Suryaa.co.in

Editorial

ఏబీపై అన్ని కేసులూ ఎత్తివేత.. కానీ…

  • సర్కారు తాజా ఉత్తర్వులు

  • సిసోడియా విచారణ డొల్లతనం తేల్చేసిన సర్కారు

  • ఇప్పుడు అదే సిసోడియా సీఎస్ రేసులో

  • జగన్ సర్కారు మెప్పు కోసం ఏబీపై ఆయన తప్పుడు నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు

  • ఏబీవీపై ఏసీబీ కేసు మాత్రం సజీవం

  • నత్తలతో పోటీ పడిన న్యాయవిభాగం

  • ఏసీబీ కేసు ఉపసంహరణపై దృష్టి సారించని న్యాయవిభాగం

  • కూటమి వచ్చినా ఏబీకి దక్కని ఆర్ధిక ప్రయోజనాలు

  • ఏబీవీకి ఇంకా కోటి 70 లక్షలు విడుదల చేయని సర్కారు

  • కూటమి పాలన లోనూ ఏబీకి దక్కని న్యాయం

( మార్తి సుబ్రహ్మణ్యం)

నాటి సీఎం జగన్‌పై తిరుగుబాటుచేసి, పాలకుల ముందు సాగిలబడకుండా నిటారుగా నిలబడి యుద్ధం చేసిన తొలి బాధితుడయిన రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరావుపై.. జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులనూ ఎత్తివేస్తున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆరునెలల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికిది జగన్‌పై తెగబడి యుద్ధం చేసిన పోలీసు పోరాట యోద్ధ ఏబీకి లభించిన స్వల్ప ఊరట మాత్రమే తప్ప, పూర్తి న్యాయం కాదన్నది పోలీసు, రాజకీయవర్గాల వ్యాఖ్య.

కూటమి సర్కారు నత్తలతో పోటీ పడుతోంది. ఫలితంగా నత్తలూ నవ్వుకుంటున్న వైచిత్రి. జగన్ ఐదేళ్ల జమానాలో వెంటాడి వేధించిన, సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. ఆ ఐదేళ్లూ పోలీసు యూనిఫారం వేసుకోకుండానే కోర్టుల చుట్టూ తిరిగి న్యాయపోరాటం చేశారు. ఒక అధికారిని ఒకటి కన్నా ఎక్కువ సార్లు సస్పెండ్ చేసి, సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డగోలుగా ధిక్కరించిన జగన్ సర్కారు.. ఆయన మళ్లీ పోలీస్ డ్రస్ వేసుకోకుండా లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏబీ మాత్రం తన డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి.

తన కుమారుడి కంపెనీ నుంచి పరికరాల కొనుగోలు చేశారన్న అభియోగంతో, ఏబీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు.. ఆ కేసులో సర్కారుకు వచ్చిన ఆర్ధిక నష్టం గానీ, కొనుగోళ్ల వివరాలను గానీ కోర్టుకు సమర్పించలేకపోయింది. అలా ఒకే కేసుకు సంబంధించి రెండు సార్లు సస్పెండ్ చేసిన జగన్ సర్కారు, చివరకు క్యాట్‌లో సైతం తన ఆరోపణలను రుజువు చేయలేకపోయింది. దానితో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఆదేశాల మేరకు, ప్రభుత్వం ఆయన రిటైర్‌మెంట్ రోజున పోస్టింగ్ ఇస్తే. అదే రోజు సాయంత్రానికి రిటైర్ కావలసిన విషాదం.

అలా ఏ అధికారి తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కోనన్ని అవమానాలు ఏబీవీ ఎదుర్కోవలసి వచ్చింది. కారణం ఆయన టీడీపీకి కార్యకర్తగా పనిచేశారన్న ఆగ్రహమే. మరి అధికారంలోకి వచ్చిన కూటమి ఆయనకు న్యాయం చేసిందా? అంటే ఉపస్తుమినహా కన్యాదానం అన్న సామెత చెప్పినట్లు.. కీలకమైన ఏసీబీ విచారణ ఉపసంహరణ మినహా.. మిగిలిన అన్ని కేసులూ ఉపసంహరించుకుంది. మరి తన కోసం బలైన ఏబీకి.. ఈ ప్రభుత్వం పూర్తి న్యాయం ఏం చేసిందన్నది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

నిజానికి ఏబీ వెంకటేశ్వరరావు కూడా నాటి ఐఏఎస్ సతీష్‌చంద్ర మాదిరిగానే సర్దుకుపోయి ఉంటే, జగన్ ఆయనకు డీ జీపీ కూడా ఇచ్చినా ఆశ్చర్యపోవలసి పని ఉండేది కాదు. ఎందుకంటే జగన్‌తో ఏబీకి వ్యక్తిగ త వైరం ఏమీలేదు. ఆయన కేవలం టీడీపీ కోసం పనిచేశారు కాబట్టి! ఆ మేరకు ఏబీకి సీఎంఓ నుంచి పిలుపు కూడా వచ్చింది. కానీ లొంగుబాటు మరణంతో సమానమని భావించిన ఏబీ, తాడేపల్లి ముఖం చూడలేదు. ఆరకంగా సీఎంను కలవని ఏకైక ఐపిఎస్ అధికారిగా ఏబీ చరిత్రలో నిలిచిపోయారు.

దీనికి కారణం.. ఏబీ వెంకటేశ్వరరావు నిఘా దళపతిగా ఉన్నప్పుడు, టీడీపీ కార్యకర్తగా పనిచేశారన్న జగన్ ఆగ్రహమే! అంటే టీడీపీ కోసం పనిచేసిన ఏబీ అదే టీడీపీ కోసం బలిపశువయ్యారన్నమాట. అదే జగన్‌తో అందరిలా సర్దుకుపోయి ఉంటే, ఏబీ భవిష్యత్తు మరోలా ఉండేదన్నది నిష్ఠుర నిజం. అలా పాలకులకు సాగిలబడకపోవడమే ఆయన కష్టాలకు కారణం. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ బాధితుడైన ఏబీకి సత్వర న్యాయం చేయాలని తెలుగుతమ్ముళ్లు ఆశించడం సహజం కదా?

అయితే ఆయన దరఖాస్తును పరిశీలించేందుకు ఇప్పటి సీఎస్‌కు, అసలు సమయమే దొరకకపోవడమే విషాదం లాంటి విచిత్రం! నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆయనపై జగన్ ప్రభుత్వం మోపిన అభియోగాలు, ఏసీబీ విచారణను ఉపసంహరించుక్నునట్లు ప్రకటిస్తుందని చాలామంది భ్రమించారు. చంద్రబాబు పిలిచి పెద్దపీట వేస్తారని ఆశించారు.

ప్రధానంగా ఏసీబీ విచారణను ఉపసంహరించుకునేలా, అడ్వకేట్ జనరల్ చొరవ తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత గానీ, ఆ ఫైలులో కదలిక రాకపోవడమే విచిత్రం. దానికంటే ముందు.. ఏబీని రెండోసారి సస్పెండ్ చేసేందుకు కారణమయిన కేసును కూడా, వేగంగా ఉపసంహరించుకుంటుందని పార్టీ నాయకులు అంచనా వేశారు.

వీటికంటే విషాదమేమిటంటే.. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినప్పటికీ.. ఏబీవీకి న్యాయంగా ప్రభుత్వం నుంచి రావలసిన కోటి 70 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ రాకపోవడం! దానికోసం ఆయన సీఎస్‌కు ఇచ్చిన లేఖ ఆరునెలలు సీఎస్ చెత్తబుట్టలో సుఖనిద్ర పోయిందన్నమాట. అంటే ‘మంచి ప్రభుత్వం’లో అధికారులు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారో.. ఎంత చురుకుగా పనిచేస్తున్నారో అర్ధమవుతోంది.

తన వల్ల బలయిన ఒక సీనియర్ అధికారికే న్యాయం చేయలేని ప్రభుత్వం.. ఇక తమకేం న్యాయం చేస్తుందని, సగటు కార్యకర్త ఆత్మవిమర్శ చేసుకునే సంకేతం అది. నిజానికి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చి.. జగన్ జమానాలో అంటకాగిన పోలీసు అధికారి సంగతి తేలుస్తుందని చాలామంది భ్రమించారు. కానీ ఆరునెలలు దాటినా ఏబీ ఫైలు అంగుళానికి నెల చొప్పున క దిలిందంటే, పాలనపై పాలకుల పట్టు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

పైగా పోలీసు అధికారుల బదిలీలలో ఏబీ కీలకపాత్ర పోషిస్తున్నారంటూ అదో ఆరోపణలు. నిజానికి మాజీ డీజీపీ ఠాకూర్, మాజీ ఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ మాత్రమే ఆ వ్యవహారాలు చూడగా, వాటితో ఎలాంటి సంబంధంలేని ఏబీ అనవసర ఆరోపణలు ఎదుర్కొవలసిన పరిస్థితి. వైసీపీ నేతలు సైతం పోలీస్ పోస్టింగ్‌లలో ఏబీ హస్తం ఉందంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరోపించారు.

కాగా తాజాగా ఏబీపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులూ ఉపసంహరించుకున్నట్లు, ఉత్తర్వు వెలువడిన నేపథ్యంలో.. అప్పటి విచారాణాధికారి సిసోడియా వ్యవహారశైలి మరోసారి చర్చలోకి వచ్చింది. ఏబీపై విచారణకు జగన్ సర్కారు సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఆ సందర్భంగా సిసోడియా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీపై అడ్డగోలుగా నివేదిక ఇచ్చారన్న విమర్శలు లేకపోలేదు.

ఏబీకి వ్యతిరేకంగా నివేదిక ఇస్తే.. కీలకమైన పోస్టింగ్ ఇస్తామని జగన్ సర్కారు చెప్పినందుకే, ఆయన ఏబీకి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని.. ఆ తర్వాతనే సిసోడియాను గవర్నర్ కార్యదర్శిగా నియమించారని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగ సంఘనేత సూర్యనారాయణకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించిన కారణంగానే, సిసోడియాను తప్పించారే తప్ప.. ఆయనేమీ జగన్ బాధితుడు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు అదే సిసోడియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారని, ఆయనకే సీఎస్ దక్కుతుందన్న ప్రచారంపై టీడీపీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఏబీపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న ఉత్తర్వు పరిశీలిస్తే.. సిసోడియా నివేదిక డొల్లతనం ఏమిటో స్పష్టమవుతోందని అటు ఐపిఎస్ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఆయన నివేదికను నమ్మలేదని స్పష్టమవుతున్నందున.. అలాంటి నివేదికలిచ్చిన సిసోడియాను సీఎస్‌గా నియమించి, చంద్రబాబు ప్రభుత్వం.. అప్రతిష్ఠ ఎందుకు కొనితెచ్చుకుంటుందన్న వ్యాఖ్యలు అధికార వ ర్గాల్లో వినిపిస్తున్నాయి.2024-GAD-34831-RT2197

LEAVE A RESPONSE