-
సీఎస్ రేసులో సాయిప్రసాద్, విజయానంద్
-
కేంద్ర స్థాయిలో సుమిత్రా దావ్రా ప్రయత్నాలు
-
రంగంలో సిసోడియా కూడా
-
విజయానంద్‌కే ఖరారంటూ వార్తలు
-
‘షిర్డిసాయి మహత్యం’ అంటూ సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
-
బడా కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారంటూ గుసగుసలు
-
అదానీ, షిర్డిసాయికి లబ్ధి చేకూర్చిన వారికి సీఎస్ ఇస్తారా? అంటూ పార్టీ వర్గాల్లో పెదవి విరుపు
-
జగన్ జమానాలోనూ వెలిగిపోయిన విజయానంద్, సాయిప్రసాద్
-
విద్యుత్, సోలార్ ఒప్పందాల్లో కీలకపాత్ర
-
కమ్మవర్గం అయినందున సాయిప్రసాద్‌కు ఇచ్చేందుకు భయపడవచ్చన్న ప్రచారం
-
అందుకే బీసీ అయిన విజయానంద్‌కు ఇస్తారంటూ చర్చ
-
మధ్యలో సుమిత్రా దావ్రాకు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్న సచివాలయ వర్గాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించ నున్నారన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీకాలం ముగియడంతో, కొత్త బాసును ఈ వారంలోనే ఈ నెలాఖరులోగా నియమించాల్సి ఉంది. అయితే ఇప్పటి సమాచారం ప్రకారం.. సీఎస్ రేసులో స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా ఉన్న విజయానంద్, సాయిప్రసాద్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. తాజాగా బీసీ యాదవ వర్గానికి చె ందిన విజయానంద్‌కే, సీఎస్ పదవి ఖరారయిందన్న ప్రచారం జరుగుతోంది. కాగా వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండి, కులసమీకరణల తలనొప్పి ఎదురైతే.. కేంద్ర సర్వీసులో ఉన్న సుమిత్రా దావ్రాకు సైతం అవకాశం లేకపోలేదని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎస్ నీరబ్‌కుమార్ వారసుడెవరో ఒకటి రెండురోజుల్లో తేలనుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. ఆ ప్రకారంగా కమ్మ సామాజకవర్గానికి చెందిన సాయిప్రసాద్, యాదవ సామాజికవర్గానికి చెందిన విజయానంద్‌లలో ఒకరిని సీఎస్ పదవి వరించవచ్చంటున్నారు. అయితే కేంద్ర సర్వీసులో ఉన్న సుమిత్రా దావ్రా కూడా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇక సిసోడియా కూడా సీఎస్ ఆశిస్తున్నారు. అయితే ఆయన జగన్ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణాధికారిగా నియమించినప్పుడు, ఏబీకి వ్యతిరేకంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. కాబట్టి ఆయనకు అవకాశాలు తక్కువేనంటున్నారు. కొద్దిరోజులు కృష్ణబాబు పేరు ప్రచారంలోకి వచ్చినా, ఆయన వైఎస్ జమానాలో ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారన్న వ్యాఖ్యలు వినిపించిన తర్వాత, ఎందుకనో ఆ చర్చకు తెరపడింది.
ప్రస్తుతం విజయానంద్-సాయిప్రసాద్‌లో ఒకరిని ఎంపిక చేయవచ్చంటున్నారు. అయితే వీరి కోసం బడా కంపెనీలు రంగంలోకి దిగాయన్న ప్రచారం సోషల్‌మీడియాలో మొదలయింది. విజయానంద్‌కే సీఎస్ పదవి ఖరారయిందని, టీవీ చానెల్స్‌లో స్క్రోలింగ్స్ వచ్చిన తర్వాత.. అదంతా ‘షిర్డిసాయి మహిమ’ అంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం వరకూ సాయిప్రసాద్ పేరు విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే కమ్మ సామాజికవర్గానికి చెందిన సాయిప్రసాద్‌ను, సీఎస్‌గా నియమించే ధైర్యం చంద్రబాబునాయుడు చేయరన్న చర్చ ఆ సామాజికవర్గంతో పాటు, ఐఏఎస్ వర్గాల్లోనూ జరిగింది. అందువల్ల ముందు విజయానంద్‌ను సీఎస్‌గా నియమించి.. ఆయన రిటైరయిన తర్వాత, సాయిప్రసాద్‌కు అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ జరిగింది. అయితే జగన్ హయాంలో జవహర్‌రెడ్డికి సీఎస్‌గా అవకాశం ఇచ్చినప్పుడు, ఇప్పుడు సాయిప్రసాద్‌కు ఇస్తే తప్పేమిటన్న వాదన కమ్మ సామాజికవర్గంలో వినిపిస్తోంది.
కాగా యాదవ వర్గానికి చెందిన విజయానంద్‌కు సీఎస్ పదవి ఇవ్వడం ద్వారా.. బీసీలను, ప్రధానంగా యాదవులను మెప్పించాలన్న నిర్ణయం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. అయితే ఒక కులానికి చెందిన అధికారిని సీఎస్‌గానో, డీజీపీగానో నియమిస్తే ఆ కులానికి చెందిన వారంతా.. అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అంచనా-భావన సరైందికాదంటున్నారు.
తెలంగాణలో ఎన్నికల ముందు ఏపీ కాపు కులానికి చెందిన శాంతికుమారిని సీఎస్‌గా నియమించారు. దానితో తెలంగాణలోని మున్నూరు కాపులు, ఆంధ్రా సెటిలర్లు, ఆంధ్రా కాపులు తమ పార్టీకి ఓటేస్తారన్న అంచనా కేసీఆర్ నిర్ణయంలో లేకపోలేదు. ఆ తర్వాత తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు, నాయకులు ఆమెతో భేటీ అయి శుభాకాంక్షలు చెప్పారు. అయితే గత ఎన్నికల్లో మున్నూరుకాపులు కాంగ్రెస్, బీజేపీకి జై కొట్టిన అంశాన్ని అధికారులు, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. పైగా అటు కమ్మ వర్గానికి చెందిన సాయిప్రసాదయినా, యాదవ వర్గానికి చెందిన విజయానందయనా వారి కులాలకు చేసిందేమీలేదంటున్నారు.
పైగా వారిద్దరూ గత జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టులు దక్కించుకున్నారే తప్ప.. ఏ కోణంలోనూ జగన్ బాధితులుకారని గుర్తు చేస్తున్నారు. పైగా అదానీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్, పిపిఏ వ్యవహారాల్లో వీరే కీలకపాత్ర పోషించారంటున్నారు. ట్రాన్స్‌కో జెన్‌కో బాసుల నియామకంలో చక్రం తిప్పిన నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డి ఆదేశాలు పాటించారన్న విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి.
ప్రధానంగా టిడిపి విపక్షంలో ఉన్న సమయంలో.. జగన్ బినామీ కంపెనీగా టీడీపీ ఆరోపించిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పనంగా భూములు, కాంట్రాక్టులు ఇప్పించడంలో, ఒక అధికారి పోషించిన పాత్ర విమర్శలపాలయింది. అవసరం లేకపోయినా షిర్డిసాయికి వేల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మార్లు ఆర్డర్ ఇప్పించారన్న ఆరోపణలు లేకపోలేదు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఆరితేరిన సదరు అధికారి.. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, వారిని తన నైపుణ్యంతో ‘సంతృప్తి’పరచడంలో ఆరితేరిన ఘనాపాఠీగా, అధికారవర్గాల్లో ప్రచారం లేకపోలేదు. అందుకే గత మూడు ప్రభుత్వాలు ఐఏఎస్‌లను రెండు-మూడేళ్లకు బదిలీ చేసినప్పటికీ, ఆయన దశాబ్దాల నుంచి విద్యుత్ శాఖలోనే తిష్ఠవేశారంటున్నారు. తాజాగా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌పై వచ్చిన ఆరోపణలపై చర్యల జోలికి పోకుండా.. సదరు అధికారి చక్రం తిప్పి, తన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ను ప్రదర్శించారని.. అందుకే ఆ కంపెనీపై కూటమి ప్రభుత్వంలోనూ, ఈగ కూడా వాలడం లేదని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘ఆయనపై ఏ ప్రభుత్వం చర్య తీసుకోదు. ఏం చేసినా పట్టించుకోదు. ఎందుకంటే ఆయన అందరినీ ‘బాగా చూసుకుంటాడు’ కాబట్టి. పాలకుల అవసరాలు కనిపెట్టి, వారిని సంతృప్తిపరచడంలో ఆయన స్థాయిలో ఎవరూ పనిచేయరు. అంత సామర్ధ్యం ఇప్పటి ఐఏఎస్‌లకు లేదు. అందుకే ఆయన సుదీర్ఘకాలం నుంచి అదే శాఖలో కొనసాగుతున్నారు. మాతో సహా అనేకమంది ఐఏఎస్ అధికారులు రెండు, మూడేళ్లకు బదిలీ అయ్యారు. కానీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలకుండా ఉన్నారంటే, ఆయన ‘ప్రతిభ’ ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి బడా ఎలక్ట్రిక్ కంపెనీలతో ‘ఒప్పందాల’లో ఆయనకున్న టాలెంట్ మరెవరికీ లేదు. అందువల్ల ఆయన వెలిగిపోయినా ఆశ్చర్యం లేదు’’ అని ఓ మాజీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు.
కాగా అటు టీడీపీ వర్గాల్లోనూ జగన్ జమానాలో ఆయన అనుయాయులకు అనుచిత లబ్థి కలిగేలా వ్యవహరించిన ఒక అధికారికి సీఎస్ ఇవ్వడమంటే, పార్టీలో తప్పుడు సంకేతాలు పంపించడమే అంటున్నారు. ఇదిలాఉండగా.. షిర్డిసాయి ఎలక్ట్రిక్ కంపెనీకి జగన్ ప్రభుత్వం అనుచిత లబ్థి చేకూర్చిన వైనంపై.. మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వేసిన కేసు, ఇంకా కోర్టులో ఉందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.