– క్లస్టర్ల ముసుగులో కోట్ల కుంభకోణం
– కోసినా రూపాయి లేదంటూనే అయినవాళ్ల కోసం అప్పనంగా అడ్డగోలుగా పైసల ఖర్చు
– ATS ( ఫిట్ నెస్ టెస్టింగ్ కేంద్రాల) ముసుగులో రూ.600 కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్
– అన్న కొడుకు కోసం ఓ మంత్రి గారి తిప్పలు
– రెండు సార్లు టెండర్ పిలిచాక రద్దు
-మూడో సారి క్లస్టర్లుగా విభజించి టెండర్లు
– నిర్మాణానికి ఒక్కో కేంద్రానికి రూ.8 కోట్ల నిర్ధారించి రూ.11.50 కోట్లకు పెంపు
– బిడ్డింగ్ లో పాల్గొనే కంపెనీల నిబంధనల విషయంలో చిత్రవిచిత్రాలు
– పొరుగు రాష్ట్రంలో పైసా ఖర్చు లేకుండా సర్కారుకు ఆదాయం
– తెలంగాణలో మాత్రం.. ఏడాదికి అటీటుగా రూ.35 కోట్లు వచ్చే ఆదాయానికి ..రూ.49 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయిన సర్కారు
– రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు స్కాములు.. ఇందుగలదందు లేదని సందేహంబు వలదు.. ఎందెందు వెదకి చూచినా అందందు గలదు.. అన్నట్టుగానే ఉంది. తాజాగా రవాణా శాఖలో దాదాపు రూ.600 కోట్ల స్కాంకు సర్కారు తెరలేపింది. వాహనాల ఫిట్ కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో భారీగా దండుకునేందుకు సర్కారు ప్రణాళికలు వేసింది.
పొరుగు రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రయివేటు పార్ట్ నర్ షిప్ లో, ప్రయివేటు వాళ్లే నిర్మించి.. ప్రభుత్వానికి కొంత కమిషన్ చెల్లించే విధానంలో.. సర్కారు ఖజనా నుండి రూపాయి బయటకు పోకుండా.. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం.. ఖజానా నుండి ఉత్తిపుణ్యానికి రూ.600 కోట్లు గాయబ్ చేసేందుకు రూ 900 కోట్లు ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధపడింది.
ఆది నుండి అక్రమ ఆలోచనలే..
వాహనాల ఫిట్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 37 కేంద్రాల కోసం ఫిబ్రవరి 2025లో మొదటి సారి టెండర్లు పిలిచారు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.8 కోట్ల ఖర్చుగా పేర్కొన్నారు. శాంక్షన్ కూడా ఇచ్చారు. కొద్ది రోజులకే దాన్ని రద్దు చేశారు. మళ్లీ జులై.. 2025లో మరోసారి టెండర్ పిలిచారు. దాన్ని కూడా రద్దు చేశారు. ఇక తాజాగా ఈ నెల 2వ తేదీన మరో టెండర్ పిలిచారు.
అయితే.. ఇందులో చాలా మార్పులు చేశారు. గతంలో రెండు టెండర్లలో 37 కేంద్రాలకు గాను బిడ్డింగ్ లు ఆహ్వానించారు. కానీ 2 ఏప్రిల్ 2026 నాడు పిలిచిన టెండర్ .. క్లస్టర్లు గా విభజించి టెండర్లు పిలిచారు. అయితే ఇక్కడ 37 కేంద్రాలకు టెండర్లు పిలవకుండా.. 7 కేంద్రాలతో ఒక క్లస్టర్… 8 కేంద్రాలతో మరో క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇందులో మాత్రం.. ఒక్కో కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చును రూ.8 కోట్ల నుండి రూ.11.50 కోట్లకు పెంచేశారు. రూ. 8 కోట్ల చొప్పున 37 కేంద్రాలకు రూ.296 కోట్లు అవుతుంది. కానీ.. పెంచిన మొత్తంతో కలుపుకుంటే.. అది రూ.425 కోట్లకు పెరిగిపోయింది. ఇక్కడే ప్రభుత్వ అవినీతి కుట్రలు బయటపడ్డాయి.
ఇవే కాదు.. మెయింటనెన్స్ కోసం ఒక్కో స్టేషన్ కు నెలకు రూ.11 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. 37 స్టేషన్లకు రూ.ఏడాదికి 48.5 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. పదేళ్లకు గాను టెండర్ పిలుస్తున్నారు. అంటే.. ఇదే 490 కోట్ల రూపాయలు అవుతోంది. 37 ఫిట్ నెస్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు అయ్యే రూ. 425 కోట్లు కలిపితే.. మొత్తంగా రూ.900 కోట్ల ఖర్చు చూపి రూ 600 కోట్ల రూపాయల స్కాంకు సర్కారు తెరలేపింది.
స్కాం అనడానికి ఇదే రుజువు..
మరి ఇంత ఖర్చు పెడితే సర్కారుకు వచ్చే ఆదాయం ఎంత.? దాదాపుగా ఏడాదికి 5 లక్షల వాహనాలు టెస్టింగ్ కోసం వస్తే.. రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఒక్కో కేంద్రానికి ఏడాదికి సర్కారు పెడుతున్న ఖర్చు రూ.49 కోట్లు. అంటే అటీటుగా రూ.15 కోట్లు ప్రభుత్వానికే నష్టం. అయినా కూడా ఈ పని చేస్తున్నారంటే.. స్కాం కాకుంటే మరేంటి.? పొరుగు రాష్ట్రాల్లో పైసా ఖర్చు లేకుండా ఆదాయం వస్తోంటే.. మన సర్కారు మాత్రం ఎందుకు రూ.900 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. ?
టెండర్ల ప్రక్రియలో.. నిబంధనల్లోనూ గోల్ మాల్..
8 స్టేషన్లను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్ కోసం టెండర్ వేసే వాళ్లు 2025లో రూ.50 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉండాలని నిబందనల్లో పేర్కొన్నారు. కానీ.. 7 స్టేషన్లున్న క్లస్టర్ కు మాత్రం కేవలం రూ.9 కోట్లు ఉంటే సరిపోతుందని చెప్పారు. కేవలం ఒక్క స్టేషన్ తగ్గింది. కానీ.. నెట్ వర్త్ విషయంలో భారీ వ్యత్యాసం వచ్చింది. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఈ నెల 17న(శుక్రవారం రోజున) టెండర్ గడువు ముగుస్తోంది.
కానీ సడెన్ గా గురువారం రోజున టెండర్ నిబందనల్లో మార్పులు చేశారు. 8 కేంద్రాలున్న క్లస్టర్ కు నెట్ వర్త్ ను రూ.50 కోట్ల నుండి రూ.10 కోట్లకు తగ్గించేశారు. అలాగని.. టెండర్ గడువు కూడా పెంచలేదు. అంటే ఇంత హడావుడిగా.. ఎవరికి తెలియకుండా.. ఎందుకు నెట్ వర్త్ లో మార్పులు చేయాల్సి వచ్చింది.? తప్పుడు ఉద్దేశం లేకపోతే.. టెండర్ గడువు ముగిసే ముందుకు రోజు ఎందుకు ఈ మార్పులు చేస్తారు?
ఖచ్చితంగా ఇందులో తక్కువలో తక్కువ రూ.600 కోట్లు కొల్లగొట్టేందుకు సర్కారు పెద్దలు ప్రణాళికలు రచించారు. ఇందులో ఓ మంత్రి అన్న కొడుకు కీలకంగా చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కోసమే నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చినట్టు స్పష్టమవుతోంది.
ఇందులో నిజంగానే ఎలాంటి స్కాం లేకపోతే ప్రభుత్వం ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
1.పక్క రాష్ట్రాలు BOO(బిల్డ్ ఓన్ ఆపరేట్ )మోడల్ తీసుకుంటే.. ఎందుకు తెలంగాణ సర్కారు CAPEX (క్యాపిటల్ ఎక్స్ పెండిచర్) కాపెక్స్ మోడల్ తీసుకుంది.? కోసినా రూపాయి లేదని చెబుతూ.. పెన్షన్లు ఇవ్వడానికి.. రిటైర్మెంట్ బెన్ ఫిట్ లు ఇవ్వడానికి..ఏ పనికి.. ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవని చెబుతూ.. ఎందుకు వీటిని ప్రభుత్వ సొమ్ముతో కడుతున్నారు?
2. టెండర్లు రెండు సార్లు ఎందుకు రద్దు చేశారు? మూడో సారి క్లస్టర్లుగా మార్చి ఎందుకు టెండర్ పిలిచారు?
3.టెండర్లలో పాల్గొనే వారికి ఒక క్లస్టర్ లో రూ.50 కోట్లు.. నెట్ వర్త్ అని పెట్టి.. మరో క్లస్టర్ లో ఎందుకు కేవలం రూ.8.9 కోట్లుగా పెట్టారు.
4. క్లస్టర్ 1లో నెట్ వర్త్ విలువను టెండర్ గడువు ముగిసే ముందు రోజు ఎందుకు రూ.50 కోట్ల నుండి రూ.10 కోట్లకు మార్చారు?