెప్పారు. అది అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనన్నారు. తాను ఈ విషయాన్ని తనను హత్తుకుని గౌరవించిన చంద్రబాబునాయుుడును కలసి వివరిస్తానన్నారు. జోగిని తాను ఆ సభలోనే చూశానన్నారు.

ఇక గౌతు శిరీష అయితే.. తనను ఇన్నాళ్లూ సమర్థించిన టీడీపీ సోషల్‌మీడియా దళమే, తనపై విమర్శలు చేయుడాన్ని తట్టుకోలేకపోతున్నానని వాపోయారు. అది తాను నిర్వహించిన కార్యక్రమం కాదని, తన నియోజకవర్గం కూడా కాదన్నారు. నిర్వహకులు పిలిస్తే వెళ్లి, తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించానని వివరణ ఇచ్చుకున్నారు. తన చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని, టీడీపీతో తమది దశాబ్దాల బంధవుని గుర్తు చేశారు. పోతుల సునీతను టీడీపీలో చేర్చుకుంటానంటే, తొలుత వ్యతిరేకించింది తానేనని గుర్తు చేశారు. ఇకపై ఏ కార్యక్రమానికయినా వెళితే, నిర్వహకులు ఎవరెవరిని పిలిచారని తెలుసుకున్న తర్వాతనే వెళతానని హామీ ఇచ్చారు. దానితో పుసుపు దళం సోషల్‌మీడియా సైనికులు శాంతించారు.

ఇక ఆ సభలో ప్రసంగించిన మాజీ మంత్రి జోగి రమేష్.. సర్దార్ గౌతులచ్చన్న జయుంత్యుత్సవాన్ని, హైదరాబాద్ రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు.

నిజానికి టీడీపీ సోషల్‌మీడియా సైన్యం గత ఆరునెలల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని తప్పులను, నిర్భయుంగా ఎండగడుతూనే ఉంది. ఇన్స్‌పెక్టర్ల నుంచి ఎస్పీలు, ఐఏఎస్ నియామకాల్లో జరిగిన తప్పులను విమర్శించడంతో, పార్టీ నాయుకత్వం కూడా దిద్దుబాటు చర్యలకు దిగి, వాటిని సరిచేసుకున్న ఘటనలు బోలెడు.

తాజాగా రేషన్ బియ్యుం కుంభకోణంపై వేసిన సిట్‌లో వైసీపీకి శ్రమదానం చేసి, ఎన్నికల్లో దర్శి వైసీపీ అభ్యర్ధి విజయానికి సహకరించిన డీఎస్పీతోపాటు, మరో ఇద్దరిని ఎలా నియుమించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దానితో అసలు సిట్ సభ్యుల మెుత్తాన్ని మార్చివేయాల్సి వచ్చింది. గతంలో తుళ్లూరు సీఐ నియామకంలోనూ తప్పులో కాలేస్తే, సోషల్‌మీడియా సైన్యం కన్నెర్ర చేసిన తర్వాతగానీ దిద్దుబాటుకు దగలేకపోయింది.

ఇక గత జగన్ సర్కారుతో అంటకాగిన మెగా కంపెనీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలపై ఇప్పటిదాకా చ ర్యలు తీసుకోకుండా, వారినే కొనసాగిస్తున్న వైనం పైనా పసుపు దళం ఇప్పటికీ విమర్శలవర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా సీఎం చంద్రబాబునాయుుడు, మెగా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి గ్రామం డోకిపర్రుకు వెళ్లడాన్ని సైతం పసుపు దళం తప్పుపట్టడం ప్రస్తావనార్హం. సూటిగా చెప్పాలంటే.. పార్టీకి ప్రతిపక్షం లేకపోయినా.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోని లోపాలను నిర్మొహమాటంగా, నిటారుగా నిలబడి నిలదీస్తున్న సోషల్‌మీడియా పసుపు దళమే ఇప్పుడు నిఖార్సయిన ప్రతిపక్షంలా పనిచేస్తోందని చెప్పకతప్పదు. సద్విమర్శలతో, నిస్వార్థ సూచనలతో టీడీపీ సోషోల్‌మీడియా సైనికులు పార్టీ-ప్రభుత్వానికి వేగుచుక్కలా పనిచేస్తున్న పరిస్థితి.

LEAVE A RESPONSE