– ప్రపంచంలోని కోట్లాధి మంచి అభిమానుల గుండె చప్పుడు వైయస్ జగన్
– గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యం
– అయిదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారు
– ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
– రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల సంబరాలతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… ప్రపంచంలో వైయస్ జగన్ ని అభిమానించే తెలుగువారికి నేడు పండగ రోజు. రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, గొప్ప విజనరీ వైయస్ జగన్ జన్మదినం మన అందరికీ నిజమైన పర్వదినం. ప్రతి ఇంటిలోనూ కుటుంబసభ్యుడుగా ప్రజల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న ప్రజానాయకుడు వైయస్ జగన్. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, ఆత్మస్థైర్యం వైయస్ జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు.
అందుకే అధికారం కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్.
పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్.
గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి.