– వందేళ్ల నుంచి ఉంటున్న రజకులపై దాష్టీకం
– రాళ్లతో కట్టిన ఇంటికి పంచాయతీ కార్యదర్శి నోటీసు
– రాళ్లతో కట్టిన రేకుల షెడ్డు కూడా ‘భవన నిర్మాణమే’నట
– పైన రేకులతో గది వేస్తే దాన్ని కూల్చేయాలట
– మరి ఇన్నాళ్లూ ఇంటిపన్ను, కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకున్నట్లో?
– ఇల్లు ఖాళీ చేయాలని మహిళకు ఫోన్లో బెదిరింపులు
– బెదిరింపులకు తాళలేక రజక మహిళ ఆత్మహత్యాయత్నం
– మంత్రిగారికి చదువు చెప్పిన కృతజ్ఞత కోసం నా ఇల్లు కూలుస్తారా అని రజక మహిళ ఆవేదన
– స్ధలం వారిదే అయినా మాకు వందేళ్ల క్రితమే ఇచ్చారు
– బట్టలు ఉతకడం కోసం మా తాతలను వందేళ్ల క్రితం ఇక్కడకు తెచ్చారు
– మా దగ్గర పేపర్లేమీ లేవని నిస్సహాయత
– వందేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని వాదన
– మంత్రి గారి ఆదేశాలతోనే నాకు నోటీసులిచ్చారన్న మహిళ
– జిల్లా ఇన్చార్జి మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన
– పెనమలూరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం యాకమూరులో రజక మహిళ గోస
( మార్తి సుబ్రహ్మణ్యం)
తన గురువు ద్రోణాచార్యుడికి శిష్యుడు ఏకలవ్యుడు బొటనవేలు గురుదక్షిణగా చెల్లించుకున్నారన్న పురాణగాథ చదివాం. కానీ ఇదో ఆధునిక పురాణగాథ. తనకు చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన గురువు కోరిక మన్నించిన ఓ మంత్రిగారు, వందేళ్ల నుంచి నివాసం ఉంటున్న ఓ రజక మహిళ కుటుంబాన్ని అక్కడినుంచి పంపించేందుకు ఇస్తున్న నయా గురుదక్షిణ గాథ ఇది.
రజక కులానికి చెందిన ఆమె తన భర్త చనిపోతే ఇద్దరు పిల్లలతో బతుకు పోరాటం చేస్తోంది. ఉన్న పది సెంట్ల భూమిలో తన వాటాగా వచ్చిన కొంత భూమిలో రాళ్లతో రేకుల షెడ్డు వేసుకుంటే, దానికి పంచాయతీ కార్యదర్శి మీరు నిర్మిస్తున్న అనధికార ‘భవన నిర్మాణానికి’ సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించాలని తాఖీదులిచ్చారు.
అయితే వందేళ్ల క్రితమే గ్రామంలో వారికి బట్టలు ఉతికేందుకు తన పూర్వీకులతో వచ్చి అక్కడ స్థిరపడిన ఆ రజక కుటుంబానికి, ఇప్పుడు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవు.
‘‘ ఈ ఊళ్లో బట్టలు ఉతికేందుకు మా తాతలను వందేళ్ల క్రితం ఇక్కడకు తీసుకువచ్చి, ఉండటానికి ఈ స్థలం ఇచ్చారు. కానీ చదవుకోకపోవడంతో ఆ పేపర్లు ఏవీ మా పూర్వీకులు రాయించుకోలేదు. ఇవి వాళ్ల పూర్వీకులు మా పూర్వీకులకు ఇచ్చినవే. కాదనడం లేదు. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయించేందుకు మంత్రి గారి పేరు చెబుతున్నారు. మేం ఎప్పటినుంచో ఇంటిపన్ను, కరెంటు బిల్లుతోపాటు అన్ని పన్నులూ చెల్లిస్తున్నాం. నాకు భర్త లేడు. ఇద్దరు చదువుకుంటున్న చిన్న పిల్లలు. నేనేమీ బిల్డింగు కట్టడం లేదు. రాళ్లతో పైన రేకులు వేసుకున్నా. దానిని కూడా భవన నిర్మాణం అంటారా?
ఈ స్థలం మంత్రి గారికి చిన్నప్పుడు చదువు చెప్పిన వాళ్లదట. అందుకే మంత్రిగారే పంచాయితీ సెక్రటరీతో నోటీసు ఇప్పించారంటున్నారు. నాకు మరో గత్యంతరం లేకనే ఆత్మహత్యా ప్రయత్నం చేయాల్సివచ్చింది. నన్ను ఎవరూ ఆదుకోకపోతే మరేం చేయాలి’’
– ఇదీ పెనమలూరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం యాకమూరులో ఓ రజక మహిళ పందుల దీప గోస. పెనమలూరు నియోజకవర్గం మంత్రి పార్ధసారథి సొంత నియోజకవర్గం అన్న విషయం తెలిసిందే.

యాకమూరు గ్రామంలో నివసిస్తున్న రజక మహిళ దీపకు భర్త లేడు. పదో తరగతి చదివే కొడుకు, నాలుగో తరగతి చదివే ఇంకో చిన్నారితో బతుకు సమరం చేస్తోంది. ఆమె కుటుంబానికి పూర్వీకులు ఇచ్చిన 10 సెంట్ల భూమిలో, తన వాటాగా వచ్చిన స్థలంలో ఒక చిన్న గదిని రాళ్లతో కట్టి, పై రేకులతో నిర్మించుకుంది. వాటికి పిల్లర్లు కూడా లేవు. అన్నీ రాళ్లతో కట్టినవే కనిపించాయి.
అయితే, ఆ స్థలానికి సంబంధించి వివాదం చాలాకాలం నుంచీ ఉందని దీప చెబుతోంది. వందేళ్ల క్రితం ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన వారి పూర్వీకులయిన కరణం గారు.. ఆ గ్రామంలో రజకులు లేనందున, తమ పూర్వీకులను ఇక్కడకు తీసుకువచ్చి, అందుకు ప్రతిఫలంగా ఈ పది సెంట్ల స్థలం తమ కుటుంబానికి ఇచ్చారని చెబుతోంది. అయితే అప్పట్లో తమ పూర్వీకులు చదువుకోనందున, వారు కరణం గారి నుంచి ఎలాంటి పత్రాలు రాయించుకోలేదని వెల్లడించింది. ఆ పది సెంట్లలో తన భర్త వాటాగా వచ్చిన కొంత స్థలంలో చిన్న గదిని రేకులతో నిర్మించుకుంటే, దానికి వ్యతిరేకంగా తనపై పంచాయితీ కార్యదర్శిపై ఒత్తిడి చేయించి నోటీసు ఇప్పించారని దీప వివరించింది.
అయితే తమ వద్ద ఎలాంటి పత్రాలు లేకపోయినా కొన్నేళ్ల నుంచి పంచాయితీకి కడుతున్న ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, ఇతర బిల్లులున్నాయని ఆమె వాటిని చూపించింది. మరి తాను ఉంటున్నది అక్రమమయితే పంచాయతీ అధికారులు తన వద్ద ఆస్తిపన్ను, కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకుంటున్నారన్న ఆమె ప్రశ్నకు ఎవరి వద్దా జవాబు లేదు.
ఈ స్థలం మంత్రి గారికి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన గురువుగారిది అయినందున, మంత్రి గారు పంచాయతీ సెక్రటరీపై ఒత్తిడి చేసి నోటీసు ఇప్పించారని ప్రచారం జరుగుతోందని చెప్పింది. పైగా ప్రతిరోజు 5 నెంబర్ల నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, స్థలం ఖాళీ చేసి వెళ్లకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తాను జిల్లా ఇన్చార్జి మంత్రి సుభాష్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. దానితో తనకు మరో మార్గం లేక ఆత్మహత్యా ప్రయత్నం చేయాల్సి వచ్చిందన్నారు. తనలాంటి బడుగు జీవిపై దయచూపాల్సిన మంత్రి గారే నాకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వడం న్యాయమా? అని ప్రశ్నించారు.
‘‘భర్త లేని ఒంటరి ఆడదాన్ని. రజక కులానికి చెందిన దాన్ని. నాకెవరూ అండలేరనే ధీమాతో నన్ను వేధించడం ధర్మమా? ప్రభుత్వాలు నా లాంటి వాళ్లను ఆదుకోవా? పలుకుబడి ఉన్న వారిని చూస్తే భయమా? నాకున్న చిన్న ఇంటిని లాక్కొని ఏం బాగుపడతారు? ఇలాంటి పరిస్థితి వస్తుందనే నేను ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తే.. నువ్వు ఇంటిపన్ను కడుతున్నావు. కరెంటు బిల్లు కడుతున్నావు. నిన్ను ఎవరూ ఖాళీ చేయించరు. ఆ స్థలం నీదే. నీకు ఇంటి స్థలం ఎందుకు? అని గతంలో పంచాయతీ అధికారులు నాకు స్థలం ఇవ్వలేదు. ఇప్పుడేమో నోటీసులిస్తున్నారు? నేను చావాలా? బతకాలా? నేను చస్తే నా ఇద్దరు పిల్లలను ఎవరు చూస్తారు’’ అని దీప ఆవేదనతో ప్రశ్నించారు.
ఇదీ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఒక రజక మహిళపై జరుగుతున్న దాష్టీకం. మంత్రి గారి ఆదేశంతోనే తనకు నోటీసు ఇచ్చారంటున్న ఆ బడుగు కుటుంబానికి ఇప్పుడు న్యాయం ఎవరు చేస్తారు? నిజానికి లీగల్‌గా అయితే ఆ స్థలం ఆమెది కాదు. ఆ మేరకు అందుకు సంబంధించి ఆమె వద్ద ఎలాంటి పత్రాలూ లేవు. కానీ వందేళ్ల నుంచి అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆమెకు న్యాయం చేసేదెవరు? అసలు ఎలాంటి పత్రాలు లేకపోతే పంచాయతీ కార్యదర్శి ఆమె కుటుంబం నుంచి ఆస్తిపన్ను ఎందుకు కట్టించుకుంటున్నారు? విద్యుత్ శాఖ కరెంటు కనె క్షను ఇచ్చి, బిల్లు ఎందుకు కట్టించుకుంటోంది? మంత్రి గారి గురుదక్షిణకు బడుగు మహిళ బలవ్వాలా? అనే ప్రశ్నలకు జవాబు ఇచ్చే దెవరు?