-
సీఎంఓలో వైసీపీ చెవులు?
-
సీఎంఓలో లీకు వీరులు?
-
పేర్ని వ్యాఖ్యలతో బట్టబయలు
-
సీఎంఓలో పేర్నికి ఉప్పందించింది ఎవరు?
-
అక్కడ ఎవరున్నారో కూడా చెప్పేసిన పేర్ని
-
వైసీపీ కోవర్టులు సీఎంలో ఉన్నారా?
-
బాబు ఏమన్నారో చెప్పిన వైనం
-
ఎవరూ లేకపోతే పేర్లతో సహా ఎలా తెలుస్తాయంటున్న పార్టీ వర్గాలు
-
పేర్ని వ్యాఖ్యలపై నోరెళ్లబెట్టిన టీడీపీ సీనియర్లు
-
తన భార్యపై కేసు పెట్టవద్దని బాబు చెప్పారని పేర్ని సంకేతాలు?
-
సీఎంఓ ప్రక్షాళన అవసరాన్ని స్పష్టం చేసిన పేర్ని వ్యాఖ్యలు
-
సీఎంఓలో జగన్ బాధితులు లేరంటున్న నాయకులు
-
ఇక ఇలాగైతే సీఎంఓలో ఎవరిని నమ్మాలి?
-
కూటమిలో ‘పేర్ని’ ప్రకంపనలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఒక కోట. అందులో పాలనాపరంగా తీసుకునే నిర్ణయాలు, చర్చలు బయటకు రావు. కానీ విపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి.. సీఎంఓలో స్వయంగా ముఖ్యమంత్రి తన గురించి ఏం మాట్లాడారు? ఆ సమయంలో ఏ అధికారులున్నారు? మంత్రులెవరున్నారన్నది పూసగుచ్చినట్లు, స్వయంగా తేను అక్కడ ఉండి చూసినట్లుగా మీడియాకు చెప్పారంటే.. దాని అర్ధం, సీఎంఓ బలంగా ఉన్నట్లా? బలహీనంగా ఉన్నట్లా? సీఎంఓలో కోవర్టులు ఉన్నట్లా? లేనట్లా? మరిప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని నమ్మాలి?.. అంటే దానర్ధం ముఖ్యమంత్రి దగ్గర, ఆయన కోసం అంకితభావంతో పనిచేసే వారు లేరన్నట్లే కదా?… పీకల్లోతు కేసుల్లో మునిగిన మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల తర్వాత, టీడీపీ-కూటమి వర్గాల్లో తెరపైకి వస్తున్న సందేహాలివి.
తన భార్యపై కేసు పెట్టవద్దు. ఆడవారిపై కేసులెందుకు? మీకు తల ఉందా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఒక మంత్రినుద్దేశించి వ్యాఖ్యానించారని, ఆ సమయంలో అక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహా, కొందరు అధికారులు కూడా ఉన్నారంటూ.. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలు, సీఎంఓ డొల్లతనాన్ని బయటపెట్టాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘‘ నా భార్య జయసుధ, నాకొడుకు, నాపై కేసులు పెట్టి లోపలవేయాలని ఒక మంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తల్లకిందులు తపస్సు చేస్తున్నారు. ఈమధ్య ఆ మంత్రిగారు సీఎం చంద్రబాబునాయుడు గారు వెళుతుంటే, నా భార్యపై కేసు పెట్టిలోపల వేయాలని అన్నాడు. ఏమాటకామాటకు ఇక్కడ చెప్పుకుని తీరాలి. అందుకు బాబుగారు.. ఏమయ్యా నీకైమేనా మైండు చెడిందా? ఇంట్లో ఆడవాళ్లను అరెస్టులు చేయడమేంటి? ఆడవాళ్లను కేసుల్లో ఎందుకు ఇరికిస్తారు? మన టార్గెట్ పేర్ని నాని. వాడిని వేసేయండి. నీకు కక్ష ఉంటే వాడి కొడుకును కూడా వేసేయండి. కానీ ఇంట్లో ఆడవాళ్లమీద ఏంటయ్యా కేసులు? తప్పుడు పనులని నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడ ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులున్నారు సాక్ష్యం. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నిల్చుని ఉన్నారు. నాకు చంద్రబాబుగారికి రాజకీయ వైరం ఉన్నప్పటికీ, ఆయన హుందాతనం ప్రదర్శించినప్పుడు, దాని గురించి చెప్పడంలో తప్పేముంది’’ అని పేర్ని నాని, తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
పేర్ని వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో.. సీఎంఓలో వైసీపీ కోవర్టులు ఉన్నారన్న ఆందోళనకర చర్చకు టీడీపీ, కూటమి వ ర్గాల్లో తెరలేచింది. చంద్రబాబునాయుడు-ఆ మంత్రి మధ్య జరిగిన సంభాషణ సమయంలో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని, పేర్ని నాని పూసగుచ్చినట్లు వివరించారంటే.. సీఎంఓలో వైసీపీ కోవర్టులు లేకపోతే, కోటలోని రహస్యాలు బయటకు ఎలా పొక్కుతాయన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీన్ని బట్టి సీఎంఓలో సమర్ధులు, నమ్మకస్తులు, విధేయులను నియమించుకోవడంలో తాము విఫలమయ్యామన్న వాస్తవం, పేర్ని నాని వ్యాఖ్యలతో స్పష్టమయిందని మంత్రులు, మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యుల స్థాయి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక పేర్ని తన వ్యాఖ్యల ద్వారా.. తన భార్యను అరెస్టు చేయవద్దని చంద్రబాబునాయుడు చెబుతుంటే, ఒక మంత్రి మాత్రం అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పడంపైనా చర్చ జరుగుతోంది. ఇది ఒకరకంగా పార్టీ వర్గాలు, సోషల్‌మీడియా సైనికుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నంగానే కనిపిస్తోందంటున్నారు. పేర్ని ఒకవైపు బాబును పొగుడుతూనే, తప్పు చేసిన తన భార్యను వదిలేయమంటున్నారన్న సంకేతం పంపించారని విశ్లేషిస్తున్నారు.
అందుకు తగ్గట్లుగానే సోషల్‌మీడియా సైనికులు మద్యాహ్నం నుంచీ .. పేర్ని నాని వీడియో, వ్యాఖ్యల పక్కన ‘ఇది మంచి ప్రభుత్వం కదా’ అని కామెంట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించడం ప్రారంభించడం బట్టి.. పేర్ని వ్యాఖ్యల ప్రభావం, పార్టీశ్రేణులపై ఏ స్థాయిలో చూపుతుందో స్పష్టమవుతుంది.
పేర్ని నాని వ్యాఖ్యలతో, సీఎంఓను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న వాస్తవం స్పష్టమవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఇప్పుడు సీఎంఓలో ఉన్న అధికారుల్లో ఎవరూ జగన్ ప్రభుత్వ బాధితులు లేరని, చిన్న చిన్న ఇగో సమస్యలు తప్ప, ఉన్న అధికారులంతా ఐదేళ్లూ కీలక పోస్టుల్లో పనిచేసి పదవులను అనుభవించిన వారేనని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. సీఎస్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి, సీఎంఓలో కార్యదర్శులు, సీఎం పీఎస్, పీఏ, ఓఎస్డీలు ముఖ్యమంత్రి కోసం అంకితభావంతో, అదొక ఉద్యోగంగా కాకుండా, ఆయన కోసమే పనిచేయాల్సి ఉంటుందని మాజీ ఐఏఎస్ ఒకరు విశ్లేషించారు. కానీ ఇప్పుడున్న సీఎంఓలో అలాంటి వారెవరూ కనిపించడం లేదంటున్నారు.
పేర్ని నాని వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికయినా సీఎంఓను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ‘‘ పూర్వం రాజులు తమ అంత:పురం రహస్యాలు లీకయితే ఆ సిబ్బందిని మార్చేవారు. ఇప్పుడు కూడా మేం అదే చేయాలి. లేకపోతే ఇక రహస్యాలంటూ ఏమీ ఉండవు. ఇప్పుడున్న అధికారుల చిత్తశుద్ధి ఏమిటో పేర్ని మాటలతో తేలిపోయింది కాబట్టి, జగన్ హయాంలో బాధితులైన అధికారులను నియమించుకుంటే లీజేజీలు ఉండవు. మా లాంటి జగన్ బాధితులకు సరైన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాధితుడి బాధ మరొక బాధితుడికే అర్ధమవుతుంది’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
‘‘ఈ విషయంలో సీఎం చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మాదిరిగా వ్యవహరించాలి. అప్పుడు మేం అధికారికంగా చేసిన లెకులే తప్ప, ఇలాంటి కోవర్టులు ఉండేవారు కాదని’’ సీనియర్ నేతలు నేతలు గుర్తు చేస్తున్నారు.