ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు.
ఫైనల్ ఎంబిబిఎస్ జనరల్ సర్జరీ పేపర్-1 ఎగ్జామ్ ను టెక్నికల్ రీజన్స్ తో రద్దు చేస్తున్నట్లు, తిరిగి 27-04-2026 రోజున పరీక్షను మళ్ళీ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందని,దీనికి ప్రధాన కారణం పరీక్షల నియంత్రణ అధికారి మరియు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్ నిర్లక్ష్యం కారణంగా పరీక్ష పత్రంలో తప్పదొర్లడమే అన్నారు. పరీక్షను రద్దు చేసిన కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని,ఇంకెన్నాళ్ళు మీరు చేస్తున్న తప్పులకు మేం శిక్షను అనుభవించాలని వాపోతున్నారన్నారు.
మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే రాసే స్థితిలో లేమని, ఇలాంటి వాటివల్ల ముందు రాసే పరీక్షలపై ఫోకస్ చేయలేకపోతున్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు.ఇలాంటి ఘటనలు యూనివర్సిటీలో కొత్తేమీ కాదని గతంలో పాత ప్రశ్నా పత్రంతోనే పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారుల తీరు మారట్లేదన్నారు.
గతంలో పనిచేసిన ఉపకులపతి తన వ్యక్తిగత ప్రవర్తనతో పాటుగా,పీజీ పరీక్షల పత్రాల మూల్యాంకనంలో మరియు పరిపాలనా నిర్ణయాలలో అవకతవకలకు పాల్పడ్డాడడం కారణంగా స్వయంగా రాజీనామా చేసి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూనివర్సిటీకి నియమింపబడే ఉపకులపతులు హైద్రాబాద్ కేంద్రంగా పాలనకొనసాగిస్తారని, యూనివర్సిటీలో చుట్టపుచూపుకు వచ్చివెళ్తారని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
సిబ్బంది నియామకాల్లో, కళాశాలలకు అనుమతుల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పటికైన యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై హై లెవెల్ కమిటీనీ నియమించి నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.